– జులై 20 వరకు దరఖాస్తుకు అవకాశం
– ఆగస్టులో స్నాతకోత్సవం
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం(కాన్వొకేషన్) ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థులకు ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి జులై 20 చివరి తేదీగా నిర్ణయించారు. తొలిసారిగా కాన్వొకేషన్ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఫీజును సైతం ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మీ సేవ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. దరఖాస్తు పూర్తయ్యి, ఫీజును చెల్లించిన తర్వాత హార్డ్‌కాపీని ‘ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్, ఎస్కేయూ, అనంతపురం ’ చిరునామాకు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపాలి. 2014, 15, 16 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య), ఎం.ఫిల్, పీహెచ్‌డీ (రెగ్యులర్) పూర్తి చేసిన వారికి కాన్వొకేషన్ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. వీరే కాకుండా అంతకుముందే ఉత్తీర్ణతులై.. కాన్వొకేషన్ సర్టిఫికెట్ తీసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే..వారు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు, ఆన్‌లైన్ దరఖాస్తు తదితర పూర్తి వివరాలను ఠీఠీఠీ.టజుunజీఠ్ఛిటటజ్టీy.్చఛి.జీn అనే వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్నాతకోత్సవాన్ని ఆగస్టులో ఏ తేదీన నిర్వహిస్తారనే విషయాన్ని గవర్నర్ ముందస్తు అనుమతితో వెల్లడించనున్నారు.
ఎస్కేయూ కాన్వొకేషన్ నోటిఫికేషన్ విడుదల
Published Fri, Jun 16 2017 9:57 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement