
అయోమయంలో ‘దూర’ విద్యార్థులు
- అందని ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు
- అధికారుల మధ్య సమన్వయలోపం
ఎస్కేయూ : ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ జారీ విషయంలో సందిగ్ధం నెలకొనడంతో డిగ్రీ పూర్తి చేసి పీజీల్లో ప్రవేశించాలనుకొనే వర్సిటీ దూరవిద్య విభాగం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుళకు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. అయితే ముఖ్యమైన టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ ) జారీ అంశంలో స్పష్టతలేదు.
సమన్వయ లోపం..
డిగ్రీ , పీజీ (రెగ్యులర్), డిగ్రీ , పీజీ (దూరవిద్య) విభాగాలు గతంలో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహించేవి. అప్పట్లోనే గందరగోళం ఉంది. కానీ ఈ రెండు విభాగాలకు ఒకే గూటికి చేర్చి ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్‌ను నియమించారు. దూరవిద్య విభాగంలో అడ్మిషన్లకు ఒక డైరెక్టర్, పరీక్షలు నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాలు ప్రకటన అంశాలను ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్‌కు అప్పగించారు. ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం లోపించింది. ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అడిగితే దూరవిద్య డైరెక్టర్ వద్దకు వెళ్లాలని చెబుతున్నారని.. దూరవిద్య విభాగంలో వెళ్లి అడిగితే..పరీక్షలు నిర్వహించేది ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ కాబట్టి అక్కడే అడగాలని బదులుస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
విద్యార్థుల ఇక్కట్లు :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 14వేల మంది విద్యార్థులు డిగ్రీ ఫైనలియర్ ఉత్తీర్ణులయ్యారు. సింహభాగం డిగ్రీ సర్టిఫికెట్లు ఆయా అధ్యయన కేంద్రాలకు పంపారు. అయితే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు పంపకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ వివాదం తేలే వరకు ఎస్కేయూసెట్, ఇతర వర్సిటీలలో పీజీ అడ్మిషన్ పొందే విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్ల అంశంలో వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.