సాక్షి, అమరావతి: విశాఖపట్నం మెట్రోరైల్ నిర్మాణం మొదటి దశ పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. రూ.14,309 కోట్లతో 4 కారిడార్లలో 76.90 కి.మీ మేర రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా రూ.11,498 కోట్లతో 46.23 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు.
పీపీపీ విధానంలో చేపట్టే ఈ పనులకు ఆమోదం తెలుపుతూ సోమవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కె. కన్నబాబు ఉత్తర్వులిచ్చారు. ఇందులో స్టీల్‌ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు 34.40 కి.మీ., గాజువాక నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.05 కి.మీ., తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ. మేర మూడు కారిడార్లలో పనులు చేపట్టనున్నారు.
ఫేజ్–2 కింద కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కి.మీ పనులు చేపడతారు. ఈ ప్రాజెక్టును కేంద్రం 40 శాతం, ప్రైవేటు డెవలపర్స్ 60 శాతం వాటా భరిస్తాయి.
విజయవాడ లైట్ మెట్రో రైలు డీపీఆర్‌కు కూడా..
విజయవాడ కేంద్రంగా అమరావతి, గన్నవరం తదితర ప్రాంతాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌కు కూడా ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఫేజ్–1లో 1ఏ, 1బీ కారిడార్ల కింద 38.30 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో రూ.11,009 కోట్లతో నిర్మాణ పనులు, మరో రూ.1,152 కోట్లతో భూసేకరణ చేపట్టనున్నారు.
ఫేజ్–2లో 27.75 కి.మీ మేర నిర్మాణం చేపడతారు. కారిడార్ 1ఏ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, 1బీ కారిడార్ పనులు పీఎన్‌బీఎస్ నుంచి పెనమలూరు వరకు, కారిడార్–3 పనులు పీఎన్‌బీఎస్ నుంచి అమరావతి (రిజర్వాయర్ స్టేషన్) వరకు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment