పలమనేరు మండలంలో ఆగిన గంగనశిరస్సు ప్రాజెక్టు
పలమనేరు నియోజకవర్గంలోని ముఖ్యమైన రెండు ప్రాజెక్టులు కొండెక్కాయి. పాలకులు, పాలితుల నిర్లక్ష్యంతో ఏటా నదుల్లోని వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి పలమనేరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా సముద్రం పాలవుతున్న నీటికి అడ్డుకట్టవేయలేకపోతున్నారు.
చిత్తూరు , పలమనేరు: జిల్లాలోని పడమటి ప్రాంతమైన పలమనేరు కరువుకు నిలయం. పంటల సాగుకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఇక్కడి పల్లెల్లో తాగునీటికి ఇబ్బందులే. ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కైగల్, దుర్గమ్మ చెరువు నదులు ముఖ్యమైనవి. వర్షాకాలంలో ఈ నదులు ప్రవహించినపుడు 200 నుంచి 250 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)ల నీరు వృథాగా తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాతంలోకి చేరుతోంది. ఈ పనులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఈ ప్రాంతవాసులకు శాపంలా మారింది.
ఆగిన గంగనశిరస్సు పనులు..
కౌండిన్యా నది పలమనేరు మీదుగా తమిళనాడులోకి పయనిస్తోంది. వైఎస్ హయాంలో దీనిపై పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద రూ.55 కోట్లతో వైఎస్‌ఆర్ జలాశయం ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. దీనికి అనుసంధానంగా చేపట్టాల్సిన గంగన శిరస్సు ప్రాజెక్టు పనులు అటవీ శాఖ అభ్యంతరాలతో పెండింగ్ పడ్డాయి. గతేడాది ఇక్కడికి వచ్చిన ప్రజారోగ్య శాఖ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు రూ.25కోట్లతో పనులకు రివైజ్డ్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులందక పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు సైతం ఇంకా నష్టపరిహారమందలేదు.
కైగల్ ఎత్తిపోతలు ఉత్తికోతలే..
బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ నది కర్ణాటకలోని ముళబాగల్ సమీపంలో గల కురుడుమళై ప్రాంతంలో పుట్టి బైరెడ్డిపల్లె మండలం మీదుగా తమిళనాడు సరిహద్దు నుంచి కౌండిన్యా నదిలో కలుస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఈ నది ప్రవహిస్తోంది. గతంలో ఈ నదిపై కైగల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం అంచనాలు సిద్ధం చేసింది. అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాజెక్టు వెంటనే ప్రారంభిస్తామన్న మంత్రి అమరనాథరెడ్డి మాటలు నీటి మూటలయ్యాయి. ఈ మధ్య ఇక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబు సైతం ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామంటూ మళ్లీ అదే మాటలు చెప్పి వెళ్లారు. ఈ నదిపై ప్రాజెక్టును నిర్మించి ఆ నీటిని బైరెడ్డిపల్లి చెరువులకు అనుసంధానం చేసుంటే ఆ మండలం మొత్తం సస్యశ్యామలమయ్యేది.
దుర్గమ్మ బాధ ఇదే....
వీకోట మండలంలోని దుర్గమ్మ చెరువు వద్ద పుట్టే దుర్గమ్మ చెరువు నది నీరు సైతం తమిళనాడుకు చేరుతోంది. ఈ మండలంలోని అటవీ ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మిస్తామని గతంలో వీకోటకు విచ్చేసిన చంద్రబాబు మాటనిచ్చినా ఈ ప్రాజెక్టు ఇంకా కార్యరూపం దాల్చలేదు.
ఏటా ఇక్కడి నీళ్లు సముద్రంపాలు
నియోజకవర్గంలోని కైగల్, దుర్గమ్మ చెరువు నదులు బత్తలపల్లి మీదుగా పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్యనదిలో మోర్ధనవద్ద కలుస్తుంది. అక్కడి నుంచి కౌండిన్య తమిళనాడులోని గుడియాత్తం, వేలూరు మీదుగా పొన్ని నదిలో కలసి బంగాళాఖాతంలోకి ఏటా వర్షాకాలంలో సుమారు 120 ఎంసీఎఫ్‌టీల నీరు ప్రవహిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం గతంలో తాగునీటి కోసమని మోర్ధనవద్ద ప్రాజెక్టును కట్టింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి వెళ్లే నీరు మోర్ధనకు చేరి అక్కడి వారికి ఉపయోగంగా మారింది. ఇదే పని మన పాలకులు, పాలితులు స్థానికంగా ఎందుకు చేపట్టలేదని జనం ప్రశ్నిస్తున్నారు.
మంత్రి అనుకుని ఉంటే ప్రాజెక్టు జరగదా..
మంత్రి అనుకుని ఉంటే గంగనశిస్సు ప్రాజెక్టు ఎప్పుడో జరిగేది. ఇది పూర్తయి ఉంటే పలమనేరులో తాగునీటికి సమస్య లేకుండా ఉండేది. మా గ్రామాలకు సాగునీటి బాధలు తప్పేవి. ఏమి చేద్దాం ఈ ప్రభుత్వాలు ఇలా ఉంటే రైతులు ఎలా బాగుపడేది. –బాలాజీనాయుడు, మండిపేటకోటూరు, పలమనేరు మండలం
కైగల్ ఎత్తిపోతలు ఉట్టిమాటలే..
మంత్రి అమరనాథరెడ్డి ముడేళ్లుగా కైగల్‌నదిపై ప్రాజెక్టు కడతామని ఇప్పటికీ హామీలు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా కైగల్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉంటారు. అదిగో అంచనాలు ఇదిగో పనులు అని ఉట్టిమాటలు చెప్పారేగానే ఇక్కడ చేసిందేమీలేదు. – మొగసాల కృష్ణమూర్తి, బైరెడ్డిపల్లి
భూమి తీసుకుని ఎక్కడా లేకుండా చేశారు...
గంగనశిరస్సు ప్రాజెక్టు కోసమని నా భూమిని తీసుకున్నారు. దానికి ఇంతవరకు పరిహారం కూడా ఇవ్వలేదు. ఉన్న భూమిని పోగొట్టుకుని జీవనధారం లేకుండా పోయింది. పోనీ ప్రాజెక్టు అయినా నిర్మించారా అంటే అదీలేదు. ఇట్టా చేస్తే జనం ఎలా నమ్మేది.– వనజమ్మ, మండిపేటకోటూరు
ప్రాజెక్టు కట్టుంటే బోర్లలో నీళ్లు వచ్చేవి..
గంగనశిరస్సు ప్రాజెక్టును కట్టుంటే పట్టణానికి మంచినీటి సమస్య తీరిండేది. మాకు ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి బోర్లవద్ద సేద్యాలు చేసుకునేవాళ్లం. ఇక్కడికి సమీపంలో తమిళనాడు వాళ్లు కట్టిన మోర్ధనలో నీళ్లున్నాయి. మన దౌర్భాగ్యం మనకు లేవే.–మురుగన్, చెత్తపెంట, పలమనేరు మండలం
Comments
Please login to add a commentAdd a comment