బోనస్.. బోగస్
► డిగ్రీలో జంబ్లింగ్ విధానంతో తగ్గిన ఉత్తీర్ణత
► ప్రతి సబ్జెక్ట్‌కు 15 మార్కులు కలిపి ఉత్తీర్ణత శాతం పెంపు
► రీవాల్యుయేషన్‌లో నిగ్గుతేలుతున్న నిజాలు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని యూజీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. ఒక దఫా ఫెయిల్, మరో దఫా ఉత్తీర్ణత ఇలా ఏరకమైన ఫలితం వస్తుందో విద్యార్థులకు దిక్కతోచని స్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
‘జంబ్లింగ్ ’ విధానం తెచ్చిన తంటా :
యూజీ పరీక్ష కేంద్రాల్లో జంబింగ్ విధానం ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ పరీక్షలు కట్టుదిట్టంగా జరిగాయి. దీంతో ఆ ప్రభావం ఫలితాలపై పడింది. మొదట్లో కేవలం 10 శాతమే ఉత్తీర్ణత వచ్చినట్లు అధికారులకు అర్థమైంది. దీంతో విషయాన్ని పైస్థాయి అధికారులకు తెలిపారు. 10 అదనంగా మార్కులు వేయాలని అధికారులు సూచించినా ఉత్తీర్ణత శాతం 20కి మించలేదు. ఆఖరికి ప్రతి సబ్జెక్టుకు 15 మార్కులు కలపడంతో 32 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఎక్కువ మంది విద్యార్థులు 30 మార్కుల దగ్గరే ఆగిపోయారు. దీంతో ఈ ఏడాది ఏకంగా 15 వేల మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
విద్యార్థుల జేబులకు చిళ్లు
బోనస్ మార్కుల ఫలితంగా విద్యార్థులు ఒక్కొక్కరు 4 ,5 సబ్జెక్టులకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేశారు. కారణమేమిటంటే ఉదాహరణకు 25 మార్కులు వచ్చిన విద్యార్థికి అసలు మార్కులు 10 మాత్రమే వచ్చి ఉంటాయి. రీవాల్యుయేషన్‌లో ఈ 10 మార్కులు పెరిగితేనే పెరిగినట్టు నిర్ధారిస్తారు. లేదంటే పాత మార్కులు వచ్చినట్టు ధ్రువపరుస్తారు. విద్యార్థులు ఆశావహ దృక్పథంతో రూ.60 లక్షల రూపాయలు రీవాల్యుయేషన్ ఫీజులు చెల్లించినా వారికి ఒరిగిందేమీలేదు. కేవలం వర్సిటీకి ఆదాయం చేకూరిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, మూడు, నాలుగు సబ్జెక్టులకు రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకోగా, ఒక్క సబ్జెక్టుకు మాత్రమే ఫలితాలు ప్రకటించారు. తక్కిన మూడు సబ్జెక్టులకు ఫలితాలు రావడం లేదు. కాగా, ఎస్కేయూ చరిత్రలో ఎస్కేయూసెట్–2016లో అర్హత మార్కులు పెంపు, డిగ్రీ పరీక్షల్లో అదనపు మార్కులు వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీన్ని బట్టి డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయో ఇట్టే అర్థం అవుతోందని విద్యావేత్తలు భావిస్తున్నారు.
ఉన్నతాధికారుల సూచనతోనే బోనస్ మార్కులు
ఉన్నతాధికారుల సూచనల మేరకు 15 బోనస్ మార్కులు వేశాము. జంబ్లింగ్ విధానం ద్వారా ఉత్తీర్ణత శాతం తగ్గుముఖం పట్టింది. దీంతో నిబంధనల మేరకు బోనస్ మార్కులు కలిపాము. కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయాలు అమలు చేశాము.
–ఆచార్య జీవన్‌కుమార్, యూజీ డీన్, ఎస్కేయూ.