software problem
-
ఎయిరిండియాకు సాఫ్ట్వేర్ షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ‘ఎయిరిండియా’ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వేలాది మంది ప్రయాణికుల సహనాన్ని పరీక్షించింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం వరకు 155 విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో దేశ, విదేశాల్లో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఎయిరిండియా చెక్–ఇన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా ప్రయాణికుల గుర్తింపు, బ్యాగేజి, రిజర్వేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా, దేశ, విదేశాల్లోని ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ జారీ చేయలేకపోయారు. దీంతో ఇందుకు అవసరమైన పాసింజర్ సర్వీస్ సిస్టం(పీఎస్ఎస్) సేవలందించే అమెరికాలోని అట్లాంటాకు చెందిన ‘సిటా’ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ యంత్రాంగం లోపాన్ని సరిదిద్దటానికి దాదాపు ఐదుగంటల సమయం తీసుకుంది. అనంతరం 8.45 గంటలకు ఎయిరిండియా తిరిగి సర్వీసులను పునరుద్ధరించింది. ఈ విషయమై ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) అశ్వనీ లొహానీ మాట్లాడుతూ.. ‘సాఫ్ట్వేర్ సమస్యలో లోపంపై సిటా విచారణ జరుపుతోంది. సాఫ్ట్వేర్ షట్డౌన్కు వైరస్‌నా లేక మరేదైనా కారణమా తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. ‘ఎక్కడ లోపం తలెత్తినా మేం పీఎస్ఎస్ వ్యవస్థను వాడుకుంటాం. కానీ, పీఎస్ఎస్లోనే సమస్య వచ్చింది. అందుకే వేరే మార్గాల్లో ప్రయాణికులకు వెంటనే సమాచారం అందించలేకపోయాం’ అని ఆయన వివరించారు. -
ఎస్కేయూలో ఐదుగురిపై వేటు
ఎస్కేయూ: ఎస్కేయూ డిగ్రీ ఫలితాల తప్పిదాలపై ప్రొఫెసర్ల కమిటీతో సమగ్ర దర్యాప్తును ఆదేశించినట్లు వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ప్రొఫెసర్ల కమిటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా తొలి దశలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. సాప్ట్వేర్ కరెప్ట్ కావడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడిందని, త్వరలో ఆటోమోటీవ్ సాప్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కమిటీ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అనంతరం ఎవరికైనా అనుమానాలు ఉంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్‌కు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అనుమతిస్తామన్నారు. ఉద్యోగుల పెన్‌డౌన్ డిగ్రీ ఫలితాల్లో తప్పిదాలకు బాధ్యుల్ని చేస్తూ ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి.. ఏ తప్పూ చేయని తమపై చర్యలు ఎలా తీసుకుంటా రంటూ సస్పెండ్ అయిన ఉద్యోగులు వాపోయారు. వారికి సంఘీభావంగా పరీక్షల విభాగం ఎదుట ఉద్యోగులందరూ ఆందోళనలకు దిగారు. మొదట కంప్యూటర్లో నమోదు చేసి, ఫలితాలు విడుదల చేసిన తర్వాత ట్యాబులేషన్‌లో మార్కులు నమోదు చేశారని ఉద్యోగులు వివరించారు. ఫలితంగా తప్పిదాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ట్యాబులేషన్‌పై తమ సంతకాలు లేవని పరీక్షల విభాగం ఉద్యోగులు స్పష్టంచేశారు. నిరసన తెలుపుతున్న ఉద్యోగులతో దర్యాప్తు కమిటీ ఛైర్మెన్ ప్రొఫెసర్ రెడ్డి వెంకటరాజు చర్చలు జరిపారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్‌డౌన్‌ని విరమించుకోవాలని సూచించారు. వర్సిటీ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొనడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. -
పరీక్ష రాసినా ఫలితంలేదు!
ఎస్కేయూ :శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విడుదల చేసినా ఫలితంలేకపోతోంది. విద్యార్థులకు తప్పుల తడకన మార్కులు వస్తున్నాయి. కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌తో సమస్య వస్తోంది. ఫలితాలు విడుదలైనప్పుడు పాస్ అయిన విద్యార్థులు ఫెయిల్ అని, ఫెయిల్ అయిన వారు పాస్ అయినట్లు వస్తోంది. గైర్హాజరైన వారు సైతం ఏకంగా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాలుగేళ్లుగా ఇదే తంతు.. ఈ ఏడాది 40 వేల మంది సెమిస్టర్ ఫరీక్షలు రాశారు. ఇందులో అధికశాతం విద్యార్థుల మార్కులు జంబ్లింగ్ అయ్యాయి. ఏటా ఇలానే జరుగుతున్నా సమస్య పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించకుండానే ఫలితాలు విడుదల : డిగ్రీ 5వ సెమిస్టర్లో మార్కుల నమోదులో తప్పిదాలు చోటు చేసుకోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న వర్సిటీ యాజమాన్యం ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని సమగ్ర దర్యాప్తునకు నియమించింది. ప్రొఫెసర్ రెడ్డి వెంకటరాజు కన్వీనర్‌గా ఉన్న కమిటీలో ప్రొఫెసర్ ఏవీ రమణ, ప్రొఫెసర్ చింతా సుధాకర్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. ఫలితాల్లో వ్యత్యాసం : అవార్డు షీట్ (ఎగ్జామినర్ వేసిన మార్కులు) ఆధారంగా చెక్‌లిస్ట్‌లో మార్కులు పొందుపరుస్తారు. చెక్‌లిస్ట్‌లోని మార్కుల ఆధారంగా ట్యాబులేషన్‌లో మార్కులు నమోదవుతాయి. అనంతరం మార్క్స్‌కార్డులు ప్రింట్ అవుతాయి. చెక్‌లిస్ట్‌లో ఉన్న మార్కులకు ట్యాబులేషన్‌లో నమోదైన మార్కులకు వ్యత్యాసం అధికంగా ఉంది. మూడో సబ్జెక్టులో నమోదైన మార్కులు తక్కిన అన్ని సబ్జెక్టులకూ యథాతథంగా పునరావృతమయ్యాయి. ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయితే తక్కిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయినట్లే. ఈ విధంగా మార్కులు నమోదు అయినట్లు కమిటీ నిర్ధారణకు వచ్చింది. వాస్తవానికి ఫలితాలు విడుదలకు ముందు చెక్‌లిస్ట్‌లోని మార్కులు, ట్యాబులేషన్‌లోని మార్కులను పరిశీలించిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలి. కాలం చెల్లిన సాప్ట్వేర్ : 2015లో సెమిస్టర్ విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మార్కుల నమోదు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ కాలం చెల్లింది. అయినా దాన్నే వాడుతున్నారు. గతంలో ఏడాది పరీక్షలు కాబట్టి..తక్కువ డేటాబేస్ సరిపోయేది. ప్రస్తుతం సెమిస్టర్ విధానం కొనసాగుతోంది. అయినా వర్సిటీ సాఫ్ట్వేర్ సామర్థ్యాన్ని పెంచలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటలైజేషన్ విధానంలో పరీక్షల విభాగంలో పూర్తిగా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది. రెండు సార్లు ఫలితాలువిడుదల చేసినా... డిగ్రీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులందరూ ఫలితాలు చూసుకున్నారు. ఫలితాలు తప్పులతడక వచ్చాయని ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం తిరిగి ఫలితాలు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలు పరీక్షలకు గైర్హాజరయిన వారు సైతం ఉత్తీర్ణత చెందినట్లు వచ్చింది. దీంతో సమస్య మొదటికొచ్చింది. కమిటీ అవార్డు షీట్‌లోని ప్రతి విద్యార్థీ మార్కులను పరిశీలిస్తోంది. వారం రోజుల్లో మొత్తం అన్నీ మార్కులను పరిశీలించి.. తుది ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
3 గంటలు డౌన్!
ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ ఆరంభం నుంచే అవాంతరాలు సాఫ్ట్వేర్ సమస్యతో అప్డేట్ కాని స్టాక్ ధరలు ♦ ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను నిలిపేసిన ఎక్స్ఛేంజ్ ♦ పలుమార్లు ప్రయత్నించినా పరిష్కారం కాని సమస్య ♦ వరుసగా మూడు గంటల పాటు సేవలు బంద్ ♦ చివరికి మధ్యాహ్నం 12.30కి ఆరంభమైన ట్రేడింగ్ ♦ మార్కెట్లు ముగిసే వరకూ సమస్యగానే రేట్ల అప్డేట్ ♦ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్సే్ఛంజీని కోరిన సెబీ ♦ తామూ పరిశీలిస్తున్నామన్న ఆర్థిక శాఖ ♦ 12.30 నుంచి సాధారణ కార్యకలాపాలు ♦ బీఎస్ఈలో యథావిధిగా ట్రేడింగ్... పెరిగిన వ్యాపారం సమగ్ర నివేదికకు సెబీ ఆదేశాలు సెబీ సైతం ఎన్ఎస్ఈ నుంచి సమగ్ర నివేదికను కోరింది. వ్యాపార ప్రణాళికలను సమీక్షించుకోవాలని, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు ఎదురు కాకుండా తీసుకోనున్న చర్యల్ని తెలియజేస్తూ వివరాలు అందిం చాలని ఆదేశించింది. ఎక్స్ఛేంజ్లో ఎదురైన సాంకేతిక అవాంతరాలు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించినవేనని, సైబర్ భద్రతకు సంబంధించినవి కావని, సాధారణ పరిస్థితి నెలకొందంటూ ఎన్ఎస్ఈ ప్రాథమికంగా తెలియజేసినప్పటికీ సెబీ పూర్తి స్థాయి నివేదిక కోరడం గమనార్హం. ఎన్ఎస్ఈలో తలెత్తిన పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, భాగస్వాములను సంప్రదించడం ద్వారా ఈ తరహా పరిస్థితుల నివారణకు ఏం చేయాలన్న ది నిర్ణయించనున్నట్టు సెబీ తన ప్రకటనలో పేర్కొంది. ముంబై: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ‘ఎన్ఎస్ఈ’ సోమవారం ఇన్వెస్టర్లను ఆందోళనలో ముంచేసింది. వారాంతంలో రెండు రోజుల విరామం అనంతరం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమైన ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్టాక్స్ ధరలు అప్డేట్ కాకుండా ఆగిపోయాయి. పెట్టిన ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. ఎన్ఎస్ఈలో స్టాక్స్ కొటేషన్లు సరిగ్గా లేవని, ఆర్డర్లను నమోదు చేయలేని పరిస్థితి ఎదురైందంటూ... బ్రోకింగ్ కంపెనీలన్నీ తమ క్లయింట్లకు మెసేజ్‌లు పంపాయి. సమస్యను గుర్తించిన ఎన్ఎస్ఈ... కొంత సేపటి తర్వాత ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్‌ను నిలిపివేసింది. దీంతో ఏమైందోనన్న గందరగోళం బాగా పెరిగిపోయింది. క్యాష్ మార్కెట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్యాష్ విభాగంతోపాటు, ఎఫ్అండ్వోలోనూ ట్రేడింగ్ నిలిపివేసినట్టు ఉదయం 10.30 గంటల సమయంలో ఎన్ఎస్ఈ నుంచి ప్రకటన వెలుడింది. సాంకేతిక విభాగం సమస్యను సరిచేసే పనిలో ఉందని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ తర్వాత తెలియజేస్తామని పేర్కొంది. ఎన్ఎస్ఈ టెక్నికల్ విభాగం పలు దఫాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి మధ్యాహ్నం 12.15 గంటలకు సమస్యను సరిచేయగలిగింది. ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. అంతకుముందు క్యాష్ మార్కెట్ ప్రీ సెషన్ 12.15కు ప్రారంభమై 12.22–12.23కు ముగుస్తుందని, క్యాష్, ఎఫ్‌అండ్‌వోలో సాధారణ ట్రేడింగ్ 12.30కు ప్రారంభం అవుతుందని ఎన్ఎస్ఈ తన వెబ్సైట్లో పేర్కొంది. ఎఫ్‌అండ్‌వోలో 12.15–12.29 వరకు అవుట్‌స్టాండింగ్ ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. డిస్ప్లేకు సంబంధించిన సమస్యను గుర్తించి సరిచేసినట్టు సమస్య పరిష్కారమైన తరవాత ఎన్ఎస్ఈ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ పరిస్థితిపై ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ క్షమాపణలు చెప్పింది. మరో ఎక్సే్ఛంజీ బీఎస్ఈ మాత్రం యథావిధిగానే పనిచేసింది. తాము ఎటువంటి సమస్యలూ ఎదుర్కోలేదని ప్రకటించింది. అయితే, ఈ అవాంతరాలు బీఎస్ఈకి వ్యాపార పరంగా కలిసొచ్చాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీ విభాగంలో బీఎస్ఈని ఆశ్రయించారు. దీంతో క్యాష్ విభాగంలో ట్రేడింగ్ వ్యాల్యూమ్స్ బాగా పెరిగాయి. 1995 నుంచి రోజువారీ సగటు టర్నోవర్ ఎన్ఎస్ఈలోనే అధికంగా జరుగుతూ వస్తోంది. కాగా, రూ.10,000 కోట్ల ఐపీవోకు ఎన్ఎస్ఈ సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితి ఎక్స్ఛేంజ్ను ఇబ్బంది పెట్టేదేనని విశ్లేషకులు చెబుతున్నారు. నివేదిక కోరిన ఆర్థిక శాఖ ఎన్ఎస్ఈలో సోమవారం ఎదురైన సాంకేతిక అవాంతరాలపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది. ఇది సాంకేతిక సమస్యేనని, హ్యాకింగ్‌కు సంబంధించి ఎటువంటి సమచారం లేదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధమైన సమస్య ఏర్పడడం తీవ్ర ఆందోళనకరమని, పరిస్థితిని సెబీ అనుక్షణం పర్యవేక్షిస్తోందని, భవిష్యత్తులో ఈ తరహా సమస్య మరోసారి ఎదురు కాదని ఆశిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఎస్ఎస్ఈ దీనిపై సెబీకి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక సెబీ ద్వారా మాకు కూడా అందుతుంది. ఈ లోపు సెబీ నుంచి మధ్యంతర నివేదిక వస్తుంది’’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఎస్ఈలో నెలకొన్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని సెబీ నుంచి కూడా ప్రకటన జారీ అయింది. మధ్యాహ్నం 12:30 వరకూ ఆందోళన 9.15 : మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సూచీలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. కానీ ఎస్ఎస్ఈలో ఎఫ్ అండ్ ఓ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి తప్ప క్యాష్ మార్కెట్లో అమ్మేవారు ఎంత కోట్ చేస్తున్నారు? కొనేవారు ఎంత కోట్ చేస్తున్నారు అనే వివరాలు అప్డేట్ కాకుండా ఆగిపోయాయి. 9.55 : సమస్యను గుర్తించిన ఎన్ఎస్ఈ... ట్రేడింగ్ నిలిపివేసింది. 10.45 : రెండోసారి మార్కెట్ ప్రారంభానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఎఫ్ అండ్ ఓ, క్యాష్ సెగ్మెంట్లు రెండిట్లోనూ ఆర్డర్లు అప్డేట్ కావటం ఆగిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లలో గందరగోళం పెరిగిపోయింది. 11.15 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమవుతుందని ఎన్ఎస్ఈ చీఫ్ (బిజినెస్) రవి వారణాసి ప్రకటించారు. 11.55 : ట్రేడింగ్ ప్రారంభించటానికి ప్రయత్నాలు చేసినా అప్పుడు కూడా సఫలం కాలేదు. ఇక ఈ రోజుకింతేనేమో అని ఇన్వెస్టర్లు భావించారు. 11.45 : మరోసారి ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ ఒక్క ట్రేడ్ కూడా నమోదు కాలేదు. చివరికి 12.15కు ప్రీ–ట్రేడింగ్ సెషన్ ప్రారంభమవుతుందని, 12.30కి ట్రేడింగ్ మొదలవుతుందని మరోసారి ఎన్ఎస్ఈ ప్రకటించింది. 12.15 : మూడు గంటల ఉత్కంఠకు తెర. ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో సమస్యను సరిచేయగలిగారు. ప్రీ ట్రేడింగ్ సెషన్ ప్రారంభమయింది. 12.30 : ప్రారంభమైన ఎన్ఎస్ఈ ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో. ఎటువంటి అవాంతరాలు ఎదురు కాలేదు. కాకపోతే చివరిదాకా ఒకోసారి అమ్మే–కొనే కోట్స్ డిస్ప్లే కాకపోవటం, ఒకోసారి రిఫ్రెష్ కాకపోవటం వంటి సాంకేతిక సమస్యలు కొనసాగాయని పలువురు ట్రేడర్లు వాపోయారు. 3.30 : మార్కెట్లు ముగిశాయి. ‘‘ప్రారంభంలోనే క్యాష్ మార్కెట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎఫ్‌అండ్‌వో విభాగం సాధారణంగానే ప్రారంభమైంది. అయితే, క్యాష్ విభాగంలో సమస్య కారణంగా ఎఫ్‌అండ్‌వోను సైతం నిలిపివేశాం’’ అని ఎన్ఎస్ఈ నుంచి ప్రకటన వెలువడింది. -
పీఆర్సీకి సాఫ్ట్వేర్ గండం
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ అమలులో ఇంకా అడ్డంకులు తొలగలేదు. రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 30 శాతం మంది ఉద్యోగులు మే నెలలోనూ కొత్త వేతనాలను అందుకునే పరిస్థితి లేదు. వేతన స్థిరీకరణకు ఆర్థిక శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లోపాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ఉద్యోగులకు రావాల్సిన బిల్లులన్నీ తప్పుల తడకలుగా మారిపోతున్నాయి. ఈ గందరగోళంతో డీడీవోలు తమ పరిధిలోని ఉద్యోగుల బిల్లులు రూపొందించేందుకు సంకోచిస్తున్నారు. ఒకవేళ డీడీవోలు ఆమోదించినా ట్రెజరీ కార్యాలయాల్లోనే బిల్లులన్నీ తిరస్కరణకు గురవుతున్నాయి. పీఆర్సీ వేతనాల సవరణకు ఖజానా విభాగం తన వెబ్సైట్లో సాఫ్ట్వేర్ లింక్‌ను ఉంచింది. ఉద్యోగులందరూ ఈ లింక్ ద్వారా ఆన్లైన్లో తమ వేతన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పీఆర్సీ బిల్లులను ఆన్లైన్ విధానంలో చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ విధానంతో అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు వేగంగా బిల్లుల జారీకి వీలుంటుందని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. కానీ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించకపోవడంతో బిల్లుల తయారీ గందరగోళంగా మారింది. 2014 ఆగస్టు నుంచి రాష్ట్రంలోని ఉద్యోగులందరూ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ పొందుతున్నారు. కానీ మార్చి 2015 నుంచి ఈ ఇంక్రిమెంట్ ఇచ్చినట్లుగా సాఫ్ట్వేర్ చూపిస్తోంది. దీనివల్ల ఆర్థికంగా వ్యత్యాసం తలెత్తే ఇబ్బంది లేకున్నా ఈ అంశంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు బయటపడ్డాయి. ప్రధానంగా 2013 జూలై తర్వాత స్టెప్ అప్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతనాలను స్థిరీకరించలేకపోతున్నారు. స్టెప్ అప్ ద్వారా వచ్చిన అదనపు ఇంక్రిమెంట్లను ఈ సాఫ్ట్వేర్ అంగీకరించడం లేదు. అలాగే 2013 జూలై తర్వాత జీతం నష్టపోయే(ఎల్వోపీ) సెలవులు పెట్టి.. పాత పే స్కేళ్లలో వార్షిక ఇంక్రిమెంట్‌ను కోల్పోయిన ఉద్యోగులకూ తాజా పీఆర్సీలో సర్దుబాటు కావడంలేదు. ఆ సెలవులను సాఫ్ట్వేర్ పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఉద్యోగులు వాటికి సైతం అదనంగా బిల్లులు పొందే పరిస్థితి తలెత్తింది. ఇక 12 ఏళ్ల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ ప్రమోషన్‌తో పలు ఇంక్రిమెంట్లు పొందిన వారికి ఒక టే ఇంక్రిమెంట్ పొందినట్లు సాఫ్ట్వేర్ తప్పుగా చూపిస్తోంది. 2004 సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఉద్యోగుల మూల వేతనంలో 10%, కరువు భ త్యం నుంచి 10% మొత్తాన్ని ప్రతి నెలా మినహాయించాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెల్లించాల్సిన మొత్తాన్ని తప్పుగా చూపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలన్నీ సర్కారు ఖజానాకు టోపీ పెట్టేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అంగ వైకల్యమున్న ఉద్యోగులకు ఇచ్చే పీహెచ్ భత్యానికి సంబంధించిన పీఆర్సీ ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. దీంతో పీహెచ్ ఉద్యోగుల బిల్లులు కూడా ముందుకు సాగడంలేదు. ఈ నెలలో బిల్లులు సమర్పించే గడువు బుధవారంతో ముగియనుంది. వచ్చే నెల 3 నుంచి పీఆర్సీ బిల్లులను మళ్లీ స్వీకరిస్తారు. ఈలోగా సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దకపోతే ఈ ప్రక్రియ ముందుకుసాగేలా లేదని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.