కుప్పంలోనే కాదు పలమనేరులోనూ అదే జోరు. అడుగడుగునా అపూర్వ స్వాగతం. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారం పలమనేరు నియోజకవర్గం పరిధిలోని వి.కోట, బెరైడ్డిపల్లె మండలాల్లో పర్యటించిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పంలోనే కాదు పలమనేరులోనూ అదే జోరు. అడుగడుగునా అపూర్వ స్వాగతం. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారం పలమనేరు నియోజకవర్గం పరిధిలోని వి.కోట, బెరైడ్డిపల్లె మండలాల్లో పర్యటించిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనం పోటెత్తడంతో వి.కోట మండలంలోని పట్రాపల్లె నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెరైడ్డిపల్లెకు చేరుకునేందుకు రోజంతా పట్టింది. సోమవారం ఉదయం వి.కోట నుంచి యాత్ర ప్రారంభమైంది. ఆ ఊరు దాటేందుకే 4 గంటల సమయం పట్టింది. వి.కోట రహదారులు జనమయమయ్యాయి. అక్కడ్నుంచి జగన్ దొడ్డిపల్లె, నార్నేపల్లె, దానమయ్యగారిపల్లె, మర్లదొడ్డి, కృష్ణాపురం, కైగల్ మీదుగా బెరైడ్డిపల్లెకు చేరుకున్నారు.
మార్గమధ్యంలో శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు నేతృత్వంలో విశాఖ జిల్లా అరకు నుంచి 140 మంది సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు జగన్‌ను కలసి సమైక్య శంఖారావానికి మద్దతు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లెలో తొలివిడత పర్యటనను ముగించుకున్న జగన్ అక్కడ్నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లారు. సోమవారం యాత్రలో జగన్ వెంట పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సమన్వయకర్త తలశిల రఘురాం, ఎస్.కోటా మాజీ ఎమ్మెల్యే రవిబాబు, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎం.సుబ్రమణ్యంరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా తదితరులు పాల్గొన్నారు.