నిరంకుశత్వానికి పరాకాష్ట
- 77 మంది ఉద్యోగులకు మెమోలు జారీ
- వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులపై కక్షసాధింపు
ఎస్కేయూ: వర్సిటీలో అప్రజాస్వామిక విధానాలు అమలవుతున్నాయి. శాంతియుతంగా బంద్ నిర్వహించిన వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులపై చర్యలు చేపట్టారు. బంద్ విషయం తెలియని 77 మంది ఉద్యోగులకు శనివారం ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ మెమోలు జారీ చేశారు. సోమవారం లోపు వివరణ ఇవ్వాలని కోరారు.
ముగ్గురిపై సస్పెన్షన్ –నలుగురిపై కేసు నమోదు
శుక్రవారం వర్సిటీలో బంద్ నిర్వహించారని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహా రెడ్డి, భాను ప్రకాష్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలను సస్పెన్షన్ చేయాలని రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ ప్రిన్సిపాల్ ఆచార్య కష్ణానాయక్‌కు సిఫార్సు చేశారు. వీరితో పాటు విద్యార్థి నాయకుడు బీవీ లింగారెడ్డిపై కేసు నమోదు చేయాలని ఇటుకపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల సస్పెన్షన్ అంశాన్ని సోమవారం పరిశీలిస్తామని క్యాంపస్ కళాశాల ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీఎన్ కష్ణానాయక్ అన్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం వీసీ ఆచార్య కే.రాజగోపాల్ వర్సిటీలో లేనప్పటికీ వీసీ లిఖితపూర్వక ఆదేశాలతో మెమోలు ఇస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ నోటీసులు ఇవ్వడం కొసమెరుపు.
ఏమి జరిగిందంటే..
రెండో పీజీ చదువుతున్నప్పటికీ , వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడికి హాస్టల్ సదుపాయం ఎలా కల్పిస్తారని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు వర్సిటీ ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి మొదటి పీజీ పేమెంట్ సీటు, రెండో పీజీ రెగ్యులర్ పీజీ కావడంతో హాస్టల్ సదుపాయం అర్హతగా ఉన్నప్పటికీ అధికారులు అవేవీ పట్టించుకోకుండా హాస్టల్ నుంచి తొలగించారని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ బదిలీ సర్టిఫికెట్‌తో అడ్మిషన్లు పొందిన టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి నాయకుడిపై కూడా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని శుక్రవారం పాలకభవనంలో బంద్ నిర్వహించారు.
వైఎస్సార్ విద్యార్థి విభాగం అంటే వేటే..
వర్సిటీలో అధికారులు వైఎస్సార్ విద్యార్థి విభాగంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్‌లు నిర్వహించారు. ఎస్కేయూ వీసీ పీఏపై పాశవికంగా దాడి, ఓ వార్డెన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. సీసీ కెమెరాల సాక్షిగా ఇవన్నీ రికార్డు అయ్యాయి. అయినా ఆ విద్యార్థి సంఘం నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులపై మాత్రమే కేసులు నమోదు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.