పలమనేరులో తయారయ్యే మట్టి బొమ్మలు దేశ పార్లమెంట్‌లో కొలువుదీరనున్నాయి. ఈ మేరకు కేంద్ర హస్తకళాభివృద్ధి సంస్థ నుంచి సమాచారం వచ్చింది. దీంతో పలు డిజైన్లను పరిశీలించి.. వాటిలో 12 డిజైన్లను నూతన పార్లమెంట్ భవనంలో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడి కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలమనేరు మట్టితో తయారైన వస్తువులు దేశ, విదేశాలకు సైతం చేరుతుండటం విశేషం.
– పలమనేరు(చిత్తూరు జిల్లా)
అందరూ కళాకారులే..
పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు టెర్రకోట కాలనీలో వంద కుటుంబాలున్నాయి. వీరందరూ మట్టితో రకరకాల బొమ్మలు, కళా ఖండాలను తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అందువల్లే వీరు తయారు చేస్తున్న బొమ్మలను టెర్రకోట బొమ్మలు అని కూడా అంటారు. 15 ఏళ్ల కిందటి దాకా ఇక్కడ కుండలు మాత్రమే తయారు చేసేవారు. అయితే పెద్దగా వ్యాపారం జరగకపోవడంతో.. కుండల తయారీతో పాటు ఆకర్షణీయమైన బొమ్మలను తయారు చేయడం మొదలెట్టారు.
ఈ టెర్రకోట బొమ్మలు ఇప్పుడు ఎంత ప్రసిద్ధి చెందాయంటే.. దేశ విదేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది. అంతేకాదు పాత పద్ధతులకు స్వస్తిపలికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి యంత్రాల ద్వారా బొమ్మలను తయారుచేస్తున్నారు. మట్టికుండల తయారీకి వినియోగించే కుమ్మరిసారెకు బదులు ఎలక్ట్రికల్ వీల్ మెషీన్‌ను వాడుతున్నారు. గతంలో బంకమట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేసేవారు.. ఇప్పుడు ప్లగ్‌మిల్ మిక్చర్ అనే యంత్రం వచ్చి వారి పనిని మరింత సులువుగా మార్చింది. గతంలో మట్టి వస్తువులను బట్టీలో కాల్చేవారు.. ఇప్పుడు కరెంట్‌తో కాలే కిలన్ వచ్చింది. వీటితో పాటు ప్లగ్ వీల్, బాల్ వీల్, ఫిల్టర్లు, కట్టర్‌లు ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బొమ్మల తయారీ సాగుతోంది.
ప్రభుత్వ ప్రోత్సాహం
టెర్రకోట కళ అంతరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కళాకారులకు మరింత చేయూతనందించే ఉద్దేశంతో గంటావూరు సమీపంలో రూ.2 కోట్లతో టెర్రకోట హబ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ అండ్ ట్రాన్స్‌ఫర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు సీఎఫ్‌సీ(కామన్ ఫెసిలిటీ సెంటర్) ఉంది. ఏపీఎస్‌డీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), టెర్రకోట హస్తకళాకారుల ఎయిడెడ్ సంస్థ, రీచ్ సంస్థల ఆ«ధ్వర్యంలో ఇక్కడ తరచూ శిక్షణ ఇస్తున్నారు. కోల్‌కతా, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి స్పెషలిస్ట్ ట్రైనర్స్ వచ్చి శిక్షణ ఇస్తుంటారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ తయారవుతున్న డిజైన్‌లకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తయారవుతున్న డిజైన్‌లను జోడించి.. విభిన్న కళాకృతులతో టెర్రకోట కళను అభివృద్ధి చేస్తున్నారు.
ఫొటో ఫ్రేమ్‌లు సైతం మట్టితోనే..
ఇళ్ల ముందు మొక్కలను పెంచే మట్టి కూజాలు, దాబాలపై మొక్కలు పెంచుకునేందుకు వీలుగా వేలాడే మట్టి కూజాల వంటివి తయారు చేస్తున్నారు. ఇక వేసవిలో ఫ్రిజ్‌లుగా ఉపయోగపడే మట్టి కూజాలకు ట్యాప్‌లు అమర్చి మరీ రకరకాల పరిమాణాల్లో విభిన్న రూపాల్లో తయారు చేస్తున్నారు. ఏదేని ఫంక్షన్లలో బహుమతులుగా ఇచ్చేందుకు వందలాది మోడళ్లతో పాటు రాజకీయ నాయకుల ముఖ చిత్రాలనూ రూపొందిస్తున్నారు. ఫొటోఫ్రేమ్‌ల సైతం మట్టితోనే తయారు చేయడం విశేషం.
ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు
వీరు తయారు చేసిన మట్టి బొమ్మలు, వస్తువులు, వివిధ రకాల కళాకృతులతో ఇప్పటికే బెంగళూరుకు చెందిన పలు కంపెనీలు ఆన్‌లైన్‌లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో బుక్ అయిన వెంటనే వాటిని బెంగళూరుకు పంపి అక్కడి నుంచి దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. ఇటీవలే అమెరికాకు చెందిన కొందరు ఇక్కడికి వచ్చి ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.
పార్లమెంట్ భవనానికి ఆర్డర్ రావడం సంతోషం
పలమనేరు మట్టితో తయారైన టెర్రకోట కళాకృతులు భారత పార్లమెంట్‌లో కొలవుదీరనుండటం మాకెంతో సంతోషంగా ఉంది. పలు డిజైన్లను వారు పరిశీలించి కొన్నింటిని ఎంపిక చేశారు. ప్రస్తుతం వాటిని తయారు చేసే పనుల్లో ఉన్నాం. అమెరికా, ఫ్రాన్స్, చైనాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొన్ని ఏజెన్సీల ద్వారా వ్యాపారం చేస్తున్నాం.
– రామకృష్ణ, టెర్రకోట హస్తకళాకారుల సంఘ నేత, పలమనేరు
టెర్రకోట వస్తువుల తయారీపై శిక్షణ తీసుకున్నా..
మాది గంటావూరు గ్రామం. టెర్రకోట బొమ్మలపై నెల రోజుల శిక్షణ తీసుకున్నా. ట్రైనర్స్ బాగా నేర్పారు. ఇప్పుడు అన్ని బొమ్మల చేయడం నేర్చుకున్నా. ఇంటి వద్దే పీస్ వర్క్ చేసుకుంటున్నా. ఇక్కడ శిక్షణ తీసుకుని ఉపాధి పొందడం చాలా ఆనందంగా ఉంది. ఉన్న చోట ఉపాధి దొరికింది. డీఆర్‌డీఏ వాళ్లు టెర్రకోట కళకు జీవం పోస్తూ ఎందరికో పని కల్పిస్తున్నారు.
– సాకమ్మ, గంటావూరు
Comments
Please login to add a commentAdd a comment