చిత్తూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.
చిత్తూరు: రోడ్డు మీద వెళ్తున్న కారును ఆపి.. కళ్లలో కారం కొట్టి.. డబ్బులు గుంజుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లె అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. వివరాలు.. పలమనేరు మండలం విరూపాక్షపురం గ్రామానికి చెందిన నాటు వైద్యుడు రామోజీరావు బుధవారం తన కారులో పలమనేరుకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో కారు అటవీ ప్రాంతం వద్దకు రాగానే కొంతమంది గుర్తుతెలియని దుండగులు కారు ఆపారు. కారు ఆపగానే అందులో ఉన్న వ్యక్తుల కళ్లలో కారం కొట్టి వాళ్లను అదే కారులో తిరుపతి వైపు గల బంగారుపాలెం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడికి వెళ్లాక వాళ్లను రూ.3 కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. అంత డబ్బు తన వద్ద లేదని ప్రస్తుతం వెంట ఉన్న రూ.20 వేలతో పాటు బంగారు ఆభరణాలు ఇచ్చాడు. దీంతో కారును వదిలి దుండగులు పారిపోయారు. ఈ విషయాన్ని రామోజీరావు గురువారం తెల్లవారుజామున పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టింది జిల్లావాసులేనా ? లేక అంతర్రాష్ట్ర దొంగల ముఠానా అనే కోణంలో విచారణ చేపట్టారు.
(పలమనేరు)