టీచర్ పోస్టుల్లో కోత | Teacher posts, cutting | Sakshi
Sakshi News home page

టీచర్ పోస్టుల్లో కోత

Published Thu, Nov 27 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

టీచర్ పోస్టుల్లో కోత

టీచర్ పోస్టుల్లో కోత

నెల్లూరు(విద్య) : ఎన్నికల హామీల్లో భాగంగా ఊరిస్తూ ఊరిస్తూ.. టెట్, టీఆర్‌టీ (డీఎస్సీ) షెడ్యూల్‌ను విడుదల చేశారు. పోస్టుల భర్తీలో రుణమాఫీ, పింఛన్లు పంపిణీలలో మెలికలు పెట్టినట్టే టీచర్ల భర్తీలోనూ బాబు మార్క్ మెలికను పెట్టారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మొత్తాన్ని రూ.1.5 లక్షకు కుదించడం, వృద్ధాప్య పింఛన్‌ను రూ. 1,000కి పెంచి ఆధార్‌లింక్‌ను పెట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం ఇలా ప్రతి వాగ్దానానికి మెలికపెట్టడం బాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య.

విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీలో సైతం ఇదే తీరును అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల భర్తీలో నోటిఫై చేసిన ఖాళీల్లో 20 శాతం తగ్గించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఆర్థికశాఖ ప్రమేయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని మొత్తం 416 పోస్టులు కాస్త 333కు తగ్గిపోయాయి. నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫీజులకు గడువు నిర్ణయించారు. మే 9, 10, 11 తేదీల్లో అర్హత పరీక్షలు నిర్వహించేలా ప్రకటించారు.

అయితే ప్రభుత్వం నిర్ణయంతో రెండేళ్ల తర్వాత అర్హత పరీక్షకు నోటిఫికేషన్ వెలువడిన సంతోషంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ 20 శాతం కోత ప్రాతిపదికన చేశారో తెలియక అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు టీచర్ పోస్టుల్లో కోత విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారో ఇంతవరకు కచ్చితమైన లెక్కలు తేలలేదు. విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఉపాధ్యాయుల నియామకం ఉంటుంది.

అయితే రేషనలైజేషన్, పని సర్దుబాటు ప్రక్రియలు జరగకపోవడంతో అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్య సైతం తెలియాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఏఏ పోస్టులను తగ్గించి ప్రతిపాదనలు పంపారో అర్థం కాని పరిస్థితి. ఉన్న ఖాళీలను యధాతథంగా జిల్లా నుంచి పంపారు. ఆర్థికశాఖ ఆదేశాలతో 20 శాతానికి కుదించిన జాబితాను సైతం పంపినట్లు సమాచారం. ఏఏ పోస్టులను ఎలా తగ్గించారో తెలియని పరిస్థితి.  డీఎస్సీలో పోస్టుల కోతల  విషయం జిల్లా అధికారులను సంప్రదించగా ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించి ప్రతిపాదనలు పంపామని, అంతకు మించి ప్రస్తుతం తమ దగ్గర సమాచారంలేదని చేతులు దులుపుకుంటున్నారు.

బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టుల నుంచి మినహా ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయాలు అభ్యర్థులపాలిట శాపంగా మారాయి. సిలబస్, టెన్త్, ఇంటర్, చదవకుండా నేరుగా ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ పూర్తి చేసి బీఈడీ చేసిన అభ్యర్థుల అర్హతపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల వాగ్దానాల అమలులో భాగంగా వాయిదాల మీద వాయిదా వేస్తూ ప్రతి హామీకి మెలికలు పెట్టడం టీడీపీ ప్రభుత్వానికి అలవాటై పోయిందని నిరుద్యోగ ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement