అట్టుడికిన అనంత
- వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతల సస్పెన్షన్
- దీనికి నిరసనగా ధర్నా.. నాయకుల అరెస్ట్
- ఇటుకలపల్లి స్టేషన్ ఎదుట వైఎస్సార్‌సీపీ నిరసన
ఎస్కేయూ:
విద్యార్థి నాయకులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని సోమవారం చేపట్టిన ఆందోళనతో ఎస్కేయూనివర్సిటీ అట్టుడికిపోయింది. ప్రత్యేక హోదా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, వర్సిటీ నేత వై.భానుప్రకాష్‌రెడ్డి, పరిశోధక విద్యార్థి జి. జయచంద్రారెడ్డిలను సస్పెండ్ చేస్తూ క్యాంపస్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీఎన్ కృష్ణానాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి నిరసనగా వర్సిటీ పాలక భవనం ముందు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థి నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎందుకు బనాయించారో తెలపాలన్నారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ వైఎస్సా ర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, కార్యదర్శి నరసింహా రెడ్డి, భానుప్రకాష్, జయచంద్ర, సునీల్, చిరంజీవిలను ఇటుకలపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది.
పోలీస్ స్టేషన్ వద్ద నిరసన
వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటుకలపల్లి పోలీస్‌స్టేçÙన్ వద్ద ఆందోళన చేపట్టారు. అక్రమ కేసులు, సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యోగీశ్వరరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మారుతీ నాయుడు, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పి.శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ మోహన్, సుధీర్ రెడ్డి, లోకేష్ షెట్టి, పాలే జయరాం నాయక్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల తిరుగుబాటు : మరో వైపు ఉద్యోగులు తమకు జారీ చేసిన మెమోలపై వివరణ ఇచ్చేది లేదని భీష్మించారు. వివరణ ఇవ్వడానికి సోమవారం తుది గడువు కావడంతో ఏ తప్పూ చేయని తాము ఎందుకు వివరణ ఇవ్వాలనే సమష్టి నిర్ణయానికి ఉద్యోగులు వచ్చారు. ఎస్కేయూ బోధనేతర సంఘం నాయకులు ఉన్నతాధికారులను సంప్రదించి.. మెమోలు ఎందుకు జారీ చేశారని, బంద్‌లో ఉద్యోగుల ప్రమేయం ఏముందని ప్రశ్నించారు. ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి హామీ దక్కలేదు. దీంతో సోమవారం సాయంత్రం బోధనేతర సంఘం కార్యాలయంలో అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా, సస్పెన్షన్ విధించినట్లుగా విద్యార్థులకు నోటీసులు అందచేయాలని ప్రిన్సిపల్ ఆచార్య సీఎన్ కృష్ణానాయక్ ఆయా విభాగాధిపతులను కోరారు.