ఎస్కేయూ(అనంతపురం):
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి పరీక్ష విధానం మార్గదర్శకాలు రూపొందించడం కోసం రెండు రోజుల్లో కమిటీని నియమించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. మొదట ఉమ్మడి పరీక్ష నిర్వహించి.. అనంతరం ఇంటర్వ్యూలను ఆయా వర్సిటీలు చేపట్టేలా నిర్ణయించామన్నారు. ఉమ్మడి పరీక్ష ఎవరు నిర్వహించాలనే అంశంపై కసరత్తు మొదలైందన్నారు. ఇంజనీరింగ్, హ్యూమనిటీస్, సైన్సెస్.. ఇలా ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి ఒక్కో వర్సిటీకి ఉమ్మడి పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించే విషయంపై అధ్యయనం చేస్తున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు.