
నగల కోసం నయవంచన
స్నేహితురాలి నగలపై కన్నేశాడు. రెండేళ్లుగా ప్రేమించినట్టు నటించాడు.
పలమనేరు: స్నేహితురాలి నగలపై కన్నేశాడు. రెండేళ్లుగా ప్రేమించినట్టు నటిం చాడు. పెళ్లి చేసుకుందామని కాణిపాకానికి తీసుకెళ్లాడు. అక్కడ తాళి కట్టాడు. తిరుగు ప్రయాణంలో ఓ అడవిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. మెడలోని నగలను లాక్కొన్నాడు. ఇదేమని ప్రతిఘటించిన ఆమెపై పెద్ద బండరాయిని వేశాడు. చనిపోయిందనుకుని నగలతో అక్కడి నుంచి ఉడాయించాడు. స్పృహలోకొచ్చిన బాధితురాలు స్థాని కుల సాయంతో ఆస్పత్రిలో చేరింది. ఈ సంఘటన గురువారం పలమనేరు మండలంలోని కాలువపల్లె అటవీప్రాంతంలో చోటుచేసుకుంది.
బాధితురాలి కథనం మేరకు...
తమిళనాడు రాష్ట్రం పల్లికొండ సమీపంలోని కీల్‌చేర్ గ్రామానికి చెందిన ఓ యువతి(23)కి, అంబూరు సమీపంలోని మేల్‌వయిదన కుప్పానికి చెందిన టైలర్ పెరియ మురుగతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ యువతి ఓ ప్రైవేటు షూ కంపెనీలో పనిచేస్తోంది. పెళ్లి కోసం నగలను సిద్ధం చేసుకుంది. వాటిపై కన్నేశాడు మురుగ. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. అతని మా టలు నమ్మిన ఆమె గురువారం ఉద యం ఇంటి నుంచి వచ్చేసింది. ఇద్దరూ స్కూటర్‌పై బయల్దేరి కాణిపాకం చేరుకున్నారు.
అక్కడ ఉదయం 10.30 గంట లకు పెళ్లి చేసుకున్నారు. తర్వాత తమిళనాడుకు తిరుగు ప్రయాణమయ్యారు. దారి మధ్యలో పలమనేరు మండలంలోని కాలువపల్లె కౌండిన్యా అటవీప్రాంతం చాలా బాగుంటుందని చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బలవంతంగా ఆమె మెడలోని నెక్లెస్, మూడు చైన్లు, ఓ హారం లాక్కున్నాడు. వాటితో పాటు ఉదయం తాను కట్టిన తాళిని సైతం తీసుకున్నాడు. దీంతో బాధితురాలు ప్రతిఘటించగా ఓ పెద్ద బండ రాయిని వేశాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన యువతి స్పృహ కోల్పోయింది. చనిపోయిందనుకుని భావించిన నిందితుడు నగలతో బైక్‌పై ఉడాయించాడు. కొంతసేపటికి స్పృహలోకొచ్చిన బాధితురాలు అతి కష్టంపై అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకుంది. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారమందించారు. వారు ఆమెను పలమనేరు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు.