హైదరాబాద్: అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ కె.రాజగోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంబంధిత ఫైలుపై సంతకం చేయడంతో ఎట్టకేలకు రాజగోపాల్ నియామకం ఖరారైంది. గతకొన్ని నెలలుగా కృష్ణదేవరాయ వర్సిటీ వీసీ నియామక వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రాజగోపాల్‌ను వీసీగా ఎంపికచేస్తూ గవర్నర్‌కు ఫైలు పంపగా అక్కడ ఆమోదముద్ర పడలేదు. రాజగోపాల్‌కు సంబందించి కొన్ని సందేహాలను వ్యక్తపరుస్తూ వాటికి వివరణ పంపాలని రాజభవన్‌వర్గాలు ఫైలును వెనక్కు పంపాయి.
ఇలా మూడుసార్లు ఈ ఫైలు రాజభవన్, సీఎంఓల మధ్య తిరిగింది. చివరకు నాలుగోసారి గవర్నర్ రాజగోపాల్ నియామకానికి ఆమోదముద్ర వేయడంతో మంగళవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీఓ 24ను విడుదల చేసింది. అంతకుముందు రాజగోపాల్ హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వహించారు.
మరో ఏడు వర్సిటీ వీసీల నియామకానికి త్వరలో నోటిఫికేషన్
రాష్ట్రంలో మరో ఏడు యూనివర్సిటీల ఉపకులపతుల పోస్టులకు త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయనుంది. ప్రస్తుతం రాజమండ్రిలోని ఆదికవి నన్నయ, మచిలీపట్నంలోని కృష్ణ, గుంటూరులోని ఆచార్య నాగార్జున, కుప్పంలోని ద్రవిడ వర్సిటీ వీసీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు తిరుపతి శ్రీవెంకటేశ్వర, పద్మావతి, అనంతపురం జేఎన్‌టీయూ వీసీ పోస్టులు సెప్టెంబరులో ఖాళీ కానున్నాయి. ఈ ఏడింటికీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.