సోమవారం హుజూర్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో మొక్క నాటుతున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్, బడుగుల, ఎమ్మెల్యేలు శానంపూడి, గాదరి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కరోనా వైరస్ ప్రభావం కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ ఆపలేదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. సోమవారం ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రూ.24 లక్షల నిధులతో నిర్మించనున్న వైకుంఠధామం, రూ.10 లక్షలతో నిర్మించనున్న స్మృతివనం, రూ.71 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.50 లక్షలతో నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో రూ.40 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే కొత్తగా ఏర్పడిన హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. యువ తకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (న్యాక్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని శేషమ్మగూడెం డంపింగ్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని (ఫీకల్‌స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ రైతు బంధు కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం 54.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,889 కోట్లు జమచేశామన్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, రైతు బీమా లాంటి పేదల సంక్షేమ పథకాలను ఈ కష్ట కాలంలో కూడా ఆపకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తుండడం ఆయన ముందుచూపునకు నిదర్శనమన్నారు.
హుజూర్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: ఉత్తమ్
హుజూర్‌నగర్‌లో జరిగిన సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను గృహనిర్మాణ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం 75 శాతం పూర్తయిందన్నారు. ఆ ఇళ్లను, రింగు రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తేవాలని ఆయన కేటీఆర్‌ను కోరారు. హుజూర్‌నగర్‌లో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ఉత్తమ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. మంత్రి కేటీఆర్ వెంట ఆయా కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జెడ్పీ చైర్మన్లు గుజ్జా దీపిక, బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, బాల్క సుమన్, సూర్యాపేట, నల్లగొండ కలెక్టర్లు టి.వినయ్‌కృష్ణారెడ్డి, ప్రశాంత్ జీవన్‌పాటిల్ పాల్గొన్నారు.
అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు
నల్లగొండ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలను నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మానవ వ్యర్థాలను సక్రమంగా శుద్ధి చేయకపోతే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. నల్ల గొండను ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నందున ఏ కార్యక్రమాలైనా పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిది, అలాగే తనది కూడా అని స్పష్టం చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలోని ఉదయ సముద్రం ప్రాజెక్టుకు ఇటీవల ఆరు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని, ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment