Night Curfew In Telangana: Govt Released Curfew Guidelines, Exceptions List - Sakshi
Sakshi News home page

తెలంగాణలో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ

Published Tue, Apr 20 2021 11:42 AM | Last Updated on Tue, Apr 20 2021 3:02 PM

Covid 19 Second Wave Telangana Imposes Night Curfew Till May 1st - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి మే 1 వరకు నైట్‌ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్‌ నిర్వహణకు అనుమతినిచ్చింది.

అదే విధంగా మీడియా, పెట్రోల్ బంక్‌లు, ఐటీ సేవలకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కోల్డ్ స్టోరేజ్‌, వేర్ హౌసింగ్, విద్యుత్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని, స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అదే విధంగా, ప్రయాణాలకు ఎలాంటి ప్రత్యేకమైన పాసుల అవసరం లేదని పేర్కొంది. కరోనా పరిస్థితుల ప్రభావాన్ని అనుసరించి మే 1 తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. 

కర్ఫ్యూ నుంచి మినహాయింపులు:

  • ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, ఫార్మసీలు
  • ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా
  • టెలికమ్యూనికేషన్స్‌, ఇంటర్‌నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్‌, కేబుల్‌ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు
  • ఇ- కామర్స్‌ వస్తువుల డెలివరీకి అనుమతి
  • పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్‌జీ, పెట్రోలియం, గ్యాస్‌ అవుట్‌లెట్లు
  • శక్తి ఉత్పాదన, పంపిణీ
  • కోల్డ్‌ స్టోరేజీ, వేర్‌హౌజింగ్‌
  • నీటి సరఫరా, పారిశుద్ధ్యం
  • ప్రైవేటే సెక్యూరిటీ సర్వీసులు
  • ప్రొడక్షన్‌ యూనిట్లు

కర్ఫ్యూ సమయంలో వీరు మినహా మిగతా పౌరులు బయట తిరగడం నిషేధం.
పైన పేర్కొన్న సంస్థల్లో పనిచేసేవారు(ఐడీ కార్డు తప్పక చూపించాలి)
కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాధికారులు ఐడీ కార్డు చూపించి ప్రయాణాలు చేయవచ్చు
డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్‌, ఇతర ఆస్పత్రి సిబ్బందికి అనుమతి
గర్భిణులు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైనవారు
ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండు నుంచి రాకపోకలు సాగించేవాళ్లు టికెట్‌ చూపించాలి.

గమనిక: నైట్‌ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌ 51-60, ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. 

రాష్ట్రంలో కొత్తగా 5926 కేసులు
తెలంగాణలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,926 కేసులు వెలుగుచూడగా, 18 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కు చేరగా, మరణాల సంఖ్య 1,856కు చేరుకుంది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గతకొన్ని రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే సర్కారుకు ఏమీ పట్టడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికై లాక్‌డౌన్‌ లేదా రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపై 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే తామే ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కారు మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 

చదవండి: లాక్‌డౌన్‌పై 48 గంటల్లో చెప్పండి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement