సీఎం వైఎస్ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న వివిధ జిల్లాల కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలు
వైద్యం, సర్వేలు, క్వారంటైన్లు, ఇతరత్రా కార్యక్రమాల కోసం ఖర్చులు బాగా పెరిగాయి. ఇవన్నీ బేరీజు వేసుకుంటూ.. ఆర్థిక కష్టాల్లో ఉన్నా కూడా చిరునవ్వుతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఎవరూ పస్తులుండే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకున్నాం.
గత పది నెలల కాలంలో ప్రతి అడుగూ మీకు కనిపించే విధంగా దేవుడు వేయించగలిగాడు. రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు రూ.150 కోట్ల పైచిలుకు ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ కరోనా వల్ల ఇప్పుడు సున్నా అయిపోయింది. రూపాయి కూడా ఆదాయం రాని పరిస్థితి. అయినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని ఎక్కడా లేని విధంగా అడుగులు ముందుకు వేశాం.
సాక్షి, అమరావతి: కులం, మతం, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ముస్లిం పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండుగ వచ్చినప్పుడే గుర్తు పెట్టుకోవడం కాదని, ప్రతి నెలా తోఫా ఉండాలన్నారు. ఏడాదికి ఒక రోజు మాత్రమే ఒక కమ్యూనిటీని గుర్తుపెట్టుకుని శనక్కాయలు, బెల్లాలు మాదిరిగా ఇవ్వటం సరికాదన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఈ ప్రభుత్వం మీది.. మనందరిది..
► ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ప్రతి పేదవర్గానికీ మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనా లాంటి ఇబ్బందికర సమయాల్లో ఒన్ టైం సహాయం కింద దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో రెలిజియస్ సర్వీసులు చేస్తున్న అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్లకు రూ.5 వేల చొప్పున ఇస్తాం. గతంలో రిజిస్టర్ అయిన మసీదుల వారికే కాకుండా రిజిస్టర్ కాని మసీదుల్లోని వారికీ వర్తింప చేస్తాం. అర్చకులకు ఈ సాయం ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం.
► ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ అందాలి. అందరికి మేలు జరగాలి. ఈ రకంగానే ప్రభుత్వం పనిచేయాలని నేను నమ్ముతున్నాను. అందుకనే కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా అందరికీ పథకాలు అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది.. మనందరిది.
► దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో ప్రతి నెలా ఒక కొత్త కార్యక్రమంతో ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా చేస్తున్నాం. దేవుడి దయతో అనేక కార్యక్రమాలు అమలు చేశాం. అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ.2,250కు తీసుకెళ్లాం.
ప్రతి పేద కుటుంబానికి తోడుగా నిలిచాం
► బీపీఎల్ కుటుంబానికి రూ.1000 ఇచ్చాం. పేదరికంలో ఉన్నవారికి తోడుగా నిలిచాం. నెలకు ఒకసారి రేషన్‌కు బదులు నెలలో మూడుసార్లు ఆ కార్యక్రమం చేపట్టాం. ఉచితంగా రేషన్, పప్పు దినుసులు ఇచ్చాం.
► ఈ నెలలోనే పొదుపు సంఘాల్లోని మహిళలు అందరికీ 24వ తేదీన సున్నా వడ్డీ కార్యక్రమానికి దాదాపు రూ.1400 కోట్లు ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని చెబుతున్నాం.
► ప్రతి పేదవాడికీ ఉన్నత చదువులు చెప్పించే కార్యక్రమంలో భాగంగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కోసం ఈ నెలలోనే ఎప్పుడూ.. ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.1880 కోట్లు క్లియర్ చేశాం.
► ఈ విద్యా సంవత్సరంలో కూడా మార్చి 31 వరకు పూర్తి బకాయిలు, పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బుధవారం నాటికి చెల్లిస్తున్నాం. ఈ పథకానికి సుమారు రూ.4 వేల కోట్లపైన ఖర్చు చేస్తున్నాం.
► వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లి ఖాతాలోకి నేరుగా ఆ మొత్తం వేస్తాం. ఆ డబ్బును తల్లి నేరుగా కాలేజీలకు కడుతుంది. జూన్‌లో కాలేజీలు ప్రారంభమైతే.. సెప్టెంబరు నాటికల్లా తల్లి ఖాతాలో డబ్బు వేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment