wage work
-
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్‌లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్‌కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
సముద్రపల్లికి సు‘రాజ్యం’ వచ్చింది!
(సుబ్రమణ్యం, పలమనేరు) ► అడవికి ఆమడ దూరంలో ఉంటుంది ఆ గ్రామం. దక్షిణం, పడమట వైపు నుంచి విస్తరించిన కౌండిన్య అభయారణ్యం. రక్షణ కోసం ప్రత్యేకంగా తవ్విన ఆరుఅడుగుల ట్రెంచ్‌లు సైతం తెలివిగా దాటి ఏనుగుల గుంపులు అప్పుడపుడు దాడి చేస్తాయి. చెరకు, మామిడి తోటల్లో విధ్వంసం సృష్టిస్తాయి. ఊరు పేరు సముద్రపల్లి . చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండల కేంద్రానికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అయినా, బస్సు సౌకర్యం లేదు. ‘సాక్షి’ ఉదయం 11 గంటలకు గ్రామం చేరేనాటికి సచివాలయం వద్ద సందడిగా ఉంది. ► గతంలో ఏపని కావాలన్నా టౌన్‌కి వెళ్లాల్సిందే. కూలి పనులు చేసుకునే వారు ఏదేని పనికోసం పలమనేరుకు వెళ్లితే – ఆరోజు కూలి పోగొట్టుకున్నట్టే. వృద్ధులు,, వికలాంగులు సైతం పింఛన్ కోసం ప్రతినెలా నాలుగు కిలోమీటర్లు దూరంలోని పెంగరగుంట పోస్టాఫీసుకు వెళ్లేవారు. ఏ అధికారిని కలవాలన్నా, రైతులు 10(1), అడంగల్ పొందాలన్నా ఇదే పరిస్థితి. ఏనుగుల గుంపు పంట నష్టం చేసినా పట్టించుకునే వారే ఉండేవారు కాదు. ఇప్పుడు సముద్రపల్లిలో గ్రామ సచివాలయం వచ్చాక అన్ని పనులు ఇక్కడే జరుగుతున్నాయని స్ధానికుడు పెంచలయ్య చెప్పారు. ప్రతివీధి శుభ్రంగా ఉంది దిగువవీధికి చెందిన మంగమ్మ మాట్లాడుతూ మాఊరి వీధులన్నీ చక్కగా బాగున్నాయన్నారు. . సచివాలయ సిబ్బంది ఊర్లో తిరుగుతూ కరోనాపై, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. దీంతో జనం చెత్తను వీధులలో వేయడం మానుకున్నారని తెలిపింది. ఏ ఇంటికి ఎవరు కొత్తగా వచ్చినా వెంటనే సమాచారం సచివాలయ సిబ్బందికి తెలుస్తోందని, అధికారులు వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. తీరిన పదేళ్ల సమస్య సముద్రపల్లి నుంచి క్రిష్ణాపురం గ్రామానికి అడ్డదారినే ప్రజలు ఉపయోగిస్తున్నారు. కొంత దూరం దారి అధ్వానంగా కనీసం నడిచి వెళ్లేందుకు కూడ కష్టంగా ఉండేది. గత పదేళ్లుగా ఇదే పరిస్ధితి. ఇప్పుడు 330 మీటర్ల మేర సీసీ రోడ్డు వేశారు. దీంతో దారి సమస్య తీరింది. ఇంగ్లిష్ మీడియం పెట్టాలి గ్రామంలోని ఉత్తరం వైపు సర్కారు బడి ఉంది. అక్కడ సుబ్బన్న, రామ్మూర్తి నాయుడు తదితరులు కనిపించారు. కరోనా కారణంగా బడి మూసి ఉంది. వారు పిల్లల చదువు గురించి మాట్లాడుతూ ఇంగ్లిషు మీడియంలో చదివిస్తేనే భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏడాదికి పది వేల వరకు ఫీజులు కట్టి పలమనేరులోని ప్రైవేటు స్కూల్లో చదివించడం తమ లాంటి వాళ్ళకు చాలా కష్టంగా ఉందన్నారు. మంచినీటి సమస్య తీరింది గ్రామంలోని ప్రధానమైన వినాయకుని గుడి వీధిలోకి వెళ్ళగా కొళాయి వద్ద మంచినీళ్ళు పట్టుకుంటున్న లలితమ్మ, జయమ్మలను పలుకరిస్తే ...గతంలో తాగు నీటికి చాలా ఇబ్బందిగా ఉండేదని సచివాలయ ఉద్యోగుల చొరవతో నీటి సమస్య తీరిందని తెలిపారు. కొన్ని ఇళ్ల వద్ద నీటిని మోటార్లు వేసి సంప్‌లలో అక్రమంగా నింపేవారని సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి నీటి సరఫరా ఆరాతీసి అందరికీ మంచి నీరందేలా చర్యలు తీసుకున్నారని వారు చెప్పారు. విత్తనాల ఇబ్బందికి చెక్.. గ్రామంలోని రేషన్‌షాపు వీధిలోకి వెళ్ళగానే బాబు, ఉదయ్, తిరుమలేష్ అనే రైతులు వేరుశెనగ విత్తనాలను వలుస్తూ కనిపించారు. గతంలో విత్తనాలు కావాలంటే పలమనేరుకు వెళ్లి రెండు..మూడు రోజులు క్యూలో ఉండి తెచ్చుకోవలసి వచ్చేదని ఇప్పుడు స్ధానికంగానే విత్తనాలను పంపిణీ చేయడంతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఏ పని ఉన్నా సచివాలయానికి వెళ్తాం.. ఊరిలోని ఎగువ వీధిలో ధనమ్మ, భాగ్యమ్మ అనే మహిళలను పలకరించగా గతంలో ఏ సమస్య వచ్చినా టౌన్‌కు వెళ్ళేవారమని.. ఇప్పుడు సచివాలయంలో సిబ్బందితో మాట్లాడితే పరిష్కారం దొరుకుతోందన్నారు. అమ్మఒడి కొందరి పేర్లు రాకుంటే సచివాలయ సిబ్బందిని కలవగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పారన్నారు. దీంతో బ్యాంకుకు వెళ్లి సమస్య పరిష్కరించుకున్నారని తర్వాత పేర్లు జాబితాలో వచ్చాయన్నారు. సున్నా వడ్డీ కింద 15 వందలు దిగువవీధిలో మంజుల, లక్ష్మీ ఇంకా కొంతమంది మహిళలు కనిపించారు. తమ పొదుపు సంఘంలో ప్రతి సభ్యురాలికి సున్నా వడ్డీ కింద రూ.1500 వచ్చిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆ డబ్బులు ఉపయోగపడ్డాయని చెప్పారు. అర్హులందరికీ పింఛన్లు.. గతంలో గ్రామంలో 162 మందికి మాత్రమే వివిధ రకాల పింఛన్లు వచ్చేవి. ఇంకా అర్హులైన వారు ఉండేవారు. ఇప్పుడు 203 మందికి పింఛను ఇంటి వద్దకే వస్తోంది. అంతకు ముందు పింఛను దారులు 5 కి.మీ. దూరంలోని పెంగరగుంటకు వెళ్ళి పడిగాపులు పడుతూ తీసుకొనేవారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు చాలా కష్టాలు పడేవారు. ఇప్పుడు ఆ సమస్యలేదు. మహిళల సమస్యలకు సత్వర పరిష్కారం.. గ్రామానికి చెందిన ఒక మహిళకు అత్తగారు, బంధువుల నుంచి వేధింపులు తలెత్తాయి. ఈ విషయం గ్రామ పోలీసుకు తెలిసింది. ఆమె కౌన్సెలింగ్ చేసి సమస్యను తీర్చారు. ఎస్టీకాలనీకి చెందిన మహిళను భర్త తాగి వేధిస్తుంటే ఫోన్ చేసిన వెంటనే మహిళా పోలీసు స్పందించి సమస్యను పరిష్కరించారు. రూ. 5 వేలు పింఛన్ ఇస్తున్నారు.. ఆరు ఏళ్ల క్రితం పొలం వద్ద బోరు మోటారు వైర్లను రిపేరు చేస్తూ ఫ్యూజు వేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్‌షాక్‌కు గురయ్యాను. దీంతో శరీరంలో నరాలు దెబ్బతిన్నాయి.వైద్యం చేయించినా లాభంలేక మంచానికే పరిమితమయ్యాను. వేలూరు సీఎంసీలో వైద్యం కోసం ప్రతినెలా పదివేలు ఖర్చవుతోంది. దివ్యాంగ పింఛను రూ.5 వేలు ఇస్తున్నారు. అదీ ఎక్కడికి వెళ్లకుండా ఇంటివద్దకే వచ్చి ఇస్తున్నారు. – జయచంద్రనాయుడు వేరుశెనగ విత్తనాలకు టౌన్‌కి వెళ్లే వాళ్లం.. వేరుశనగ విత్తనాలు కావాలంటే టౌన్‌కి వెళ్ళి క్యూలైన్లో ఉండి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు మా ఊరిలోనే విత్తనాలు ఇచ్చారు. రవాణా చార్జీలు, పనులు వదులుకొని పోయే బాధ తప్పింది. మా పల్లెలోనే ఏ పని కావాలన్నా ఇట్టే చేసుకుంటున్నాం. – రంగమ్మ, మహిళా రైతు పది వేల సాయం సంతోషం పల్లెల్లో టైలరింగ్‌కు ఆదరణ తగ్గుతోంది. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో పదివేల రూపాయల సాయం మా కు ఎంతో చేదోడుగా ఉంటుంది. – రవికుమార్, టైలర్ -
కన్నీళ్లను దిగమింగుతూ..
ఉబికి వచ్చే కన్నీటిని కను రెప్పలతో అదిమి పడుతూ... తరుముకు వచ్చే దు:ఖాన్ని గరళంలో దిగమింగుతూ... ఏవో కారణాలు కావొచ్చు.. మరేవో విభేదాలు కావొచ్చు.. భర్తకు దూరంగా ఉంటూ... తన పిల్లల భవిష్యత్ కోసం బతుకు బండిని లాగడానికి.. కన్నీటి కడలిలో నావలా... రేయింబవళ్లు రెక్కలుముక్కలు చేసుకుంటోంది ఓ ఇల్లాలు. యుక్త వయస్సులో నయవంచకుల మాటలు నమ్మి మోసపోయి పెళ్లి చేసుకుని కొడుకును కన్నది. భర్త దరి చేరనీయకపోవడంతో కొడుకు పుట్టినప్పటి నుంచి కన్నవారి నీడనే ఆశ్రయం పొందుతోంది. కూలీ పనులు చేసుకుంటూ... బిడ్డను చదివిస్తూ.. ఎప్పుడు కట్టుకున్నవాడు కరుణించి దగ్గరకు తీసుకుంటాడో అనే నమ్మకంతో బతుకు వెళ్లదీస్తున్న మరో మహిళ కష్టాలు వర్ణణాతీతం. మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డికి చెందిన గాజుల సుజాత ఐదుగురు అక్కా చెల్లెళ్లలో చివరి సంతానం. ఆమెకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. కాలక్రమంలో అందరి పెళ్లిళ్లు అయ్యాయి. అందరిలాగే సుజాత కూడా జీవితంపై ఏవేవో బంగారు కలలు కన్నది. ఆమెకు కూతురు రచన, కుమారుడు దినేష్ ఉన్నారు. సంతోషంగా అందరిలా జీవించాలనుకున్నది. కాలం ఆమె జీవితంపై చిన్నచూపు చూసింది. ఏవో కొన్ని కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. కష్టాల సుడి గుండంలో చిక్కుకున్న సుజాత జీవితాన్ని గట్టెక్కించడానికి పుట్టింటివారు అండగా నిలిచారు. పుట్టినిల్లు మిరుదొడ్డిలోనే సుజాత తన పిల్లలతో కాలం వెళ్లదీస్తోంది. మిరుదొడ్డిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆమె పిల్లలు రచన 8వ తరగతి, దినేష్ 6వ తరగతి చదువుతున్నారు. పిల్లలు కూడా పరిస్థితులకు అణుగుణంగా మెదులుతున్నారు. తల్లి పడుతున్న అష్టకష్టాలను చూసి ఎక్కువ ఆడంబరాలకు పోకుండా శ్రద్ధగా చదువుకుంటున్నారు. పిల్లల భవిష్యత్ కోసం... వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటోంది. ఉండటానికి ఇల్లు లేక.. కిరాయి ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. బతుకు భారాన్ని తన భుజస్కందాలపై మోయడానికి సుజాత బీడీలు చుడుతోంది. వెన్ను నొప్పులు, మెడనరాల నొప్పు లు వంటి ఆరోగ్య సమస్యలు వెంటా డుతున్నా... సర్కారు దవాఖా నా మందులతో న యం చేసుకుంటూ దు:ఖాన్ని దిగమింగుతోంది. సమయం చిక్కినప్పుడల్లా వ్యవసాయ కూలీగా మారుతోంది. రెక్కలుముక్కలు చేసుకుని ఇల్లు గడవడానికి కష్టపడుతోంది. ఉపాధి కూలీ పనులు చేస్తూ పైసాపైసా కూడబెట్టుకుంటోంది. ఇంటి కిరాయి నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, నోటు బుక్కులు సమకూరుస్తోంది. పుట్టింటివారి నుంచి కొండంత అండ లభించడం ఆమెకు కాస్త ఊరటనిస్తోంది. లేదంటే తన బతుకు మరోలా ఉండేదని కన్నీటిపర్యంతమవుతోంది సుజాత. పిల్లల భవిష్యత్ కోసం పరితపిస్తున్న సుజాత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కన్నవారి నీడనే బతుకు.. హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన గంగారపు స్వప్న, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. తరువాత పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసి ఇంటికి పంపించారు. అత్తారింట వేధింపులు భరించలేక పుట్టేడు దు:ఖంతో పుట్టింటికి చేరింది స్వప్న. ఆవేశంలో వెళ్లగొట్టినా... ఎప్పుడైనా ఆదరిస్తాడనే నమ్మకంతో పుట్టింటి నీడనే బతుకు వెళ్లదీస్తోంది. 15 ఏళ్ల క్రితం ఓ కొడుకు జన్మనిచ్చినా... తండ్రి దగ్గరకు తీయలేదు. ఆ తల్లీబిడ్డలను కనికరించలేదు. కూలీ పనులు చేసుకుంటూ కొడుకు సాదుకుంటోంది. న్యాయం కోసం తిరగని పోలీస్‌స్టేషన్ లేదు, అడగని అయ్యా లేడు. ఎక్కడా న్యాయం జరగలేదు. చివరి ప్రయత్నంగా వెంటెనెన్స్ కోసం కోర్టును ఆశ్రయించినా... కేసు కోర్టులోనే ఉంది. కనీపెంచిన అమ్మానాన్నలు బిడ్డ సంతోషంగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసి ఫలించ లేదు. ఆమె తండ్రి వృద్ధుడు కావడంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది. కూలీ పనులు చేద్దామంటే నడుం నొప్పి ఆమెను వేధిస్తోంది. ఇంటి దగ్గరనే ఉంటూ బీడీలు చేస్తూ కొడుకు సాదుకుంటోంది. ఆ దేవుడు కరుణించి బుతుకులు ఎప్పుడు మారుస్తాడని ఎదురు చూస్తోంది. మా ఒంటరి బతుకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే కిరాణం కొట్టు పెట్టుకొని ఉపాధి పొందుతామని ఆశిస్తోంది స్వప్న. -
సర్పంచైనా.. కూలి మానలే!
అనుకోకుండా కలిసొచ్చిన అదృష్టం ఆమెను సర్పంచ్‌ను చేసినా.. ఆమె మాత్రం సాదాసీదాగా బతికేందుకే ఇష్టపడుతున్నారు. గ్రామానికి ప్రథమ పౌరురాలు అయినా జీవనం కోసం మొదటి నుంచీ చేస్తున్న కూలి పనులను మాత్రం వదలడం లేదు. ఓ వైపు సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తూనే మరోవైపు కూలి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పరకాల మండలం రాజిపేట సర్పంచ్ తూర్పాటి ఎల్లమ్మ. - పరకాల కష్టపడడంలో ఆనందం కష్టపడి పనిచేసి సంపాదించాలనే సర్పంచ్‌నైనా రోజూ కూలికి పోతున్న. కష్టపడడంలో ఆనంద ం ఉంది. రూ.30 కూలి ఉన్నప్పుడు నుంచి వెళ్తున్న. ఇప్పుడు రోజుకు రూ.180 వస్తున్నయ్. కూలికొస్తున్నా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్న. ఉదయం ఎవరికైనా పనులుంటే చేసి తర్వాత పరకాల వచ్చి పనిచేస్తున్న. మా ఊర్లో సీసీ వేసిన. సైడ్ కాల్వలు తీసిన. గుడుంబా అమ్మవద్దని చెప్పిన. - ఎల్లమ్మ, సర్పంచ్ పారతో సిమెంటు కలుపుతున్న ఈమె పేరు తూర్పాటి ఎల్లమ్మ. ఊరు.. పరకాల మండలంలోని రాజిపేట. చిన్నప్పటి నుంచి ఆమె కూలి పనులకు వెళ్లేది. ఎల్లమ్మ భర్త కుమార్ బోళ్ల వ్యాపారం చేస్తుంటారు. ఆయన సంపాదనకు కాస్తంత తోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో పెళ్లయిన తర్వాత కూడా ఓ తాపీమేస్త్రీ వద్ద ఎల్లమ్మ మళ్లీ పనికి కుదిరింది. ఇందులో వింతేముంది.. భార్యభర్తలు సంపాదిస్తేనే కానీ రోజు గడవని కాలం.. అని ఊరికే కొట్టిపారేయకండి. ఎందుకంటే ఆమె ఓ ప్రజాప్రతినిధి. పరకాల మండలంలోని రాజిపేట గ్రామ సర్పంచ్. అయ్యో.. ఈ మాత్రానికే ఆశ్చర్యపోతే ఎలా.. ఇంకా చాలాఉంది. చదవండి మరి. - పరకాల గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అదృష్టం ఎల్లమ్మ ఇంటి తలుపు తట్టింది. తలుపుతీసి ఎదురుగా ఉన్న అదృష్టాన్ని చూసి ఎగిరి గంతేయలేదు. సాదరంగా ఆహ్వానించింది. పంచాయతీ ఎన్నికల్లో రాజిపేట ఎస్సీకి రిజర్వు అయింది. ఊర్లో అందరితో మంచిగా ఉంటూ తనపనేదో తను చేసుకుపోయే ఎల్లమ్మ అప్పుడు అందరి దృష్టిలో పడింది. ఆమెను సర్పంచ్‌ను చేస్తే అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా గ్రామానికి మంచి చేస్తుందని అందరూ భావించారు. అనుకున్నదే ఆలస్యం అన్నట్టు ఆమెను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతేకాదు ఉపసర్పంచ్, వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేశారు. దీంతో గ్రామంలో ఎన్నికలు నిర్వహించకుండానే పాలకవర్గం కొలువుదీరింది. అకస్మాత్తుగా వచ్చి ఒళ్లో వాలిన అదృష్టానికి ఎల్లమ్మ ఉబ్బితబ్బిబ్బయింది. పట్టలేని ఆనందంతో పొంగిపోయింది. భర్తకు చేదోడుగా.. అందివచ్చిన అవకాశంతో గ్రామంలో మొదటి పౌరురాలు అయినా ఎల్లమ్మ కూలికెళ్లడం మానలేదు. ఉదయం కార్యాలయానికి వెళ్లి పనులు చక్కబెట్టుకోవడం, తర్వాత కూలికి వెళ్లడం.. ఇదీ ఆమె దినచర్య. సర్పంచ్నన్న అహా న్ని పక్కనపెట్టి కూలికెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. సభ లు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం కూలికి పుల్‌స్టాప్ పెడుతున్నారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. నిరక్ష రాస్యురాలైన ఎ ల్లమ్మకు సంతకం చేయడం మాత్రం వచ్చు. గ్రామాభివృద్ధికి ఈమె ఏం చే స్తుందన్న విమర్శలను పటాపంచలు చేస్తూ ఊర్లో సీసీరోడ్డు వేయిం చారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు బావిని అద్దెకు తీసుకుని గ్రామస్తులకు నీటిసమస్యలు రాకుండా చూశారు. అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు వింటూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఈ కూలీ సర్పంచ్ ఇప్పుడు అందరికీ ఆదర్శమయ్యారు. -
కుటుంబ కలహాలతో భార్య హత్య
పెద ఓగిరాలలో దారుణం గడ్డపారతో కొట్టి చంపిన వైనం పెదఓగిరాల (ఉయ్యూరు), న్యూస్‌లైన్ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన సంఘటన మండలంలోని పెద ఓగిరాల గ్రామంలో ఆదివారం రాత్రి కలకలం సృష్టించింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బందెల కృష్ణ, భార్య కుమారి (40) వ్యవసాయ కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా వీరిరువురి మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థికపరమైన విషయంలో తరచూ మనస్పర్థలు వచ్చేవి. ఈ నేపథ్యంలోనే ఆదివారం భార్యభర్తలు ఇరువురూ గొడవపడ్డారు. మాటామాటా పెరిగి గడ్డపారతో భార్య తలపై కృష్ణ దాడి చేయడంతో కుమారి కుప్పకూలిపోయింది. క్షతగాత్రురాలిని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుమారిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. కుమార్తె హత్య ఉదంతం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణమ్మ రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కుమారికి ఇద్దరు కుమారులున్నారని తెలిసింది. రూరల్ ఎస్ఐ కృష్ణమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కుమారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం ఆస్పత్రిలో మృతదేహాన్ని ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు, సీఐ మురళీరామకృష్ణ పరిశీలించారు. కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. భార్యను హతమార్చిన కృష్ణ పరారీలో ఉన్నాడు.