Rice pulling gangs
-
గిన్నె చూపించి.. రూ.25 లక్షలు స్వాహా!
సాక్షి, హైదరాబాద్: గతంలో రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ చేతిలో మోసపోయిన ముగ్గురు వ్యక్తులు మోసగాళ్ల అవతారం ఎత్తారు. వీళ్లూ వరుసపెట్టి మోసాలు చేయడం ప్రారంభించారు. రూ.2500 విలువ చేసే రాగి గిన్నెకు అతీంద్రియశక్తులున్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు కాజేశారు. మరో రూ.23 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నిస్తుండగా ఉత్తర మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. రైస్ పుల్లర్లుగా పిలిచే ఇరీడియం నాణేల పేరుతో మోసం చేసే ముఠాలు గతంలో అనేకం ఉండేవి. 2015లో ఇలాంటి ఓ గ్యాంగ్ బారినపడిన స్నేహితులు ఓల్డ్ అల్వాల్ వాసి పి.శివసంతోష్ కుమార్, ఏపీలోని పలమనేరుకు చెందిన జి.మంజునాథ్‌రెడ్డి, బెంగళూరు వాసి ప్రతాప్ ఎస్సార్ రూ.5 లక్షలు నష్టపోయారు. దీంతో తామూ అదే పంథాలో మోసాలు చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. మంజునాథ్‌రెడ్డి రాగి గిన్నెను కొని తన వద్ద ఉంచుకున్నాడు. దీనికోసం ఓ గాజు బాక్సు, చుట్టూ ధర్మకోల్ షీట్లు పెట్టి అదేదో అద్భుత వస్తువు అన్నట్లు రూపొందించాడు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తనకు పరిచయమైన వారితో రైస్ పుల్లర్స్ పేరుతో ఎర వేసేవాడు. అతీంద్రియశక్తులు ఉన్న ఈ గిన్నెలు ఎవరి వద్ద ఉంటే వాళ్లు కోటీశ్వరులు అవుతారని, వివిధ రకాలైన ప్రయోగాల్లో వినియోగించే ఆ గిన్నెలకు భారీ రేటు ఉంటుందని నమ్మించేవాడు. ఇలానే ఇతడికి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన శశికాంత్‌ను నమ్మబలికాడు. ఆ పాత్రను రూ.10 కోట్లకు ఖరీదు చేయడానికి అంతర్జాతీయ సంస్థ అయిన అప్రెచెస్ అండ్ రీసెర్చ్ సిద్ధంగా ఉందని చెప్పాడు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ వద్ద శశికాంత్‌ను కలిసిన శివ సంతోష్ తాను సదరు కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బెంగళూరులోని డీఆర్డీఓ నుంచి స్కానింగ్ మిషన్ తీసుకువచి్చ, ఈ పాత్రను స్కానింగ్ చేయించి, సైంటిస్టు నుంచి సర్టిఫికెట్ పొందాలని చెప్పాడు. అప్పుడు రంగంలోకి దిగిన ప్రతాప్ డీఆర్డీఓలో పని చేసే సైంటిస్ట్ రవీంద్ర ప్రసాద్‌గా శశికాంత్‌కు పరిచయం అయ్యాడు. స్కానింగ్, సరి్టఫికేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇలా ముగ్గురి మాటలు నమ్మిన బాధితుడు ఈ నెల 6న వారికి రూ.25 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ స్కానింగ్ మిషన్ తీసుకురాని మంజునాథ్ కాలయాపన చేస్తూ వచ్చాడు. అదేమిటంటూ నిదీయగా... మరో రూ.23 లక్షలు అవసరమని చెప్పాడు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్కెట్ ఠాణాలో కేసు నమోదైంది. వీరి వ్యవహారంపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్సైలు పి.గగన్‌దీప్, శ్రీనివాసులు దాసు వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.25 లక్షల నగదు, రాగి గిన్నె తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు. 2016 నుంచి ఈ తరహా మోసాలు చేస్తున్న ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్లు కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వీరికి కలిసి వచ్చింది. -
'మాయా చెంబు' ముఠా ఆటకట్టు
ధర్మవరం అర్బన్: మాయా చెంబు పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. 18 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వివరాలు వెల్లడించారు. నిందితులు తమ వద్ద ఉన్న రాగి చెంబుకు రసాయనాలు పూసి ఆ చెంబు వద్ద టార్చ్‌లైట్ వేస్తే లైట్ ఆఫ్ అవుతుంది. దీంతో ఈ చెంబుకు అద్వితీయ శక్తులు ఉన్నాయని ఇది ఎవరి ఇంట్లో ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుందని వారు అనుకొన్న కార్యాలు నెరవేరుతాయని అమాయక ప్రజలను నమ్మించి వారికి రాగి చెంబును అమ్మి అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవాలన్న పథకంతో గత మూడురోజులుగా గోరంట్ల పరిసర ప్రాంతాల్లో 18 మంది సభ్యుల ముఠా తిరుగుతోంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు గోరంట్ల సీఐ జయనాయక్, సీసీఎస్ సిబ్బంది గోరంట్ల సమీపంలోని యర్రబల్లి రోడ్డు బూదిలి క్రాస్ వద్ద గురువారం ఉదయం 9.30 గంటలకు 18 మంది ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడుకార్లు, ఒక స్కార్పియో, రెండు రాగి చెంబులు, ఒక టార్చిలైట్, రూ.30వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 18 మందిపైనా కేసులు నమోదు చేశారు. ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసిన గోరంట్ల సీఐ, సీసీఎస్ సిబ్బందిని డీఎస్పీలు అభినందించారు. అరెస్టైన వారు వీరే... అనంతపురానికి చెందిన శ్యామలబోయన శ్రీనివాసులు, బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన నారా సుదర్శన్, కదిరి టౌన్ మౌనిక టాకీస్ వద్దనున్న పాలగిరి ముఖద్దర్ బాషా, పామిడి మండలం సరస్వతి విద్యామందిరం దగ్గరున్న షేక్ షాషావలి, గాండ్లపెంట మండలం కటకంవారిపల్లికి చెందిన ఆలుకుంట్ల శ్రీనివాసులు, కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా గల్‌పేటకు చెందిన కె.పి.గోపినాథ్, బెంగళూరులోని రాజీవ్‌గాంధీ రోడ్డుకు చెందిన వై.శ్రీనాథ్, స్కార్పియో డ్రైవర్, మంగళూరుకు చెందిన ప్రవీణ్‌రాజ్, యలహంకకు చెందిన ఎం.రోహిత్, ఎ.రవికుమార్, బెంగళూరులోని శ్రీకంఠేశ్వరనగర్‌కు చెందిన ఆర్.రాము, వశికేరహళ్లికి చెందిన ఎం.శ్రీనాథ్, శివమొగ్గ జిల్లా వినోబానగర్‌కు చెందిన ఎస్.అశోక్, బెంగళూరు రూరల్ పరిధిలోని చిన్న మంగళకు చెందిన చంద్రప్ప నాగరాజు, తుమకూరు జిల్లా హెగ్గెరెహళ్లికి చెందిన జగన్నాథ్ మంజునాథ్, హిందూపురం మండలం సంతేబిదనూరుకు చెందిన హెచ్.సంజీవప్ప, నల్లమాడ మండలానికి చెందిన జె నాగరాజు, అమడగూరు మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన పి.మురళి. -
మళ్లీ పేట్రేగుతున్న ఆర్పీ ముఠాలు
రకరకాల ప్రచారాలతో భారీగా మోసాలు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న అమాయకులు పలమనేరు: జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్ ముఠాలు మళ్లీ పేట్రేగుతు న్నా యి. ఈ ముఠాల కారణంగా ఎందరో అమాయకులు మోసపోతున్నారు. రైస్ పుల్లింగ్ అనే మత్తులో పడి ఇంకొందరు ఇప్పటికే తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఆర్పీ ముఠా మాటలు నమ్మి కోట్లు సంపాదించాలనే ఆశతో ఈ ప్రాంతంలో వందలాది మంది ఇదే వృత్తిగా పలువురు ఏజెంట్లను తయారు చేసి అన్వేషణ సాగిస్తున్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఇలాంటి పలు ముఠాలను పలమనేరు, గంగవరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలమనేరు పోలీసులు తమిళనాడుకు చెందిన ఆర్పీ ముఠాను ఆదివారం అరెస్టు చేసింది. వీరి డీల్ రూ.ఐదుకోట్లకు సాగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్షయపాత్ర, బంగారు నాణేల పేరిట మోసాలు పురాతన కాలం నాటి అక్షయపాత్ర, రాగిపాత్రలకు బియ్యాన్ని ఆకర్షించే శక్తి ఉండడాన్నే రైస్ పుల్లింగ్ అంటారు. ఇలాంటి బియ్యాన్ని ఆకర్షించే రాగి పాత్రలకు బయటి దేశాల్లో కోట్లాది రూపాయల గిరాకీ ఉంటుందని ఈ ముఠా నమ్మబలుకుతోంది. ముఖ్యంగా పాతకాలం నాటి రాగి పాత్రలను కొన్నేళ్లు భూమిలో పాతిపెడితే ఇవి ఎంతో విలువైన యురేనియంను సంగ్రహించి అత్యంత శక్తివంతంగా తయారవుతాయని కూడా నమ్మిస్తారు. ఇందులో ఆర్పీ అంటే రైస్ పుల్లింగ్ అని సీఆర్పీ అంటే కాపర్ రైస్ పుల్లర్, సీఐపీ అంటే కాపర్ ఇరిడియమ్ రైస్ పుల్లర్ పేరిట ఈ తంతు ఇక్కడ సాగుతోంది. దీంతోపాటు నకిలీ బంగారు నాణేలను చూపి వీటిని తక్కువ ధరకే ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వీరి మోసాలు ఇలా అద్భుత శక్తి కలిగిన రాగి చెంబు, పాత్ర, వజ్రాలు తమ వద్ద ఉన్నాయంటూ పలు ముఠాలు అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. ఈ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలన్నీ భారీగా మోసాలకు పాల్పడేవని తేలింది. వీరు ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని వ్యవహారమంతా రహస్య ప్రదేశాల్లోనే నిర్వహిస్తున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి రాత్రి సమయాల్లో ఓ ప్రదేశానికి డబ్బుతో రమ్మని వీరి మనుష్యులే పోలీసుల వేషాల్లో వచ్చి దాడులు చేసినట్టు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మత్తులో పడి పలువురు లక్షల్లో మోసపోయారు. వీరి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ రైస్ పుల్లింగ్ మోసాలు పెరుగుతుండడం గమనార్హం.