మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..
⇒పసికందును చంపేందుకు కసాయిగా మారిన కన్నతండ్రి
⇒కుటుంబసభ్యులు బతిమలాడినా కరగని మనసు
⇒పోలీసులకు, ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చిన 108 సిబ్బంది
⇒తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి స్టేట్‌మెంటు రాసుకున్న పోలీసులు
⇒పలమనేరులో సంచనలం రేపిన ఘటన
పలమనేరు: రెండో బిడ్డకూడా ఆడపిల్లే పుట్టిందని చంపేందుకు సిద్ధమయ్యాడో కసాయి తండ్రి. భార్య, కుటుంబసభ్యులు ఎంత వారించినా మనసు కరగలేదు. విషయం పోలీసులు, స్త్రీ–మహిళాసంక్షేమశాఖకు చేరడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చి బిడ్డకు హాని తలపెట్టనంటూ వాంగ్మూలం తీసుకున్నారు. ఈసంఘటన శుక్రవారం పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన శంకరప్ప(30), నాగమ్మ(24)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల ఆడపిల్ల ఉంది. శంకరప్ప తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగమ్మ మళ్లీ గర్భం దాల్చింది. రెండోబిడ్డ అయినా మగబిడ్డే కావాలని శంకరప్ప కలలుగన్నాడు. ఈనెల14న నాగమ్మకు ప్రసవనొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండో కాన్సులోనూ ఆడపిల్ల జన్మించింది.
దీన్ని తట్టుకోలేని తండ్రి అప్పుడే శిశువు గొంతు నులిమి చంపేందుకు యత్నించా డు. దీంతో భార్య అడ్డుకుంది. ఈ విషయం తెలిసిన నాగమ్మ తండ్రి బిడ్డను తాను సంరక్షిస్తానని ముందుకొచ్చాడు. అయినా ఖాతరుచేయని తండ్రి తాను బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా బతిమలాడారు. అయినా అతని మనసు కరగలేదు. గురువారం ఆమెను ఆస్పత్రినుంచి డిశ్చార్చి చేయగా నాగమ్మ ఇంటికెళ్లలేదు. ఇంటికెళితే తనభర్త అన్నంత పనిచేస్తాడంటూ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఈ విష యం తెలుసుకున్న 108 సిబ్బంది కిశోర్, బాబా జాన్ స్థానిక ఉమెన్ అండ్ జువనైల్‌వింగ్‌కు సమాచారం ఇచ్చారు.
సీడీపీవో రాజేశ్వరి, గ్రామ అంగ న్ వాడీ వర్కర్ సరసమ్మ, మహిళా పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ కీరీమున్నీసా సిబ్బందితో కలసి ఆస్పత్రికి చేరుకున్నారు. శంకరప్పకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బిడ్డ ప్రాణానికి ఏం జరిగినా బాధ్యత తండ్రిదేనని వాగ్మూలం తీసుకున్నారు. అంగన్‌వాడీ వర్కర్ పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. వీరి వెంట సూపర్‌వైజర్ ప్రసన్న, షీ టీం సిబ్బంది కవిత తదితరులు పాల్గొన్నారు.