ఎస్కేయూకు అటల్ ఇంక్యుబేషన్
ఐదేళ్లలో రూ.10 కోట్లు మంజూరు చేయనున్న నీతి అయోగ్
– విశ్వ ప్రమాణాలతో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం
–ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి లభించినట్లు వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ వెల్లడించారు. వర్సిటీలోని పాలకభవనంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్య, పరిశోధనలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకొన్న వర్సిటీ అరుదైన ఖ్యాతి సొంతం చేసుకుందన్నారు. జాతీయ స్థాయిలో 13 అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలకు అనుమతి లభించిదన్నారు. ఇందులో ఎస్కేయూ ఒకటి కావడం గర్వకారణమన్నారు. సెంట్రల్, స్టేట్ వర్సిటీ, ఐఐటీ, ఐఐఎం సంస్థలు పోటీ పడ్డప్పటికీ, ఒక్క ఎస్కేయూకే అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం దక్కిందన్నారు. ఈ కేంద్రానికి వచ్చే ఐదేళ్లలో రూ.10 కోట్ల నిధులను నీతి అయోగ్ అందిస్తుందన్నారు.
భావితరాలకు విలువైన మేథోసంపత్తి
జాతీయ స్థాయిలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, గ్రాడ్యుయేట్లు , పోస్టు గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఇంక్యుబేషన్ సెంటర్‌లో తమ ఆవిష్కరణలకు భాగస్వామ్యం అందిస్తుందని వీసీ పేర్కొన్నారు. సృజనాత్మకమైన నూతన ఆవిష్కరణలు.. ఉత్పత్తి దిశగా చేయాలనుకునేవారికి ఇంక్యుబేషన్ సెంటర్ దోహదం చేస్తుందన్నారు. విశ్వ ప్రమాణాలతో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు.
అటల్ ఇంక్యుబేషన్‌లో నమోదైన ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా పరిశ్రమలకు రాయితీలు లభిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఏర్పడిన ఇంక్యుబేషన్ కేంద్రంతో ఎస్కేయూకు జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేశామన్నారు. ఎస్కేయూ అగ్రగామిగా నిలపడానికి సమష్టి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. ఇంక్యుబేషన్ మంజూరుకు సహకరించిన పాలకమండలి సభ్యుడు మనోహర్‌రెడ్డి, వర్సిటీ స్కిల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగభూషణ రాజు, ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.