ఆందోళన చేస్తున్న ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతున్న దర్యాప్తు కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రెడ్డి వెంటకరాజు
ఎస్కేయూ: ఎస్కేయూ డిగ్రీ ఫలితాల తప్పిదాలపై ప్రొఫెసర్ల కమిటీతో సమగ్ర దర్యాప్తును ఆదేశించినట్లు వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ప్రొఫెసర్ల కమిటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా తొలి దశలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. సాప్ట్‌వేర్ కరెప్ట్ కావడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడిందని, త్వరలో ఆటోమోటీవ్ సాప్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కమిటీ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అనంతరం ఎవరికైనా అనుమానాలు ఉంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్‌కు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అనుమతిస్తామన్నారు.
ఉద్యోగుల పెన్‌డౌన్
డిగ్రీ ఫలితాల్లో తప్పిదాలకు బాధ్యుల్ని చేస్తూ ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి.. ఏ తప్పూ చేయని తమపై చర్యలు ఎలా తీసుకుంటా రంటూ సస్పెండ్ అయిన ఉద్యోగులు వాపోయారు. వారికి సంఘీభావంగా పరీక్షల విభాగం ఎదుట ఉద్యోగులందరూ ఆందోళనలకు దిగారు. మొదట కంప్యూటర్లో నమోదు చేసి, ఫలితాలు విడుదల చేసిన తర్వాత ట్యాబులేషన్‌లో మార్కులు నమోదు చేశారని ఉద్యోగులు వివరించారు. ఫలితంగా తప్పిదాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ట్యాబులేషన్‌పై తమ సంతకాలు లేవని పరీక్షల విభాగం ఉద్యోగులు స్పష్టంచేశారు. నిరసన తెలుపుతున్న ఉద్యోగులతో దర్యాప్తు కమిటీ ఛైర్మెన్ ప్రొఫెసర్ రెడ్డి వెంకటరాజు చర్చలు జరిపారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్‌డౌన్‌ని విరమించుకోవాలని సూచించారు. వర్సిటీ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొనడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment