
పలమనేరు: అసలే కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న తరుణంలో బాధ్యత కలిగిన పోలీసు కానిస్టేబుళ్లు స్టేషన్‌లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. మద్యం మత్తులో అర్ధనగ్నంగా నృత్యాలు చేశారు. విచారించిన ఎస్పీ నలుగురిని బదిలీచేశారు. బైరెడ్డిపల్లి పీఎస్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బైరెడ్డిపల్లి పోలీసుస్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ బలరాం పుట్టిన రోజు సందర్భంగా సిబ్బంది స్టేషన్‌లోనే పార్టీ చేసుకున్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కర్ణాటక మద్యంతో జల్సా చేసుకున్నారు.
అంతటితో ఆగక బట్టలు విప్పుకుంటూ నృత్యం చేశారు. వాటిని తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోలను కానిస్టేబుళ్ల గ్రూపులో పోస్ట్ చేశారు. స్టేషన్‌లో కానిస్టేబుళ్ల అరుపులు, కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారమచ్చారు. దీనికితోడు వీడియోలు వైరల్ అయి పోలీసు ఉన్నతాధికారులకు చేరాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ వెంటనే వివారణ జరిపి నివేదిక సమర్పించాలని పలమనేరు డీఎస్పీ అరీఫుల్లాను ఆదేశించారు. ఆయన పంపిన నివేదిక ఆధారంగా కానిస్టేబుళ్లలో బలరాంను మదనపల్లెకి, కార్తీక్‌ను ఐరాలకు, లోకేష్‌ను కేవీబీ పురానికి, హెడ్‌కానిస్టేబుల్ రెడ్డిశేఖర్‌ను సత్యవేడుకు బదిలీచేస్తూ ఎస్పీ సెంథిల్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment