మాట్లాడుతున్న అంబటి రాంబాబు, పక్కన నాయకులు
గుంటూరు, సత్తెనపల్లి: రాజుపాలెం మండలం ఇనిమెట్లలో పోలింగ్ సరళి పరిశీలన పేరుతో బూత్‌లోకి ప్రవేశించి తలుపులు వేసి ఓట్లు దొంగిలించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రయత్నించారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు, టీడీపీ నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలు, పోలింగ్ బూత్‌ల ఆక్రమణలు, వైఎస్సార్‌సీపీ వారిపై దాడులు, అక్రమ కేసులు బనాయించడంపై క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ మంగళవారం సత్తెనపల్లి చేరుకుని పట్టణంలోని కార్తికేయ రెసిడెన్సీలో సమావేశం అయ్యారు. నిజనిర్థారణ కమిటీ బృందంలో వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణదేవరాయలు, కాసు మహేష్‌రెడ్డిలతో పాటు నరసరావుపేట పార్లమెంట్ ఇన్‌చార్జి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, మక్కెన మల్లికార్జునరావు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గురజాల, వేమూరు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న సంఘటనలపై చర్చించారు.
అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి కోరామన్నారు. ఐదు రోజులపాటు గ్రామంలోకి వెళ్లవద్దని, వెళితే గొడవలు పెరుగుతాయని ఎస్పీ చెప్పడంతో గ్రామానికి వెళ్లడాన్ని విరమించుకున్నామన్నారు. ప్రశాంతంగా ఉండే సత్తెనపల్లి కోడెల రాకతోనే సమస్యాత్మక నియోజకవర్గంగా తయారైందన్నారు. ముప్పాళ్ళ మండలం పలుదేవర్లపాడు, నార్నెపాడు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్ల ఇళ్లల్లో మద్యం సీసాలు పెట్టి అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. ఎస్‌ఐ ఏడుకొండలు కోడెల శివరామ్‌కు తొత్తుగా ఉంటూ ఈవిధంగా చేశాడన్నారు.
ఇనిమెట్లలో కోడెల బూత్‌లోకి వెళ్లి ఏజెంట్లను వెళ్లిపొమ్మని చెప్పారని, టీడీపీకే ఓట్లు వేయండని ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇనిమెట్ల వైఎస్సార్‌సీపీకి మెజార్టీ గ్రామమని తెలిసే, గొడవ చేసి రీపోల్ చేయించాలని కోడెల విశ్వ ప్రయత్నం చేశాడన్నారు. కోడెల తలుపులు వేయడంతో రిగ్గింగ్ చేస్తున్నారని భావించి ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు. కోడెలపై బూత్‌లోని ఏజెంట్లు ఫిర్యాదు ఇస్తే రాజుపాలెం ఎస్‌ఐ తీసుకోలేదని, తాను దీక్ష చేస్తానని డిమాండ్ చేస్తే కేసు నమోదు చేశారన్నారు. కోడెల దాడులు చేయిస్తాడని, తనను గుంటూరు వెళ్లిపొమ్మని ఎంతో మంది చెప్పారని, కోడెలను పూర్తిగా అధ్యయనం చేశాను కాబట్టే పోటీకి దిగానన్నారు. దుర్మార్గం చేసిన ఓట్ల దొంగ కోడెలను శిక్షించడం ఖాయమన్నారు. దుర్మార్గ రాజకీయాలు చేయడంలో జిల్లాలోనే కోడెల నంబర్ వన్ అన్నారు. పోలీసులను సొంత రౌడీల్లా వినియోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎవరూ అధైర్యపడొద్దని, ఇనిమెట్ల ప్రజలకు అండగా ఉంటామని కేడర్‌ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఫోన్‌కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దన్నారు. చేజర్లలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు తెగబడ్డారన్నారు.
బూత్ ఆక్రమించడం వల్లే తిరుగుబాటు
జిల్లాలోని సత్తెనపల్లి, గురజాల, వేమూరు, నరసరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. ఇనిమెట్లలో కేవలం పోలింగ్ బూత్‌ను ఆక్రమించడం వల్ల అక్కడి ప్రజలు కోడెలపై తిరగబడ్డారు తప్ప హత్యాయత్నం చేయలేదు. ఇక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులను సమగ్ర నివేదిక ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి అందిస్తాం.–మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సానుభూతి కోసంకోడెల దాడుల డ్రామా
కోడెల సానుభూతి కోసం దాడుల డ్రామాను సృష్టిస్తున్నారు. గొడవలు సృష్టించి భయపెడుతున్నారు. పాపాలకు టీడీపీకి శిక్ష తప్పదు. ఎవ్వరూ అధైర్య పడొద్దు.
–షేక్ మొహమ్మద్ ముస్తఫా, తూర్పు ఎమ్మెల్యే గుంటూరు
రిగ్గింగ్ చేస్తున్నారని ప్రజలు భావించారు
ఇనిమెట్లలో కోడెల పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేయడంతో రిగ్గింగ్ చేస్తున్నారని ప్రజలు భావించారు. కోడెలను బయటకు రమ్మంటే రాలేదు. ఓటమి జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు దాడులకు దిగారు. ఇనిమెట్ల, గురజాల, క్రోసూరు, కమ్మవారిపాలెం, యలమంద గ్రామాల్లో టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ ఆపే ప్రయత్నం చేశారు.
–లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి
తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు
ప్రశాంతంగా ఉండే సత్తెనపల్లిలో కోడెల రాకతో చిచ్చుపెట్టారు. పోలీసులు బూత్ ఆక్రమించిన కోడెలపై విచారణ చేయకుండా కోడెలపై దాడి అంటూ అమాయకులపై కేసులు నమోదు చేయడం భావ్యం కాదు. గురజాలలో సీఐ వైఎస్సార్‌సీపీ కార్యకర్తను కొట్టి, దూషించడంతో ఆత్మహత్యాయత్నం కూడా జరిగింది. పోలింగ్ రోజున టీడీపీ నాయకులు ముస్లింలపై దూషణలకు దిగడంతో పాటు తమ పార్టీకి చెందిన శ్రీనివాసరెడ్డి థియేటర్‌ను ధ్వంసం చేశారు. జంగమహేశ్వరపురంలో మహిళపై సీఐ దాడి చేశారు. కొత్తగణేశునిపాలెంలో నాపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బ్రాహ్మణపల్లి, జూలకల్లు, తంగెడలో టీడీపీ నాయకులు దాడులు చేశారు. తప్పు చేసిన టీడీపీ నాయకులు, పోలీసు అధికారులను శిక్షించాలి.– కాసు మహేష్‌రెడ్డి, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి
పోలీసుల చెంచాగిరీ
టీడీపీకి ఓడిపోతామని అర్ధమై దాడులకు తెగబడ్డారు. పోలీసులు చెంచాగిరీ చేస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారు కచ్చితంగా శిక్షార్హులే. డిపాజిట్లు రావని సర్వేలు తెలపడంతో ప్రజలపై పగ తీర్చుకుంటున్నారు. ఇనిమెట్లలో రిగ్గింగ్‌కు వెళితే ప్రజలు తిరగబడ్డారే తప్ప పథకం ప్రకారం జరిగిన దాడి కాదు. వేమూరు నియోజకవర్గంలో మేరుగ నాగార్జునపై దాడి జరిగింది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు. తప్పు చేసిన వారికి న్యాయబద్ధంగా శిక్ష పడాలి.– నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్‌అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment