
చిత్తూరులో ఓటర్ల ముసాయిదా జాబితాపై ఇంటింటి తనిఖీలు చేపడుతున్న ఆర్డీఓ మల్లిఖార్జున
చిత్తూరు కలెక్టరేట్: వంద శాతం పారదర్శకత ఓటర్ల జాబితా కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అలసత్వం వహిస్తున్న ఎన్నికల అధికారులకు కలెక్టర్ ప్రద్యుమ్న షోకాజ్ నోటీసులు జారీచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షోకాజ్ నోటీసులు సంఖ్య మంగళవారం నాటికి 33 కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను ఈ నెల 14వ తేది నాటికి ఈఆర్వో నెట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అందులో భాగంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు, అప్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ప్రక్రియలో అలసత్వం వహించిన కుప్పం, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, పలమనేరు నియోజకవర్గాల ఈఆర్వోలకు, ఏఈఆర్వోలకు (తహసీల్దార్) లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం విధితమే. ఈ నెల 10న తాజాగా పలమనేరు నియోజకవర్గం ఈఆర్వో (ప్రభాకర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి)కి, అదే నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, వి.కోట, పెద్దపంజాణి తహసీల్దార్లకు రెండోసారి షోకాజ్ నోటీసులను జారీ చేశారు.
త్వరలో ముగ్గురిపై వేటు
ఎన్నికల ప్రక్రియలో అలసత్వం వహించిన ముగ్గురు అధికారులపై త్వరలో కలెక్టర్ వేటు వేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అందులో ఇప్పటి వరకు నోటీసులు ఎక్కువ అందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి నాటికి అందిన ఓటరు దరఖాస్తులు, క్‌లైమ్‌లు, చిరునామా మార్పుల దరఖాస్తుల నమోదులో అధికంగా తప్పులు దొర్లాయని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న గుర్తించారు. అలాగే జిల్లాలో 3,42,961 బోగస్ ఓట్లు ఉన్నట్లు సాక్షి వరుస కథనాలను గతంలో ప్రచురించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటర్ల సవరణ జాబితాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓటర్ల క్షేత్ర స్థాయి తనిఖీలను రెండు సార్లు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియలో జిల్లాలో ఉన్న 3,42,961 బోగస్ ఓట్లను ఇంటింటి పరిశీలన చేయించారు. అందులో 16,246 ఓట్లు అనుమానిత ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. వారందరికి నోటీసులు జారీచేశారు. ఈ నెల 14వ తేది లోపు మరోసారి నోటీసులు అందజేసిన ఓట్లపై విచారణ చేసి వాటిని తొలగించనున్నారు. ఆమోదించిన ఓట్లను ఈఆర్వో నెట్ లో అప్‌లోడ్ చేయనున్నారు.
ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తాం
జిల్లాలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యం. జిల్లాలో 3.42 లక్షల అనుమానిత ఓట్లు ఉన్నట్లు సమాచారం. ఇంటింటి తనిఖీలు చేయించడం జరిగింది. డోర్ నంబర్లు లేకపోవడం, సరైన పేర్లు నమోదు చేసుకోకపోవడం, నమోదు చేసుకున్న చిరునామాలో లేకపోవడం తదితర అంశాలపై 16,246 అనుమానిత ఓట్లుగా గుర్తించడం జరిగింది. వారికి నోటీసులు ఇచ్చాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా చేస్తాం. జిల్లాలో ప్రక్రియ ఆలస్యంగా చేయడం, రాజకీయపార్టీలతో సమావేశాలు నిర్వహించకపోవడం, అప్‌లోడ్ ప్రక్రియలో వెనుకబడడం కారణాలపై నోటీసులు జారీచేయడం జరిగింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా చర్యలు తప్పవు. – ప్రద్యుమ్న, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment