రకరకాల ప్రచారాలతో భారీగా మోసాలు
లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న అమాయకులు
పలమనేరు: జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్ ముఠాలు మళ్లీ పేట్రేగుతు న్నా యి. ఈ ముఠాల కారణంగా ఎందరో అమాయకులు మోసపోతున్నారు. రైస్ పుల్లింగ్ అనే మత్తులో పడి ఇంకొందరు ఇప్పటికే తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఆర్‌పీ ముఠా మాటలు నమ్మి కోట్లు సంపాదించాలనే ఆశతో ఈ ప్రాంతంలో వందలాది మంది ఇదే వృత్తిగా పలువురు ఏజెంట్లను తయారు చేసి అన్వేషణ సాగిస్తున్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఇలాంటి పలు ముఠాలను పలమనేరు, గంగవరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలమనేరు పోలీసులు తమిళనాడుకు చెందిన ఆర్‌పీ ముఠాను ఆదివారం అరెస్టు చేసింది. వీరి డీల్ రూ.ఐదుకోట్లకు సాగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అక్షయపాత్ర, బంగారు నాణేల పేరిట మోసాలు
పురాతన కాలం నాటి అక్షయపాత్ర, రాగిపాత్రలకు బియ్యాన్ని ఆకర్షించే శక్తి ఉండడాన్నే రైస్ పుల్లింగ్ అంటారు. ఇలాంటి బియ్యాన్ని ఆకర్షించే రాగి పాత్రలకు బయటి దేశాల్లో కోట్లాది రూపాయల గిరాకీ ఉంటుందని ఈ ముఠా నమ్మబలుకుతోంది. ముఖ్యంగా పాతకాలం నాటి రాగి పాత్రలను కొన్నేళ్లు భూమిలో పాతిపెడితే ఇవి ఎంతో విలువైన యురేనియంను సంగ్రహించి అత్యంత శక్తివంతంగా తయారవుతాయని కూడా నమ్మిస్తారు. ఇందులో ఆర్‌పీ అంటే రైస్ పుల్లింగ్ అని సీఆర్పీ అంటే కాపర్ రైస్ పుల్లర్, సీఐపీ అంటే కాపర్ ఇరిడియమ్ రైస్ పుల్లర్ పేరిట ఈ తంతు ఇక్కడ సాగుతోంది. దీంతోపాటు నకిలీ బంగారు నాణేలను చూపి వీటిని తక్కువ ధరకే ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
వీరి మోసాలు ఇలా
అద్భుత శక్తి కలిగిన రాగి చెంబు, పాత్ర, వజ్రాలు తమ వద్ద ఉన్నాయంటూ పలు ముఠాలు అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. ఈ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలన్నీ భారీగా మోసాలకు పాల్పడేవని తేలింది. వీరు ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని వ్యవహారమంతా రహస్య ప్రదేశాల్లోనే నిర్వహిస్తున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి రాత్రి సమయాల్లో ఓ ప్రదేశానికి డబ్బుతో రమ్మని వీరి మనుష్యులే పోలీసుల వేషాల్లో వచ్చి దాడులు చేసినట్టు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మత్తులో పడి పలువురు లక్షల్లో మోసపోయారు. వీరి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ రైస్ పుల్లింగ్ మోసాలు పెరుగుతుండడం గమనార్హం.
మళ్లీ పేట్రేగుతున్న ఆర్పీ ముఠాలు
Published Mon, Apr 6 2015 2:10 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement
Advertisement