మహామహులు ఏలిన పెనమలూరు | Penamaluru Constituency Review For Elections | Sakshi
Sakshi News home page

మహామహులు ఏలిన పెనమలూరు

Published Fri, Mar 22 2019 10:26 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Penamaluru Constituency Review For Elections - Sakshi

పలమనేరు నియోజకవర్గ ముఖచిత్రం

సాక్షి, కృష్ణా : పెనమలూరు నియోజకవర్గం విలక్షణమైనది. జిల్లాలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గాల్లో రెండోది. 2009లో చేపట్టిన నియోజకవర్గ పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 41 గ్రామాలు, ఒక మున్సిపాలిటి, ఉయ్యూరు నగర పంచాయతీలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 68,208 ఎకరాలు.

విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న నియోజకవర్గం. 41 గ్రామాలు, 1 మున్సిపాలిటీకి అన్నింటికీ రహదారి మార్గం, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నిత్యం విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–ఏలూరు, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు ఉన్నాయి. నియోజకవర్గం మీదుగా ప్రధానంగా బందరు, రైవస్‌ కాలువలు, వాటికి అనుబంధ కాలువలు ప్రవహిస్తున్నాయి.

కృష్ణానది ఏటిపాయ కూడా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని ఐదు గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. సాగునీరు వ్యవస్థ అం దుబాటులో ఉంది. ప్రధానంగా బోర్లు, కాలువ నీటిపై ఆధారపడి సాగు జరుగుతుంది. వ్యవసాయాధారిత గ్రామాలు ఎక్కువ. పెనమలూరు మండలం సెమీ అర్బన్‌ ప్రాంతం. పట్టణీకరణ వాతావరణం. ఉద్యోగులు, కార్మికులు ప్రధానంగా ఉన్నారు. రాజధా ని అమరావతి, విజయవాడకు కూతవేటు దూరంలోనే నియోజకవర్గ గ్రామాలు ఉన్నాయి. ప్రతి పనికీ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తుంటారు. 


మూడవ పర్యాయం..  
2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొలుసు పార్థసారథి, టీడీపీ అభ్యర్థి చలసాని వెంకటేశ్వరరావు (పండు)పై 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రివర్గంలో స్థానం పొంది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో పార్థసారథి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్‌పై 31,448 మెజారిటీతో గెలుపొందారు.  

రద్దయిన కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు 
రాష్ట్ర వ్యాప్తంగా రెండో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు పునర్విభజనతో రద్దయ్యాయి. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. గతంలో ఉయ్యూరు నియోజకవర్గంలో ఉన్న పమిడిముక్కల, తోట్లవల్లూరు పామర్రు నియోజకవర్గంలో కలిశాయి. విజయవాడ రూరల్, అర్బన్‌ డివిజన్‌లు మైలవరం, విజయవాడ పరిధిలోకి వెళ్లాయి. 

కంకిపాడు నియోజకవర్గంలో...
తొలి రోజుల్లో ఇక్కడ కమ్యూనిష్టులదే ప్రభావం. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించాక కంకిపాడు టీడీపీకి పెట్టని కోట అయ్యింది. 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన నేత మాత్రం దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ). రాజకీయంగా కోనేరు రంగారావుకు విజయాన్ని అందించింది కూడా కంకిపాడు నియోజకవర్గమే. రద్దయిన ఉయ్యూరు నియోజకవర్గంలో సమరయోధుడు  కాకాని వెంకటరత్నం మూడు సార్లుగెలిచారు. 

ఉయ్యూరుకు తలమానికం చక్కెర కర్మాగారం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెక్కర కర్మాగారాల్లో ఉయ్యూరు కేసీపీ కర్మాగారం కూడా ఒకటి. కర్మాగారం పరిధిలో 20 మండలాల్లో 26 వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతోంది. 16 వేల మంది రైతులు కర్మాగారంలో 700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు

మొత్తం జనాభా : 3,55,277
మొత్తం ఓటర్లు : 2,58,586
పురుషులు: 1,26,239
మహిళలు : 1,32,324
ఇతరులు : 23

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement