3 గంటలు డౌన్‌! | SEBI seeks detailed report from NSE on software snag | Sakshi
Sakshi News home page

3 గంటలు డౌన్‌!

Published Tue, Jul 11 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

3 గంటలు డౌన్‌!

3 గంటలు డౌన్‌!

ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌ ఆరంభం నుంచే అవాంతరాలు
సాఫ్ట్‌వేర్‌ సమస్యతో అప్‌డేట్‌ కాని స్టాక్‌ ధరలు

ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను నిలిపేసిన ఎక్స్ఛేంజ్‌
పలుమార్లు ప్రయత్నించినా పరిష్కారం కాని సమస్య
వరుసగా మూడు గంటల పాటు సేవలు బంద్‌
చివరికి మధ్యాహ్నం 12.30కి ఆరంభమైన ట్రేడింగ్‌
మార్కెట్లు ముగిసే వరకూ సమస్యగానే రేట్ల అప్‌డేట్‌
సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్సే్ఛంజీని కోరిన సెబీ
తామూ పరిశీలిస్తున్నామన్న ఆర్థిక శాఖ
12.30 నుంచి సాధారణ కార్యకలాపాలు
బీఎస్‌ఈలో యథావిధిగా ట్రేడింగ్‌... పెరిగిన వ్యాపారం  



సమగ్ర నివేదికకు సెబీ ఆదేశాలు
సెబీ సైతం ఎన్‌ఎస్‌ఈ నుంచి సమగ్ర నివేదికను కోరింది. వ్యాపార ప్రణాళికలను సమీక్షించుకోవాలని, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు ఎదురు కాకుండా తీసుకోనున్న చర్యల్ని తెలియజేస్తూ వివరాలు అందిం చాలని ఆదేశించింది. ఎక్స్ఛేంజ్‌లో ఎదురైన సాంకేతిక అవాంతరాలు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించినవేనని, సైబర్‌ భద్రతకు సంబంధించినవి కావని, సాధారణ పరిస్థితి నెలకొందంటూ ఎన్‌ఎస్‌ఈ ప్రాథమికంగా తెలియజేసినప్పటికీ సెబీ పూర్తి స్థాయి నివేదిక కోరడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలో తలెత్తిన పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, భాగస్వాములను సంప్రదించడం ద్వారా ఈ తరహా పరిస్థితుల నివారణకు ఏం చేయాలన్న ది నిర్ణయించనున్నట్టు సెబీ తన ప్రకటనలో పేర్కొంది.

ముంబై: దేశంలో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ‘ఎన్‌ఎస్‌ఈ’ సోమవారం ఇన్వెస్టర్లను ఆందోళనలో ముంచేసింది. వారాంతంలో రెండు రోజుల విరామం అనంతరం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్టాక్స్‌ ధరలు అప్‌డేట్‌ కాకుండా ఆగిపోయాయి. పెట్టిన ఆర్డర్లు ఎగ్జిక్యూట్‌ కాకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. ఎన్‌ఎస్‌ఈలో స్టాక్స్‌ కొటేషన్లు సరిగ్గా లేవని, ఆర్డర్లను నమోదు చేయలేని పరిస్థితి ఎదురైందంటూ... బ్రోకింగ్‌ కంపెనీలన్నీ తమ క్లయింట్లకు మెసేజ్‌లు పంపాయి. సమస్యను గుర్తించిన ఎన్‌ఎస్‌ఈ... కొంత సేపటి తర్వాత ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్‌ను నిలిపివేసింది. దీంతో ఏమైందోనన్న గందరగోళం బాగా పెరిగిపోయింది. క్యాష్‌ మార్కెట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్యాష్‌ విభాగంతోపాటు, ఎఫ్‌అండ్‌వోలోనూ ట్రేడింగ్‌ నిలిపివేసినట్టు ఉదయం 10.30 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈ నుంచి ప్రకటన వెలుడింది.

సాంకేతిక విభాగం సమస్యను సరిచేసే పనిలో ఉందని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ తర్వాత తెలియజేస్తామని పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈ టెక్నికల్‌ విభాగం పలు దఫాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి మధ్యాహ్నం 12.15 గంటలకు సమస్యను సరిచేయగలిగింది. ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. అంతకుముందు క్యాష్‌ మార్కెట్‌ ప్రీ సెషన్‌ 12.15కు ప్రారంభమై 12.22–12.23కు ముగుస్తుందని, క్యాష్, ఎఫ్‌అండ్‌వోలో సాధారణ ట్రేడింగ్‌ 12.30కు ప్రారంభం అవుతుందని ఎన్‌ఎస్‌ఈ తన వెబ్‌సైట్లో పేర్కొంది. ఎఫ్‌అండ్‌వోలో 12.15–12.29 వరకు అవుట్‌స్టాండింగ్‌ ఆర్డర్లను క్యాన్సిల్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. డిస్‌ప్లేకు సంబంధించిన సమస్యను గుర్తించి సరిచేసినట్టు సమస్య పరిష్కారమైన తరవాత ఎన్‌ఎస్‌ఈ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ పరిస్థితిపై ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ క్షమాపణలు చెప్పింది.

మరో ఎక్సే్ఛంజీ బీఎస్‌ఈ మాత్రం  యథావిధిగానే పనిచేసింది. తాము ఎటువంటి సమస్యలూ ఎదుర్కోలేదని ప్రకటించింది. అయితే, ఈ అవాంతరాలు బీఎస్‌ఈకి వ్యాపార పరంగా కలిసొచ్చాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీ విభాగంలో బీఎస్‌ఈని ఆశ్రయించారు. దీంతో క్యాష్‌ విభాగంలో ట్రేడింగ్‌ వ్యాల్యూమ్స్‌ బాగా పెరిగాయి. 1995 నుంచి రోజువారీ సగటు టర్నోవర్‌ ఎన్‌ఎస్‌ఈలోనే అధికంగా జరుగుతూ వస్తోంది. కాగా, రూ.10,000 కోట్ల ఐపీవోకు ఎన్‌ఎస్‌ఈ సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితి ఎక్స్ఛేంజ్‌ను ఇబ్బంది పెట్టేదేనని విశ్లేషకులు చెబుతున్నారు.

నివేదిక కోరిన ఆర్థిక శాఖ
ఎన్‌ఎస్‌ఈలో సోమవారం ఎదురైన సాంకేతిక అవాంతరాలపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది. ఇది సాంకేతిక సమస్యేనని, హ్యాకింగ్‌కు సంబంధించి ఎటువంటి సమచారం లేదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధమైన సమస్య ఏర్పడడం తీవ్ర ఆందోళనకరమని, పరిస్థితిని సెబీ అనుక్షణం పర్యవేక్షిస్తోందని, భవిష్యత్తులో ఈ తరహా సమస్య మరోసారి ఎదురు కాదని ఆశిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఎస్‌ఎస్‌ఈ దీనిపై సెబీకి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక సెబీ ద్వారా మాకు కూడా అందుతుంది. ఈ లోపు సెబీ నుంచి మధ్యంతర నివేదిక వస్తుంది’’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. ఎన్‌ఎస్‌ఈలో నెలకొన్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని సెబీ నుంచి కూడా ప్రకటన జారీ అయింది.

మధ్యాహ్నం 12:30 వరకూ ఆందోళన
9.15  : మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సూచీలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. కానీ ఎస్‌ఎస్‌ఈలో ఎఫ్‌ అండ్‌ ఓ ఆర్డర్లు ఎగ్జిక్యూట్‌ అవుతున్నాయి తప్ప క్యాష్‌ మార్కెట్లో అమ్మేవారు ఎంత కోట్‌ చేస్తున్నారు? కొనేవారు ఎంత కోట్‌ చేస్తున్నారు అనే వివరాలు అప్‌డేట్‌ కాకుండా ఆగిపోయాయి.
9.55 : సమస్యను గుర్తించిన ఎన్‌ఎస్‌ఈ... ట్రేడింగ్‌ నిలిపివేసింది.
10.45 : రెండోసారి మార్కెట్‌ ప్రారంభానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఎఫ్‌ అండ్‌ ఓ, క్యాష్‌ సెగ్మెంట్లు రెండిట్లోనూ ఆర్డర్లు అప్‌డేట్‌ కావటం ఆగిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లలో గందరగోళం పెరిగిపోయింది. 11.15 గంటలకు ట్రేడింగ్‌ ప్రారంభమవుతుందని ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ (బిజినెస్‌) రవి వారణాసి ప్రకటించారు.
11.55 : ట్రేడింగ్‌ ప్రారంభించటానికి ప్రయత్నాలు చేసినా అప్పుడు కూడా సఫలం కాలేదు. ఇక ఈ రోజుకింతేనేమో అని ఇన్వెస్టర్లు భావించారు.
11.45 : మరోసారి ట్రేడింగ్‌ ప్రారంభించినప్పటికీ ఒక్క ట్రేడ్‌ కూడా నమోదు కాలేదు. చివరికి 12.15కు ప్రీ–ట్రేడింగ్‌ సెషన్‌ ప్రారంభమవుతుందని, 12.30కి ట్రేడింగ్‌ మొదలవుతుందని మరోసారి ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది.
12.15 : మూడు గంటల ఉత్కంఠకు తెర. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో సమస్యను సరిచేయగలిగారు. ప్రీ ట్రేడింగ్‌ సెషన్‌ ప్రారంభమయింది.
12.30 : ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో. ఎటువంటి అవాంతరాలు ఎదురు కాలేదు. కాకపోతే చివరిదాకా ఒకోసారి అమ్మే–కొనే కోట్స్‌ డిస్‌ప్లే కాకపోవటం, ఒకోసారి రిఫ్రెష్‌ కాకపోవటం వంటి సాంకేతిక సమస్యలు కొనసాగాయని పలువురు ట్రేడర్లు వాపోయారు.
3.30 :  మార్కెట్లు ముగిశాయి. ‘‘ప్రారంభంలోనే క్యాష్‌ మార్కెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎఫ్‌అండ్‌వో విభాగం సాధారణంగానే ప్రారంభమైంది. అయితే, క్యాష్‌ విభాగంలో సమస్య కారణంగా ఎఫ్‌అండ్‌వోను సైతం నిలిపివేశాం’’ అని ఎన్‌ఎస్‌ఈ నుంచి ప్రకటన వెలువడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement