సాక్షి, హైదరాబాద్: భవన అనుమతులు, టౌన్‌ప్లానింగ్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, వందల కోట్లు అక్రమంగా కూడబెట్టిన తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కింది. హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మాజీ డైరెక్టర్, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ ఆర్‌ఎంఎల్) డైరెక్టర్‌గా ఉన్న శివబాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం విస్తృతంగా సోదాలు చేపట్టారు.
ఆయన తన పదవిని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. బుధవారం సా యంత్రం వరకు స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువే బహిరంగ మార్కెట్లో రూ.వంద కోట్లకుపైగానే ఉంటుందని చెప్తున్నారు.
ఇంకా నిర్ధారించి, విలువ తేల్చాల్సిన ఆస్తులు భారీగానే ఉన్నాయని అంటున్నారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
17 చోట్ల ఏకకాలంలో సోదాలు
శివ బాలకృష్ణ హెచ్‌ఎండీఏలో భూమార్పిడి వినియోగం, హైరైజ్ భవనాలకు అనుమతులు, కీలకమైన పట్టణ ప్రణాళిక (టౌన్‌ప్లానింగ్)కు సంబంధించిన పోస్టుల్లో పనిచేశారు. ఈ క్రమంలో ఆయన ఉన్నతాధికారుల అండదండలతో కీలక పోస్టుల్లో ఏళ్లతరబడి పాతుకుపోయి భారీగా అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారన్న సమాచారం మేరకు ఏసీబీ దాడులకు దిగింది.
అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని పుప్పాలగూడలో ఉన్న శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లు కలసి మొత్తం 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇంట్లో అయితే ఏకంగా 20 మంది అధికారులు అన్ని మూలలా జల్లెడపట్టినట్టు తెలిసింది. ఈ సందర్భంగా భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు. పెద్ద సంఖ్యలో ప్లాట్లు, ఫ్లాట్లు, బినామీల పేరిట పెట్టిన ఇతర స్థిరాస్తుల డాక్యుమెంట్లు, రూ.40 లక్షల నగదు, భారీగా బంగారు, వజ్రాభరణాలు, వెండి, పదిహేను వరకు ఐఫోన్‌లు, పదుల సంఖ్యలో వాచ్‌లను స్వాదీనం చేసుకున్నట్టు తెలిసింది.
ఆయనకు పెద్ద సంఖ్యలో బ్యాంకు లాకర్లు ఉన్నట్టు సమాచారం. వాటిని తెరిస్తే మరింత భారీగా ఆస్తుల బయటపడవచ్చని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. గురువారం కూడా సోదాలు జరిపే అవకాశం ఉందని, తనిఖీలు పూర్తయ్యే సరికి ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ రూ.500 కోట్ల వరకు తేలవచ్చని అంటున్నారు.
సహకరించని కుటుంబ సభ్యులు, బంధువులు
ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సమయంలో శివ బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఏమా త్రం సహకరించలేదని అధికారులు అంటున్నారు. బినామీ ఆస్తుల పత్రాలకు సంబంధించి ప్రశ్నిస్తే శివ బాలకృష్ణ సమాధానం ఇవ్వనట్టు తెలిసింది. ఆయన కారును కూడా అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు.
శివబాలకృష్ణ పెద్ద ఎత్తున పెండింగ్ ఫైల్స్‌ను పురపాలక శాఖ ఉన్నతాధికారి అండదండలతో క్లియర్ చేశారని.. పలు నిర్మాణ సంస్థల యజమానుల నుంచి భారీగా సొమ్ము తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. శివ బాలకృష్ణ వ్యవహారశైలితో నష్టపోయిన కొందరు బిల్డర్లు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆయనపై ఏసీబీ దాడి నేపథ్యంలో కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది.
బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది
ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఫిర్యాదులు అందడంతో శివబాలకృష్ణపై దాడులు చేపట్టినట్టు ఏసీ బీ జాయింట్ డైరెక్టర్ సు«దీంద్ర బుధవారం సాయంత్రం వెల్లడించారు. ‘‘బాలకృష్ణ 2018–2023 మధ్య హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా కొనసాగారు. మొత్తం 17 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాం. భారీ ఎత్తున అతి విలువైన భూముల పత్రాలు దొరికాయి. అవన్నీ బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటిని పరిశీలిస్తున్నాం.
బాలకృష్ణ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నాం. బుధవారం అర్ధరాత్రి వరకు, అవసరమైతే గురువారం కూడా సోదాలు కొనసాగిస్తాం. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది..’’అని ఏసీబీ డీజీ తెలిపారు. శివ బాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, గురువారం ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెడతామని తెలిపారు.
ఓ సీనియర్ ఐఏఎస్ భాగస్వామ్యంపై ఆరా!
శివబాలకృష్ణ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహితంగా మెలిగారని, ఆయన కనుసన్నల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సదరు ఐఏఎస్ అధికారికి ఈ అవినీతిలో భాగస్వామ్యంపైనా ఆరా తీస్తున్నట్టు చెప్తున్నారు. పురపాలక శాఖలోని అధికారులు సైతం.. సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి లక్ష్యంగా దాడులు జరిగాయని చర్చించుకుంటున్నారు.
శివబాలకృష్ణ భారీగా ముడుపులు తీసుకోవడమేకాక, కొందరి నుంచి ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్టుగా ఏసీబీ అధికారులకు కచ్చితమైన సమాచారం లభించిందని.. ఈ క్రమంలోనే దాడులు జరిగాయని అంటున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను కొత్త సర్కారు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమించాక ఈ కేసుపై ఫోకస్ పెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment