అంబటి రాంబాబు ,కోడెల శివప్రసాద్
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. ప్రధాన సామాజిక వర్గాలన్నీ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య 1952 నుంచి 1967 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు ఇండిపెండెంట్‌గా, ఒకసారి సీపీఐ అభ్యర్థిగా ఎన్నిక కావడం విశేషం.
ఈ నియోజకవర్గంలో 1972 నుంచి 2004 వరకు ఏ ఒక్కరూ రెండోసారి గెలవలేదు. ఆ ఆనవాయితీకి యర్రం వెంకటేశ్వరరెడ్డి బ్రేక్ వేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు (2004, 2009) గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అనంతరం శాసనసభ స్పీకర్‌గా ఎంపికయ్యారు. స్పీకర్‌గా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉండగా.. టీడీపీ తరఫున అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని వ్యవస్థలను భ్రష్టు పట్టించారనే అçపకీర్తిని మూటగట్టుకున్నారు. టీడీపీలో కోడెల శివప్రపాదరావు కీలక నేత కావడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అందరికీ సుపరిచితుడు కావడంతో రాష్ట్రంలో అందరి దృష్టి నియోజకవర్గంపై పడింది.
అవినీతికి కేరాఫ్ కోడెల
ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై.. అపార అనుభవం కలిగిన కోడెల శివప్రసాద్ అవినీతి దందాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. భూ దందాలు, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకున్నారని, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. స్పీకర్ కుమారుడు, కుమార్తె ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతి పనికి కేఎస్టీ (కోడెల శివప్రసాద్ ట్యాక్స్) వసూలు చేశారని పార్టీ వర్గాలు సైతం బాహాటంగానే చెబుతున్నాయి. టీడీపీ నేతలను సైతం వదలకుండా ప్రతి పనికి డబ్బులు వసూలు చేశారు. ‘కోడెలకు సీటు ఇవ్వొద్దు.. క్విట్ కోడెల’ అంటూ టీడీపీ నేతలే పెద్దఎత్తున ఆందోళన చేశారు. కోడెల ప్రచారానికి జనాలు రాక సభలు వెలవెలబోతున్నాయి. డబ్బుతో జనాలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. కోడెల ఓటమి అంచున పయనిస్తున్నారు.
ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న రాంబాబు
అంబటి రాంబాబు గతంలో వైఎస్సార్‌కు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. వైఎస్సార్ సీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ.. పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. పలు కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అన్నివర్గాల ప్రజలను కలుపుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున నాయకులు, ప్రజలు చేరుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన రాంబాబుకు ప్రజల్లో సానుభూతి ఉంది. సౌమ్యుడిగా, మచ్చలేని నాయకుడిగా మంచిపేరు ఉంది. దీంతో రాంబాబు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉండటం కలిసొచ్చే అంశం.
హామీలు మరచిన బాబు
చంద్రబాబు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు పశువుల హాస్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ హామీ ఇప్పటికీ కలగానే మిగిలింది. సత్తెనపల్లి–మాచర్ల రహదారి ప్రధానంగా లోలెవల్ బ్రిడ్జిలు ఉండటంతో.. వర్షాకాలంలో వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ బ్రిడ్జిలను హై లెవల్ బ్రిడ్జిలుగా మారుస్తున్నామని చెప్పారు. కేవలం శంకుస్థాపనకే పరిమితం అయ్యారు. కొండమోడు–పేరేచర్ల రహదారిని ఆరు లేన్లుగా మారుస్తామని హామీ ఇచ్చారు. అది అమలుకు నోచుకోలేదు. నియోజకవర్గం రాజధాని ప్రాంతంలో ఉండటంతో బైపాస్ నిర్మాణం చేపడతామని చెప్పారు. కలగానే మిగిలింది. సాగర్ కుడి కాలువకు పరిధిలో వరి పండించే రైతులకు ఐదేళ్లుగా పంట పండటం లేదు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా గత ఏడాది ఎత్తిపోతల పథకాలకు నకరికల్లు వద్ద శంకుస్థాపన చేశారు.– ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి,సాక్షి, అమరావతి బ్యూరో
ఓటర్ల వివరాలు
మొత్తం 2,30,775
పురుషులు 1,13,592
మహిళలు 1,17,166
ఇతరులు: 17
Comments
Please login to add a commentAdd a comment