ముదిగుబ్బ బైపాస్ రోడ్డు పనుల్లో నాణ్యత నగుబాటుగా మారింది. పనులు దక్కించుకున్న నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ నిబంధనలకు పాతరేస్తూ పైపై పూతలతో పనులు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా వేసిన బ్రిడ్జి పిల్లర్లు అప్పుడే బీటలు వారగా, కాంక్రీట్ వాల్ ఉబ్బిపోయింది. ఆమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులు కళ్లుమూసుకుని బిల్లులపై సంతకాలు చేసేస్తున్నారు.
ధర్మవరం: ప్రజలకు మెరుగైన రహదారులు కల్పించి సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి మరీ ముదిగుబ్బకు బైపాస్ రహదారిని మంజూరు చేయించారు. అందులో భాగంగా 2021 డిసెంబర్‌లో రూ.116.81 కోట్ల వ్యయంతో ముదిగుబ్బ నుంచి 7.749 కిలోమీటర్ల పొడవున ఎన్‌హెచ్–42 బైపాస్ రోడ్డును నిర్మించేలా టెండరు పిలిచారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఈ పనులు దక్కించుకుంది. నిబంధనలకు పాతరేస్తూ బైపాస్ రోడ్డు పనుల్లో అంతులేని అక్రజుమాలకు పాల్పడుతోంది.
నాణ్యత గాలికి..
బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ఇటీవల నిర్మించిన బ్రిడ్జి పనులను చూస్తే నాణ్యత తేటతెల్లమవుతోంది. బ్రిడ్జి నిర్మాణంలో నిలువు కాంక్రీట్ వాల్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. నాసిరకం కాంక్రీట్ మిశ్రమం వాడటం వల్లే ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అలానే బ్రిడ్జి ఉపరితలంలో మట్టికట్ట పనులు లేయర్ల వారీగా సరిగా చేయక పోవడంతో ఇరువైపులా ఉన్న ప్రీకాస్టెడ్ కాంక్రీట్ వాల్ బయటకు ఉబ్బింది. దీంతో నాసిరకం పనులు ఎక్కడ బయటపడతాయోనని కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి మేకప్ చేసింది.
పట్టించుకోని అధికారులు..
ముదిగుబ్బ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి నాసిరకంగా జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు పనుల నాణ్యతను పరిశీలించకుండానే విడతల వారీగా సదరు కంపెనీకి బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల సైతం నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీతో లాలూచీ పడటంతోనే అవినీతి పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది.
సెంట్రల్ విజిలెన్స్‌కు ఎంపీ మాధవ్ ఫిర్యాదు
ముదిగుబ్బ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులలో జరుగుతున్న అక్రమాలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సెంట్రల్ విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. పనుల్లో అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. బైపాస్ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరారు.
‘విజిలెన్స్’పై కంపెనీ ప్రతినిధుల దౌర్జన్యం
బైపాస్‌రోడ్డు నిర్మాణ పనులలో జరుగుతున్న అక్రమాలను విచారించేందుకు వెళ్లిన విజిలెన్స్ అధికారులపై గతంలో నితిన్‌సాయి కనస్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు దౌర్జన్యం చేశారు. విజిలెన్స్ అధికారుల ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లడంతో పాటు పనులు పరిశీలించకుండా అడ్డుకున్నారు. దీంతో అధికారులు సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి పనులు నాణ్యత జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై నేషనల్ హైవే ఈఈ మధుసూదన్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment