ఎస్కేయూ : సమాజానికి , విద్యాలయానికి విద్యార్థి వారధిగా సిలబస్ ఉండాలని ఎస్కేయూ వీసీ కె.రాజగోపాల్ అన్నారు. ఎస్కేయూలో గురువారం డిగ్రీ కోర్సుల సిలబస్ రూపకల్పనపై బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశమైంది. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులు చేశారు. వీసీ మాట్లాడుతూ సమాజంపై అవగాహన కల్పించే విధంగా సామాజిక ప్రాజెక్టుల్లో విద్యార్థులు పాల్గొనేలా కర్రికులమ్‌ను రూపొందించాలన్నారు. విద్యార్థులు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించే విధంగా సిలబస్, విద్యాబోధన ఉండాలన్నారు. సీడీసీ డీన్ వేణుగోపాల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రెక్టార్ హెచ్.లజిపతిరాయ్, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ జే.శ్రీరాములు, ఫైనాన్స్ ఆఫీసర్ ఎంఏ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.