సనత్‌నగర్, న్యూస్‌లైన్ : సిటీలో మరో నాలుగు ఫ్లైఓవర్లు రానున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కారిడార్‌లోని కీలక జంక్షన్లలో నిర్మించే వీటికి ఆర్థికసాయం హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్‌ఎంఆర్) సంస్థ చేస్తుండగా... నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) చేపడుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా అంచనాలు, నివేదికలు తయారు చేసేందుకు సంస్థను ఎంపిక చేయడానికి ఆర్ అండ్ బీ సీల్డ్ టెండర్లను ఆహ్వానించింది. వీటి దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది.
నగరంలో ఉన్న ప్రధాన, కీలక జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ, జామ్స్‌ను తగ్గించేందుకు సమాయత్తమైన హెచ్‌ఎంఆర్ అధికారులు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, నివేదికలు పక్కాగా రూపొందించేందుకు సమర్థమంతమైన సంస్థ కోసం అన్వేషణ ప్రారంభించారు. దీనికోసం సీల్డ్ బిడ్స్ ఆహ్వానిస్తూ ఆర్ అండ్ బీ రూరల్ సర్కిల్ ఇటీవలే టెండర్ నోటీసు జారీ చేసింది.
పనుల తీరిదీ...
సంస్థల నుంచి సేకరించిన బిడ్స్ పరిశీలన అనంతరం ఆమోదం పొందిన వాటికి ఈపీసీ ద్వారా పనులు అప్పగించాలి.
ముందుగా ఆయా ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారనే దానిపై ఆయా కన్‌స్ట్రక్షన్ సంస్థల నుంచి టెక్నికల్ బిడ్, ఎంత వ్యయంలో పూర్తి చేస్తారనే అంశంపై ఫైనాన్షియల్ బిడ్‌లను ఆహ్వానిస్తారు.
ఇదే క్రమంలో ఆయా సంస్థలకున్న అనుభవం, గతంలో అవి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలకూ ప్రాధాన్యం ఇస్తూ పరిగణన లోనికి తీసుకుంటారు.
ఆయా నిర్మాణ సంస్థల నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణానికి తయారు చేసిన మూడు నాలుగు రకాల ప్లాన్‌లను పరిశీలించి ఉత్తమమైనది ఎంపిక చేస్తారు.
ఈ డిజైన్‌తో పాటు ఇతర అంశాలనూ ఆర్ అండ్ బీ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ ఆమోదం కోసం పంపిస్తారు. ఇదంతా టెక్నికల్ బిడ్‌లో ఉంటుంది.
ఈ టెక్నికల్ బిడ్‌కు ఆమోదముద్ర పడిన తరవాత ఆర్థికపరమైన అంశాలతో కూడిన ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరుస్తారు.
ఎవరైతే తక్కువ ఖర్చు కోట్ చేసినవారికి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాజెక్టును అప్పగిస్తారు.
సోమవారం ప్రారంభమైన బిడ్స్ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగించి, అదే రోజు టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేస్తారు.
దరఖాస్తు ఫారాలు బల్కంపేట్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో లేదా (aproads.cgg.gov.in) వెబ్‌సైట్ నుంచి తీసుకోవచ్చు.
వీటిని పూర్తి చేసి బల్కంపేట్‌లోని కార్యాలయంలో సమర్పించాలి.
మరో 4 ఫ్లై ఓవర్లు
Published Tue, Feb 11 2014 6:14 AM | Last Updated on Tue, Oct 2 2018 8:13 PM
Advertisement
Advertisement