కూడేరులో ఎనర్జీ వర్సిటీ
– తాత్కలికంగా జేఎన్‌టీయూలో సెప్టెంబర్ నుంచి తరగతులు
– జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ వీసీ కె.రాజగోపాల్ వెల్లడి
జేఎన్‌టీయూ : జిల్లాలోని కూడేరు వద్ద ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వర్సిటీ భవన నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై ఎనర్జీ యూనివర్సిటీ ప్రతినిధుల బుధవారం జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ వీసీతో సంప్రదింపులు జరిపారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ , ఏఐసీటీఈ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్ మంతా, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్‌బాబు, జేఎన్‌టీయూ రెక్టార్ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఈసీ మెంబర్ సి.శశిధర్, ప్రొఫెసర్ బి.ప్రహ్లాదరావు తదితరులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయులో తరగతులు..
ఎనర్జీ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్, తరగతులు జేఎన్‌టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాలలోనే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చామని ఇన్‌చార్జ్ వీసీ కె.రాజగోపాల్ తెలిపారు. తరగతి గదులకు అవసరమయ్యే భవనాలు, ల్యాబ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి ఎనర్జీ వర్సిటీ తరగతులు జేఎన్‌టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమవుతాయన్నారు.