(సుబ్రమణ్యం, పలమనేరు)
► అడవికి ఆమడ దూరంలో ఉంటుంది ఆ గ్రామం. దక్షిణం, పడమట వైపు నుంచి విస్తరించిన కౌండిన్య అభయారణ్యం. రక్షణ కోసం ప్రత్యేకంగా తవ్విన ఆరుఅడుగుల ట్రెంచ్‌లు సైతం తెలివిగా దాటి ఏనుగుల గుంపులు అప్పుడపుడు దాడి చేస్తాయి. చెరకు, మామిడి తోటల్లో విధ్వంసం సృష్టిస్తాయి. ఊరు పేరు సముద్రపల్లి . చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండల కేంద్రానికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అయినా, బస్సు సౌకర్యం లేదు. ‘సాక్షి’ ఉదయం 11 గంటలకు గ్రామం చేరేనాటికి సచివాలయం వద్ద సందడిగా ఉంది.
► గతంలో ఏపని కావాలన్నా టౌన్‌కి వెళ్లాల్సిందే. కూలి పనులు చేసుకునే వారు ఏదేని పనికోసం పలమనేరుకు వెళ్లితే – ఆరోజు కూలి పోగొట్టుకున్నట్టే. వృద్ధులు,, వికలాంగులు సైతం పింఛన్ కోసం ప్రతినెలా నాలుగు కిలోమీటర్లు దూరంలోని పెంగరగుంట పోస్టాఫీసుకు వెళ్లేవారు. ఏ అధికారిని కలవాలన్నా, రైతులు 10(1), అడంగల్ పొందాలన్నా ఇదే పరిస్థితి. ఏనుగుల గుంపు పంట నష్టం చేసినా పట్టించుకునే వారే ఉండేవారు కాదు. ఇప్పుడు సముద్రపల్లిలో గ్రామ సచివాలయం వచ్చాక అన్ని పనులు ఇక్కడే జరుగుతున్నాయని స్ధానికుడు పెంచలయ్య చెప్పారు.
ప్రతివీధి శుభ్రంగా ఉంది
దిగువవీధికి చెందిన మంగమ్మ మాట్లాడుతూ మాఊరి వీధులన్నీ చక్కగా బాగున్నాయన్నారు. . సచివాలయ సిబ్బంది ఊర్లో తిరుగుతూ కరోనాపై, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. దీంతో జనం చెత్తను వీధులలో వేయడం మానుకున్నారని తెలిపింది. ఏ ఇంటికి ఎవరు కొత్తగా వచ్చినా వెంటనే సమాచారం సచివాలయ సిబ్బందికి తెలుస్తోందని, అధికారులు వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది.
తీరిన పదేళ్ల సమస్య
సముద్రపల్లి నుంచి క్రిష్ణాపురం గ్రామానికి అడ్డదారినే ప్రజలు ఉపయోగిస్తున్నారు. కొంత దూరం దారి అధ్వానంగా కనీసం నడిచి వెళ్లేందుకు కూడ కష్టంగా ఉండేది. గత పదేళ్లుగా ఇదే పరిస్ధితి. ఇప్పుడు 330 మీటర్ల మేర సీసీ రోడ్డు వేశారు. దీంతో దారి సమస్య తీరింది.
ఇంగ్లిష్ మీడియం పెట్టాలి
గ్రామంలోని ఉత్తరం వైపు సర్కారు బడి ఉంది. అక్కడ సుబ్బన్న, రామ్మూర్తి నాయుడు తదితరులు కనిపించారు. కరోనా కారణంగా బడి మూసి ఉంది. వారు పిల్లల చదువు గురించి మాట్లాడుతూ ఇంగ్లిషు మీడియంలో చదివిస్తేనే భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏడాదికి పది వేల వరకు ఫీజులు కట్టి పలమనేరులోని ప్రైవేటు స్కూల్‌లో చదివించడం తమ లాంటి వాళ్ళకు చాలా కష్టంగా ఉందన్నారు.
మంచినీటి సమస్య తీరింది
గ్రామంలోని ప్రధానమైన వినాయకుని గుడి వీధిలోకి వెళ్ళగా కొళాయి వద్ద మంచినీళ్ళు పట్టుకుంటున్న లలితమ్మ, జయమ్మలను పలుకరిస్తే ...గతంలో తాగు నీటికి చాలా ఇబ్బందిగా ఉండేదని సచివాలయ ఉద్యోగుల చొరవతో నీటి సమస్య తీరిందని తెలిపారు. కొన్ని ఇళ్ల వద్ద నీటిని మోటార్లు వేసి సంప్‌లలో అక్రమంగా నింపేవారని సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి నీటి సరఫరా ఆరాతీసి అందరికీ మంచి నీరందేలా చర్యలు తీసుకున్నారని వారు చెప్పారు.
విత్తనాల ఇబ్బందికి చెక్..
గ్రామంలోని రేషన్‌షాపు వీధిలోకి వెళ్ళగానే బాబు, ఉదయ్, తిరుమలేష్ అనే రైతులు వేరుశెనగ విత్తనాలను వలుస్తూ కనిపించారు. గతంలో విత్తనాలు కావాలంటే పలమనేరుకు వెళ్లి రెండు..మూడు రోజులు క్యూలో ఉండి తెచ్చుకోవలసి వచ్చేదని ఇప్పుడు స్ధానికంగానే విత్తనాలను పంపిణీ చేయడంతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.
ఏ పని ఉన్నా సచివాలయానికి వెళ్తాం..
ఊరిలోని ఎగువ వీధిలో ధనమ్మ, భాగ్యమ్మ అనే మహిళలను పలకరించగా గతంలో ఏ సమస్య వచ్చినా టౌన్‌కు వెళ్ళేవారమని.. ఇప్పుడు సచివాలయంలో సిబ్బందితో మాట్లాడితే పరిష్కారం దొరుకుతోందన్నారు. అమ్మఒడి కొందరి పేర్లు రాకుంటే సచివాలయ సిబ్బందిని కలవగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పారన్నారు. దీంతో బ్యాంకుకు వెళ్లి సమస్య పరిష్కరించుకున్నారని తర్వాత పేర్లు జాబితాలో వచ్చాయన్నారు.
సున్నా వడ్డీ కింద 15 వందలు
దిగువవీధిలో మంజుల, లక్ష్మీ ఇంకా కొంతమంది మహిళలు కనిపించారు. తమ పొదుపు సంఘంలో ప్రతి సభ్యురాలికి సున్నా వడ్డీ కింద రూ.1500
వచ్చిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆ డబ్బులు ఉపయోగపడ్డాయని చెప్పారు.
అర్హులందరికీ పింఛన్లు..
గతంలో గ్రామంలో 162 మందికి మాత్రమే వివిధ రకాల పింఛన్లు వచ్చేవి. ఇంకా అర్హులైన వారు ఉండేవారు. ఇప్పుడు 203 మందికి పింఛను ఇంటి వద్దకే వస్తోంది. అంతకు ముందు పింఛను దారులు 5 కి.మీ. దూరంలోని పెంగరగుంటకు వెళ్ళి పడిగాపులు పడుతూ తీసుకొనేవారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు చాలా కష్టాలు పడేవారు. ఇప్పుడు ఆ సమస్యలేదు.
మహిళల సమస్యలకు సత్వర పరిష్కారం..
గ్రామానికి చెందిన ఒక మహిళకు అత్తగారు, బంధువుల నుంచి వేధింపులు తలెత్తాయి. ఈ విషయం గ్రామ పోలీసుకు తెలిసింది. ఆమె కౌన్సెలింగ్ చేసి సమస్యను తీర్చారు. ఎస్టీకాలనీకి చెందిన మహిళను భర్త తాగి వేధిస్తుంటే ఫోన్ చేసిన వెంటనే మహిళా పోలీసు స్పందించి సమస్యను పరిష్కరించారు.
రూ. 5 వేలు పింఛన్ ఇస్తున్నారు..
ఆరు ఏళ్ల క్రితం పొలం వద్ద బోరు మోటారు వైర్లను రిపేరు చేస్తూ ఫ్యూజు వేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్‌షాక్‌కు గురయ్యాను. దీంతో శరీరంలో నరాలు దెబ్బతిన్నాయి.వైద్యం చేయించినా లాభంలేక మంచానికే పరిమితమయ్యాను. వేలూరు సీఎంసీలో వైద్యం కోసం ప్రతినెలా పదివేలు ఖర్చవుతోంది. దివ్యాంగ పింఛను రూ.5 వేలు ఇస్తున్నారు. అదీ ఎక్కడికి వెళ్లకుండా ఇంటివద్దకే వచ్చి ఇస్తున్నారు.
– జయచంద్రనాయుడు
వేరుశెనగ విత్తనాలకు టౌన్‌కి వెళ్లే వాళ్లం..
వేరుశనగ విత్తనాలు కావాలంటే టౌన్‌కి వెళ్ళి క్యూలైన్‌లో ఉండి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు మా ఊరిలోనే విత్తనాలు ఇచ్చారు. రవాణా చార్జీలు, పనులు వదులుకొని పోయే బాధ తప్పింది. మా పల్లెలోనే ఏ పని కావాలన్నా ఇట్టే చేసుకుంటున్నాం.
– రంగమ్మ, మహిళా రైతు
పది వేల సాయం సంతోషం
పల్లెల్లో టైలరింగ్‌కు ఆదరణ తగ్గుతోంది. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో పదివేల రూపాయల సాయం మా కు ఎంతో చేదోడుగా ఉంటుంది.
– రవికుమార్, టైలర్
Comments
Please login to add a commentAdd a comment