టీఎస్‌పీఎస్‌సీ ద్వారా టీచర్ల భర్తీకి మరికొంత కాలం జాప్యం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ప్రారంభించనున్న కొత్త గురుకుల విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులతో విద్యాబోధన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత ఉద్యోగులను నియమించేవరకు ఈ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది కొత్తగా 221 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి, పరీక్షలు, ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించి టీచర్లను నియమించేప్పటికి కనీసం 3, 4 నెలల కాలం పట్టవచ్చని సంక్షేమ శాఖల అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా గురుకుల పాఠశాలల అవసరాలకు అనుగుణంగా, ప్రిన్సిపాల్ పోస్టులు మొదలుకుని, ఆయా సబ్జెక్ట్ టీచర్ల వరకు విద్యార్హతలకు అనుగుణంగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. నెలాఖరులోగానే ఈ టీచర్ల ఎంపికను పూర్తి చేయనున్నారు. వంద ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకుల పాఠశాలల్లో దాదాపు రెండున్నర వేల మంది టీచర్లు అవసరమవుతారని ఆయా శాఖల అధికారులు అంచనా వేశారు.
జూలై 1 నుంచి తరగతులు...: వచ్చేనెల (జూలై) 1 వ తేదీ నుంచి కొత్తగురుకుల పాఠశాలల్లో తరగతులను మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరంలో ముందుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల స్కూళ్లలో 5, 6 తరగతులను ప్రారంభిస్తారు. అందుబాటులో ఉన్న సంక్షేమహాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, భవనాలు, ప్రైవేట్ భవనాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారని అధికారవర్గాల సమాచారం. కొంత ఆలస్యంగానే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల తరగతులు మొదలుకావొచ్చని అధికారులు చెబుతున్నారు.
కొత్త గురుకులాల్లో ‘కాంట్రాక్ట్’ బోధన
Published Fri, Jun 17 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM