పలమనేరు (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా పలమనేరు చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే... పలమనేరు పట్టణంలోని రవీంద్రభారతి పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం కరాటే క్లాసులకు పాఠశాల గ్రౌండ్‌కు వెళ్లారు. కరాటే క్లాసులు అయిన తర్వాత పక్కనే ఉన్న చెరువుకు వెళ్లి ఈత కొట్టేందుకు దిగారు. అయితే విద్యార్థులెవరికీ ఈతరాదు. థర్మాకోల్ నడుముకు కట్టుకుని తొలుత మహేష్(12) అనే విద్యార్థి నీటిలోకి దూకాడు. మధ్యలోనే థర్మాకోల్ ఊడిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అతని తర్వాత హబీబ్ అనే విద్యార్థి కూడా దూకాడు.
అతనికీ ఈత రాక మునిగిపోతుండడంతో గట్టున ఉన్న నలుగురు విద్యార్థులు భయంతో పక్కనే చెరువులో దుస్తులు ఉతుక్కుంటున్న మహిళల వద్దకు వెళ్లి విషయం చెప్పారు. వారు హుటాహుటిన వచ్చి మునిగిపోతున్న హబీబ్ వైపుకు చీరలు విసిరి వాటి సాయంతో గట్టుకు లాగారు. అయితే మహేష్ అప్పటికే మునిగిపోయాడు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి మహేష్ మృతదేహం కోసం గాలింపు మొదలుపెట్టారు. కాగా మహేష్ తండ్రి ఇటీవలే మృతిచెందారు. తల్లి కూలి పనులు చేసుకుంటూ పిల్లాడిని చదివించుకుంటోంది.
చెరువులో మునిగి విద్యార్థి మృతి
Published Sun, Sep 13 2015 9:47 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement