పీఆర్‌సీకి సాఫ్ట్‌వేర్ గండం
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్‌సీ అమలులో ఇంకా అడ్డంకులు తొలగలేదు. రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 30 శాతం మంది ఉద్యోగులు మే నెలలోనూ కొత్త వేతనాలను అందుకునే పరిస్థితి లేదు. వేతన స్థిరీకరణకు ఆర్థిక శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లోపాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ఉద్యోగులకు రావాల్సిన బిల్లులన్నీ తప్పుల తడకలుగా మారిపోతున్నాయి. ఈ గందరగోళంతో డీడీవోలు తమ పరిధిలోని ఉద్యోగుల బిల్లులు రూపొందించేందుకు సంకోచిస్తున్నారు. ఒకవేళ డీడీవోలు ఆమోదించినా ట్రెజరీ కార్యాలయాల్లోనే బిల్లులన్నీ తిరస్కరణకు గురవుతున్నాయి.
పీఆర్‌సీ వేతనాల సవరణకు ఖజానా విభాగం తన వెబ్‌సైట్‌లో సాఫ్ట్‌వేర్ లింక్‌ను ఉంచింది. ఉద్యోగులందరూ ఈ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వేతన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పీఆర్‌సీ బిల్లులను ఆన్‌లైన్ విధానంలో చేపట్టడం ఇదే మొదటిసారి.
ఈ విధానంతో అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు వేగంగా బిల్లుల జారీకి వీలుంటుందని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. కానీ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించకపోవడంతో బిల్లుల తయారీ గందరగోళంగా మారింది. 2014 ఆగస్టు నుంచి రాష్ట్రంలోని ఉద్యోగులందరూ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ పొందుతున్నారు. కానీ మార్చి 2015 నుంచి ఈ ఇంక్రిమెంట్ ఇచ్చినట్లుగా సాఫ్ట్‌వేర్ చూపిస్తోంది. దీనివల్ల ఆర్థికంగా వ్యత్యాసం తలెత్తే ఇబ్బంది లేకున్నా ఈ అంశంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు బయటపడ్డాయి. ప్రధానంగా 2013 జూలై తర్వాత స్టెప్ అప్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతనాలను స్థిరీకరించలేకపోతున్నారు. స్టెప్ అప్ ద్వారా వచ్చిన అదనపు ఇంక్రిమెంట్లను ఈ సాఫ్ట్‌వేర్ అంగీకరించడం లేదు. అలాగే 2013 జూలై తర్వాత జీతం నష్టపోయే(ఎల్‌వోపీ) సెలవులు పెట్టి.. పాత పే స్కేళ్లలో వార్షిక ఇంక్రిమెంట్‌ను కోల్పోయిన ఉద్యోగులకూ తాజా పీఆర్‌సీలో సర్దుబాటు కావడంలేదు. ఆ సెలవులను సాఫ్ట్‌వేర్ పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఉద్యోగులు వాటికి సైతం అదనంగా బిల్లులు పొందే పరిస్థితి తలెత్తింది. ఇక 12 ఏళ్ల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ ప్రమోషన్‌తో పలు ఇంక్రిమెంట్లు పొందిన వారికి ఒక టే ఇంక్రిమెంట్ పొందినట్లు సాఫ్ట్‌వేర్ తప్పుగా చూపిస్తోంది. 2004 సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఉద్యోగుల మూల వేతనంలో 10%, కరువు భ త్యం నుంచి 10% మొత్తాన్ని ప్రతి నెలా మినహాయించాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చెల్లించాల్సిన మొత్తాన్ని తప్పుగా చూపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలన్నీ సర్కారు ఖజానాకు టోపీ పెట్టేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అంగ వైకల్యమున్న ఉద్యోగులకు ఇచ్చే పీహెచ్ భత్యానికి సంబంధించిన పీఆర్‌సీ ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. దీంతో పీహెచ్ ఉద్యోగుల బిల్లులు కూడా ముందుకు సాగడంలేదు. ఈ నెలలో బిల్లులు సమర్పించే గడువు బుధవారంతో ముగియనుంది. వచ్చే నెల 3 నుంచి పీఆర్‌సీ బిల్లులను మళ్లీ స్వీకరిస్తారు. ఈలోగా సాఫ్ట్‌వేర్ లోపాలను సరిదిద్దకపోతే ఈ ప్రక్రియ ముందుకుసాగేలా లేదని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.