vc rajagopal
-
ఎస్కేయూను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం
ఎస్కేయూ(అనంతపురం): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలుపుదామని వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ అన్నారు. 71 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఎస్కేయూ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం వీసీ మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనను అంతమొందించడానికి మహనీయులు చేసిన కృషిని మరువలేనిదన్నారు. దేశంలోని స్టేట్ వర్సిటీలలో కేవలం ఒక్క ఎస్కేయూకు మాత్రమే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ దక్కిందన్నారు. విద్యార్థుల సంక్షేమమే అంతిమధ్యేయంగా కృషి చేస్తామన్నారు. క్యాంపస్ స్కూలు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలి
జేఎన్టీయూ: దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలని జేఎన్టీయూ అనంతపురం ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ అన్నారు. జేఎన్టీయూ అనంతపురంలో 71వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన అనంతరం ఇన్ఛార్జ్ వీసీ ప్రసంగించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల ఆదర్శాలను తీసుకొని దేశం, సమాజం అభ్యున్నతికి పాటుపడాలన్నారు. వర్సిటీ పరిధిలోని బోధన పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, డైరెక్టర్లు ప్రొఫెసర్ విజయ్‌కుమార్, ప్రొఫెసర్ ఆనందరావు, ప్రొఫెసర్ కే.రామానాయుడు, ప్రొఫెసర్ ప్రశాంతి, ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్కేయూకు అటల్ ఇంక్యుబేషన్
ఐదేళ్లలో రూ.10 కోట్లు మంజూరు చేయనున్న నీతి అయోగ్ – విశ్వ ప్రమాణాలతో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం –ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి లభించినట్లు వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ వెల్లడించారు. వర్సిటీలోని పాలకభవనంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్య, పరిశోధనలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకొన్న వర్సిటీ అరుదైన ఖ్యాతి సొంతం చేసుకుందన్నారు. జాతీయ స్థాయిలో 13 అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలకు అనుమతి లభించిదన్నారు. ఇందులో ఎస్కేయూ ఒకటి కావడం గర్వకారణమన్నారు. సెంట్రల్, స్టేట్ వర్సిటీ, ఐఐటీ, ఐఐఎం సంస్థలు పోటీ పడ్డప్పటికీ, ఒక్క ఎస్కేయూకే అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం దక్కిందన్నారు. ఈ కేంద్రానికి వచ్చే ఐదేళ్లలో రూ.10 కోట్ల నిధులను నీతి అయోగ్ అందిస్తుందన్నారు. భావితరాలకు విలువైన మేథోసంపత్తి జాతీయ స్థాయిలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, గ్రాడ్యుయేట్లు , పోస్టు గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఇంక్యుబేషన్ సెంటర్లో తమ ఆవిష్కరణలకు భాగస్వామ్యం అందిస్తుందని వీసీ పేర్కొన్నారు. సృజనాత్మకమైన నూతన ఆవిష్కరణలు.. ఉత్పత్తి దిశగా చేయాలనుకునేవారికి ఇంక్యుబేషన్ సెంటర్ దోహదం చేస్తుందన్నారు. విశ్వ ప్రమాణాలతో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. అటల్ ఇంక్యుబేషన్లో నమోదైన ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా పరిశ్రమలకు రాయితీలు లభిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఏర్పడిన ఇంక్యుబేషన్ కేంద్రంతో ఎస్కేయూకు జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేశామన్నారు. ఎస్కేయూ అగ్రగామిగా నిలపడానికి సమష్టి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. ఇంక్యుబేషన్ మంజూరుకు సహకరించిన పాలకమండలి సభ్యుడు మనోహర్‌రెడ్డి, వర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగభూషణ రాజు, ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
సమాజానికి ఉపయోగపడేలా సిలబస్
ఎస్కేయూ : సమాజానికి , విద్యాలయానికి విద్యార్థి వారధిగా సిలబస్ ఉండాలని ఎస్కేయూ వీసీ కె.రాజగోపాల్ అన్నారు. ఎస్కేయూలో గురువారం డిగ్రీ కోర్సుల సిలబస్ రూపకల్పనపై బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశమైంది. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులు చేశారు. వీసీ మాట్లాడుతూ సమాజంపై అవగాహన కల్పించే విధంగా సామాజిక ప్రాజెక్టుల్లో విద్యార్థులు పాల్గొనేలా కర్రికులమ్‌ను రూపొందించాలన్నారు. విద్యార్థులు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించే విధంగా సిలబస్, విద్యాబోధన ఉండాలన్నారు. సీడీసీ డీన్ వేణుగోపాల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రెక్టార్ హెచ్.లజిపతిరాయ్, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ జే.శ్రీరాములు, ఫైనాన్స్ ఆఫీసర్ ఎంఏ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్డీ ప్రవేశ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇన్చార్జ్ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ గురువారం విడుదల చేశారు. 3,049 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,493 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు 1:2 నిష్పత్తిలో ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ .కృష్ణయ్య, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఆచార్య డి.రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్కేయూ వీసీకి గౌరవ ఫెలోషిప్
ఎస్కేయూ : లూథియాన (పంజాబ్)లో శుక్రవారం ప్రారంభమైన ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్టీఈ) 46వ జాతీయ సదస్సులో ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌కు గౌరవ ఫెలోషిప్ అందజేశారు. ఇంజినీరింగ్ విద్యలో ఆయన చేసిన విశిష్టమైన సేవలకు గాను ఐఎస్టీఈ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎస్కేయూకు సౌర వెలుగులు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవి ద్యాలయంలో సౌర విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నట్లు వీసీ ఆచార్య కె.రాజగోపాల్ అన్నారు. స్వాత్రంత్య వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఎస్కేయూ స్టేడియంలో జాతీ య జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీలో ఒక మెగా వాట్ సౌర విద్యుదుత్పత్తి చేయనున్నామన్నారు. సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులార్ బయాలజీ పరిశోధన సంస్థ వారు వర్సిటీలో అదనపు పరిశోధన సంస్ధను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. 23న జెండా పండుగ: ఈ నెల 23న ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులతో జెండా పండుగ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య జి. శ్రీ« దర్,ఆచార్య సీఎన్ కృష్ణానాయక్, ఆచార్య బి.పణీశ్వర రాజు , డాక్టర్ బి. జెస్సీ పాల్గొన్నారు. -
ఎస్కేయూ వీసీగా రాజగోపాల్
హైదరాబాద్: అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ కె.రాజగోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంబంధిత ఫైలుపై సంతకం చేయడంతో ఎట్టకేలకు రాజగోపాల్ నియామకం ఖరారైంది. గతకొన్ని నెలలుగా కృష్ణదేవరాయ వర్సిటీ వీసీ నియామక వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రాజగోపాల్‌ను వీసీగా ఎంపికచేస్తూ గవర్నర్‌కు ఫైలు పంపగా అక్కడ ఆమోదముద్ర పడలేదు. రాజగోపాల్‌కు సంబందించి కొన్ని సందేహాలను వ్యక్తపరుస్తూ వాటికి వివరణ పంపాలని రాజభవన్వర్గాలు ఫైలును వెనక్కు పంపాయి. ఇలా మూడుసార్లు ఈ ఫైలు రాజభవన్, సీఎంఓల మధ్య తిరిగింది. చివరకు నాలుగోసారి గవర్నర్ రాజగోపాల్ నియామకానికి ఆమోదముద్ర వేయడంతో మంగళవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీఓ 24ను విడుదల చేసింది. అంతకుముందు రాజగోపాల్ హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వహించారు. మరో ఏడు వర్సిటీ వీసీల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ రాష్ట్రంలో మరో ఏడు యూనివర్సిటీల ఉపకులపతుల పోస్టులకు త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయనుంది. ప్రస్తుతం రాజమండ్రిలోని ఆదికవి నన్నయ, మచిలీపట్నంలోని కృష్ణ, గుంటూరులోని ఆచార్య నాగార్జున, కుప్పంలోని ద్రవిడ వర్సిటీ వీసీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు తిరుపతి శ్రీవెంకటేశ్వర, పద్మావతి, అనంతపురం జేఎన్టీయూ వీసీ పోస్టులు సెప్టెంబరులో ఖాళీ కానున్నాయి. ఈ ఏడింటికీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.