సాక్షి, పుంగనూరు: పలమనేరు–పుంగనూరు బైపాస్ రోడ్డు కోసం సుమారు ముప్పై ఏళ్లుగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. పూర్తిగా సిద్ధమైన ఈ రహదారిని 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
కీలకపాత్ర పోషించిన ఎంపీ మిథున్‌రెడ్డి
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి 2017లోనే పుంగనూరు–పలమనేరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి నడుంబిగించారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో పలుమార్లు చర్చించి రోడ్డు నిర్మాణానికి రూ.309 కోట్లు విడుదల చేయించారు. అనంతరం 55 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మామూళ్ల కోసం కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెట్టి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఎంపీ మిథున్‌రెడ్డి త్వరితగతిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులను పరుగులు పెట్టించి మరీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ క్రమంలో దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
చదవండి: (చిరంజీవికి సీఎం అత్యంత గౌరవమిచ్చారు)
ఇదీ మార్గం
పలమనేరు రోడ్డులోని అరబిక్ కాలేజీ నుంచి పుంగనూరు బైపాస్ ప్రారంభమవుతుంది. చదళ్ల సమీపంలోని తిరుపతి రోడ్డు మీదుగా ఎంబీటీ రహదారిలోని భీమగానిపల్లె వద్ద కలుస్తుంది. పెంచుపల్లె, బండ్లపల్లె, బాలగురప్పపల్లె, మేలుపట్ల, భగత్‌సింగ్‌కాలనీ, రాగానిపల్లె, రాంపల్లె, దండుపాళ్యం మీదుగా రోడ్డు సాగుతుంది. బైపాస్ రోడ్డు నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరకు రెక్కలు రావడంతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది.
పుంగనూరుకు తలమానికం
ఎంపీ మిథున్‌రెడ్డి అవిరళ కృషితోనే బైపాస్ నిర్మాణం పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డు పనులు ముందుకు సాగకుండా ఏళ్ల తరబడి అడ్డుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ రహదారి ప్రజలకు ఎంతో ఉపయోగకరం.
– ఎస్.ఫకృద్ధీన్ షరీఫ్, పుంగనూరు
Comments
Please login to add a commentAdd a comment