ఘాట్‌ రోడ్డులో ఘోరం:10మంది దుర్మరణం | Huge Road Accident In Chittoor District Mogili Ghat | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డులో ఘోరం

Published Sat, Nov 9 2019 4:23 AM | Last Updated on Sat, Nov 9 2019 4:25 AM

Huge Road Accident In Chittoor District Mogili Ghat - Sakshi

ప్రమాదంలో తునాతునకలైన కంటెయినర్‌

బంగారుపాళ్యం (చిత్తూరు జిల్లా):  సమీప బంధువు ఒకరు మరణించడంతో పరామర్శించేందుకు వెళ్లిన వారిని విధి వెక్కిరించింది. మృతుడి కుటుంబసభ్యుల్ని ఓదార్చి తిరిగి గ్రామానికి బయల్దేరిన వారికి అదే చివరి రోజైంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఘాట్‌ రోడ్డులో డీజిల్‌ ఆదా చేసేందుకు కంటైనర్‌ డ్రైవర్‌ ఇంజిన్‌ ఆఫ్‌ చేయడమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల్లో 9 మంది చిత్తూరు జిల్లా గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి.

బెంగళూరు నుంచి వాటర్‌బాటిళ్ల లోడ్‌తో విజయవాడకు వెళ్తున్న కంటైనర్‌ బంగారుపాళ్యం సమీపంలోని మొగిలి ఘాట్‌ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి.. ఎదురుగా వస్తున్న ఓమ్ని వాహనం, ద్విచక్రవాహనంపై బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓమ్ని వాహనంలో ప్రయాణిస్తున్న 9 మంది, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కంటైనర్‌ డ్రైవర్‌ ఆచూకీ తెలియలేదు. 

అతను సంఘటన జరిగిన వెంటనే పరారై ఉంటాడని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం అతను కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు10 మంది మృతులను గుర్తించగా.. వారిలో డ్రైవర్‌ అక్షయ్‌ లేడు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం సాయంగా రూ.50 వేలు, వైఎస్సార్‌ భరోసా కింద రూ.7 లక్షలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. 

అసలేం జరిగింది..? 
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన వెంకటమ్మ చెల్లెలి భర్త శ్రీనివాసులు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడిది తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లె కావడంతో శ్రీనివాసులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెంకటమ్మతో పాటు బంధువులు, మర్రిమాకులపల్లె గ్రామస్తులు తెల్లగుండ్లపల్లెకు వెళ్లారు. అంత్యక్రియలు శనివారం కావడంతో తిరిగి వాహనంలో మర్రిమాకులపల్లెకు పయనమయ్యారు. అదే సమయంలో వాటర్‌ బాటిళ్లతో విజయవాడ వైపు వెళ్తున్న కంటైనర్‌ బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ వద్ద అతి వేగం వల్ల అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

మర్రిమాకులపల్లెకు చెందిన గ్రామస్తులు ప్రయాణిస్తున్న ఓమ్ని వాహనంతో పాటు వెనుకనే వస్తున్న ద్విచక్రవాహనంపై కంటైనర్‌ బోల్తాపడింది. దీంతో ఓమ్నిలో ప్రయాణిస్తున్న రామచంద్ర (39), రాము (38), సావిత్రమ్మ (50), ప్రమీల(37), సుబ్రహ్మణ్యం(40), శేఖర్‌ (45), వెంకటమ్మ(70), పాపన్న (43) రాణెమ్మ (45)తో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బంగారుపాళ్యం మండలం బలిజపల్లెకు చెందిన నరేంద్ర (40) అక్కడిక్కడే మరణించారు. కంటైనర్‌ క్లీనర్‌ రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటో త్రుటిలో పక్కకు తప్పుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

మంటల్లో సజీవ దహనమైన ద్విచక్రవాహనదారుడు 
పలమనేరు–చిత్తూరు మధ్యలో బంగారుపాళ్యం సమీపంలోని మొగిలి వద్ద ఘాట్‌ సుమారు 30 అడుగుల కిందకు ఉంటుంది. డీజిల్‌ ఆదా చేసేందుకు డ్రైవర్‌ వాహనాన్ని న్యూట్రల్‌ చేయడంతో దీంతో ఒక్కసారిగా వేగం పెరిగింది. చీకట్లో సరిగా కనిపించకపోవడంతో వేగంగా దూసుకుపోతున్న వాహనాన్ని స్లో చేసేందుకు బ్రేక్‌ వేశాడు. అయితే బ్రేక్‌ పనిచేయకపోవడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత కంటైనర్‌ ఓమ్ని వాహనంపై బోల్తాపడటంతో భారీ శబ్దం రావటంతో పాటు వాహనంలో నుంచి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆ మార్గంలో ద్విచక్రవాహనం నడుపుతూ వెళ్తున్న నరేంద్ర సజీవ దహనమయ్యాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తొమ్మిది మంది గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలున్నారు. 

మాంసపు ముద్దలు.. తెగిన శరీర భాగాలు 
చిత్తూరు అర్బన్‌: ప్రమాద స్థలి వద్ద మృతదేహాలు గుర్తుపట్టలేనంత మాంసపు ముద్దలుగా మారిపోయాయి. వ్యాను నుంచి పెట్రోలు లీకై మంటలు రావడంతో కొన్ని మృతదేహాలు పాక్షికంగా కాలిపోయాయి. వ్యానుపై కంటైనర్‌లోని వాటర్‌బాటిళ్లు పడడంతో శరీర భాగాలు చెల్లచెదురైపోయాయి. ఓ మృతదేహం మొండెం నుంచి తల వేరుపడి వంద అడుగుల దూరంలో పడింది. ఓ చేయి పూర్తిగా తెగిపోయింది. దీంతో ప్రమాద స్థలం వద్ద భయానక వాతావరణం కనిపించింది. ఈ ఘటనను చూసినవారు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. మృతదేహాలపై దుస్తులు, ముఖాల్ని చూసి చనిపోయినవారిని గుర్తించగలిగారు.   
చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు 

ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి 
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలిఘాట్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను పరామర్శించాలని ఎమ్మెల్యేకు సూచించారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు, వైఎస్సార్‌ భరోసా కింద రూ.7 లక్షలు అందజేయాలని ఆదేశించారు.   

కొంపముంచిన అనుభవలేమి!
చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం.. కంటైనర్‌ యజమాని అక్షయ్‌కు డ్రైవింగ్‌లో అనుభవం లేకపోవడమేనని తెలుస్తోంది. డ్యూటీకి రావాల్సిన డ్రైవర్‌ సెలవులో ఉండటంతో అక్షయ్‌ డ్రైవింగ్‌ చేసి 10 మంది మృతికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ క్లీనర్‌ రాజేశ్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన అక్షయ్‌ (26) ఏపీ39 ఎక్స్‌ 7902 కంటైనర్‌ వాహనాన్ని అద్దెకు నడుపుతున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న కంటైనర్‌ను తీసుకురావాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పాడు. అయితే.. తనకు సెలవు కావాలని, తాను వెళ్లనని చెప్పి డ్రైవర్‌ ఇంటికెళ్లిపోయాడు. దీంతో క్లీనర్‌ గుంజా రాజేశ్‌ (27)తో అక్షయ్‌ హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ ఐరన్‌ పైపుల బాడుగ దొరకడంతో బెంగళూరు వెళ్లి పైపులు అన్‌లోడ్‌ చేశారు.

తర్వాత విజయవాడకు కిన్లే వాటర్‌ బాటిళ్ల బాడుగ దక్కడంతో లోడ్‌ చేసుకొని శుక్రవారం ఉదయం విజయవాడకు బయలుదేరారు. వారు ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి పలమనేరు చేరుకునేలోపు ఐదుసార్లు టైర్లకు పంక్చర్లు పడ్డాయి. ఇవేమి అపశకునాలనుకుంటూనే వారిద్దరూ బయలుదేరారు. పలమనేరు చేరుకోగానే తాను నిద్రపోతానంటూ అప్పటివరకు డ్రైవింగ్‌ చేసిన క్లీనర్‌ రాజేశ్‌ పడుకున్నాడు. మొగిలి ఘాట్‌కు చేరుకున్నాక కంటైనర్‌కు బ్రేకులు పడటం లేదని, వాహనం నడుపుతున్న యజమాని అక్షయ్‌ చెప్పాడు. అయితే.. మళ్లీ డ్రైవింగ్‌ అప్పగించేందుకు అక్షయ్‌ అబద్ధం చెబుతున్నాడని భావించిన క్లీనర్‌ రాజేశ్‌ అలాగే ఉండిపోయాడు. అంతలోనే అక్షయ్‌.. ‘రాజేశ్‌ దూకేయ్‌.. దూకేయ్‌’ అంటూ అరవడంతో తేరుకున్న రాజేశ్‌ కంటైనర్‌ నుంచి దూకేశాడు. అతడిపై వాటర్‌ బాటిళ్లు పడిపోయాయి. సమీపంలో ఉన్నవారు అతడిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. 

డీజిల్‌ ఆదా చేయాలని.. 
మొగిలి ఘాట్‌లో డౌన్‌లో డీజిల్‌ ఆదా చేయాలని కంటైనర్‌ను న్యూట్రల్‌ చేయడంతో వేగం అందుకుంది. వేగాన్ని నియంత్రించాలని బ్రేకులు వేయగా పడలేదు. దీంతో కంటైనర్‌ అదుపు తప్పింది. మోటార్‌ బైక్‌ను ఢీకొని ఓమ్ని వ్యాన్‌పై పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న 9 మంది, బైకు నడుపుతున్న వ్యక్తి మృత్యువాత పడ్డారు.  

నిమిషం ఆలస్యమైతే.. 
మొగిలి ఘాట్‌ సమీపంలోనే శ్రీని ఫుడ్స్‌ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో పలమనేరు టౌన్‌ గంటావూరుకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. వీరిని రోజూ ఒక ఆటో తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. శుక్రవారం కూడా 13 మంది కూలీలను ఫ్యాక్టరీ నుంచి తీసుకెళ్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న కంటైనర్‌ను ఆటో డ్రైవర్‌ గమనించాడు. ఆటో వెళ్లిన ఒక్క నిమిషంలోనే కంటైనర్‌ డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే ఆటోలో ఉన్న కూలీలు కూడా మృత్యువాత పడేవారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు.  

ఏ సమయానికి ఏం జరిగింది.. 
శుక్రవారం సాయంత్రం 6.20 గంటలు : బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న కంటైనర్‌ మొగిలి ఘాట్‌ రోడ్డు వద్దకు చేరుకుంది. డ్రైవర్‌ అచ్చయ్య గేరు వేయకుండా వాహనాన్ని న్యూట్రల్‌ చేశాడు. దీంతో వాహన వేగం ఒక్కసారి పెరిగింది.  
6.24 గంటలు: బ్రేక్‌ వేసేందుకు డ్రైవర్‌ ప్రయత్నించగా.. అది ఫెయిలైనట్లు గుర్తించాడు. దీంతో గట్టిగా అరుస్తూ క్లీనర్‌ రాజేష్‌ను కిందకి దూకేయమంటూ గట్టిగా అరిచాడు. 
6.25 గంటలు: వాహనం ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళ్లే రోడ్డుమీదకు వచ్చేసింది.  
6.26 గంటలు: ఓమ్ని వ్యానులో గంగవరం మండలం మర్రిమాకుçపల్లెకు చెందిన తొమ్మిది మంది బయలుదేరారు. వ్యాను ఘాట్‌ రోడ్డు ఎక్కుతుండగా... క్షణాల్లో కంటైనర్‌ డివైడర్‌ దాటుకుని వ్యానుపై బోల్తా పడింది.  
6.28 గంటలు: ట్రక్కు చక్రాల కింద ఓమ్ని వ్యాన్‌ ఇరుక్కుని దాదాపు 300 మీటర్ల వరకు తోసుకుంటూ వెళ్లింది. అదే సమయంలో మొగిలి నుంచి పలమనేరుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరేంద్రను సైతం ట్రక్కు లాగేసింది. మారుతీ వ్యానులోంచి ఒక్కసారిగా పెట్రోలు లీకై మంటలు అంటుకున్నాయి.  
6.43 గంటలు : ప్రమాదం జరిగిన 15 నిమిషాల అనంతరం శ్రీని ఫుడ్స్‌ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది మంటలు చూసి.. ఫ్యాక్టరీలోని అగ్నిమాపక పరికరాలు తీసుకొచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే వ్యాను 30 శాతం కాలిపోయింది. ట్రక్కు నుంచి బాడీ, క్యాబిన్‌ వేర్వేరుగా ఊడిపోయాయి. 
6.50 గంటలు: పోలీసులు శ్రీని ఫుడ్స్‌ నుంచి క్రేన్‌ తెప్పించి వాహనాలను బయటకు తీశారు. తెగిపడ్డ శరీర భాగాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది.  

మొత్తం సచ్చిపోయినారు సామీ!

సంఘటన స్థలంలో విలపిస్తున్న మృతుల బంధువులు 

‘ఫోన్లు పనిచేయడం లేదని పలమనేరు నుంచి వెనక్కి వచ్చి చూస్తే మొత్తం సచ్చిపోయినారు సామీ’ అంటూ మర్రిమాకులపల్లి మృతు లకు పెద్ద దిక్కు అయిన రెడ్డి శేఖర్‌ సంఘటనా స్థలంలో రక్తపుముద్దలా మారిన కుటుంబీ కులను చూసి బోరున విలపించాడు. శేఖర్‌ చిన్నాన్న తెట్టుగంట్లపల్లిలో మృతి చెందడంతో కుటుంబీ కులంతా అక్కడకు వెళ్లారు. అంత్యక్రియల కార్యక్రమం ముగిశాక శుక్రవారం సాయంత్రం ఓమ్నీ వ్యాన్‌లో బయలుదేరారు. వారి వెనుకనే రెడ్డి శేఖర్‌ మరో కారులో వస్తున్నాడు. మొగిలి ఘాట్‌లో ఈ ప్రమాదాన్ని చూసినా ఎవరో అనుకుని పలమనేరుకు వచ్చేశాడు. అయితే.. తన కంటే ముందే బయలుదేరిన తన కుటుంబీకులు ఇంకా రాకపోవడంతో పలమనేరు నుంచి వెనక్కి వచ్చి ప్రమాదం జరిగిన చోట చూడగా మృతులంతా కుటుంబీకులే కావడంతో నిశ్చేష్టుడయ్యాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement