నిందితులను అరెస్టు చూపుతున్న డీఎస్పీ , సీఐలు
– రూ.20 లక్షల సొత్తు రికవరీ
– దోపిడీకి పాల్పడింది తమిళనాడు అంతరాష్ట్ర ముఠా
పలమనేరు: పలమనేరు పట్టణంలో డ్రైవర్‌పై దాడి చేసి పైపుల లారీని హైజాక్ చేసిన కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. లారీతోపాటు అందులోని స్టీల్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శంకర్, సీఐలు సురేందర్ రెడ్డి, రవికుమార్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన డ్రైవర్ కమ్ ఓనర్ బాబు లారీలో కోల్‌కతా నుంచి స్టీల్ పైపులను బెంగళూరుకు బయలుదేరాడు. గతనెల 12న పలమనేరులో లారీని ఆపి ఇంటికి వెళ్లాడు. క్లీనర్ రాకపోవడంతో ఆ రాత్రి లారీలోనే నిద్రించాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లారీలోకి ప్రవేశించి డ్రైవర్‌పై కత్తులతో దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి మొగిలి సమీపంలోని అడవిలో పడేసి లారీని అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మండలంలోని కాలువపల్లె అటవీ ప్రాంతంలో శనివారం తమిళనాడు రాష్ట్రం కేవీ కుప్పం గ్రామానికి చెందిన పళని(29), కోలైనాడుకు చెందిన దయానిధిని అదుపులోకి తీసుకున్నారు. వారు తమ స్నేహితులు అదే ప్రాంతానికి చెందిన గోవిందరాజన్, ప్రవీణ్, గౌతమ్ కలిసి ఇండికా కారులో పలమనేరు వచ్చి డ్రైవర్ బాబుపై దాడి చేసి లారీని తీసుకెళ్లినట్టు అంగీకరించారు. అనంతరం లారీని తమిళనాడులోని క్రిష్ణగిరిలో వదిలేసి పైపులను మరో చోట దాచిపెట్టినట్టు పేర్కొన్నారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని 550 స్టీల్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. టైర్లను సైతం రకవరీ చేశారు. ఈ కేసులో మరో ముగ్గురిని త్వరలోనే పట్టికుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీఐలు సురేందర్ రెడ్డి, రవికుమార్, ఎస్‌ఐ లోకేష్, ఐడీపార్టీ దేవ తదితరులను ఆయన అభినందిచారు. వీరికి రివార్డుల కోసం ఎస్పీ శ్రీనివాస్‌కు సిపారసు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసులను స్థానిక లారీ అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు.