ఎస్కేయూ :
చక్కగా పరీక్షలు రాశాం.. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. అని డిగ్రీ సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ తమ భవితవ్యాన్ని గొప్పగా ఊహించుకున్నారు. తీరా ఫలితాలు తారుమారు కావడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం రెగ్యులర్ డిగ్రీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైందన్నదానికి ఇదీ నిదర్శనం. ఫలితాల జాబితాలో చూస్తే పరీక్షలకు హాజరైనా గైర్హాజరు అయినట్లు చూపుతోంది. విద్యార్థులు తమ సబ్జెక్టులను రీవ్యాల్యుయేషన్ పెట్టించాలా.. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలా? అన్నదానిపై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈనెల 30న తుది గడువు ముగియనుంది. యూజీ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారైంది.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్ (రెగ్యులర్ ఫలితాలు) శనివారం విడుదల చేశారు. ఫలితాలు తారుమారు కావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షలకు హాజరైన గైర్హాజరు అయినట్లు ఫలితాలు ప్రకటించడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కొందరు అగళి డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల అనంతపురం విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఫలితాలు ప్రకటించారు. యూజీ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఫలితాలు తారుమారు అయ్యాయని కళాశాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది నుంచి ఇలాంటి తప్పిదాలు పునరావృతం అవుతున్నా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో యూజీ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం కొరవడింది.
ఒక సబ్జెక్టుకు బదులు మరో సబ్జెక్టు :
డిగ్రీ మొదటి, రెండు, మూడో సంవత్సరం రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్‌కు విద్యార్థులు ఫీజు కట్టిన సబ్జెక్టు కాకుండా మరో సబ్జెక్టుకు రీవాల్యుయేషన్ చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఎస్కేయూ యూజీ విభాగం వద్ద పడిగాపులు కాస్తున్నారు. తీరా యూజీ విభాగం అధికారుల దృష్టికి తీసుకువస్తే ఫీజు చెల్లించిన చలానాలు చూపిస్తే.. రీవాల్యుయేషన్‌కు జవాబు పత్రాలు పంపుతున్నారు. వేలాది ఫెండింగ్ కేసులు ఇలాంటివి ఉన్నాయి. అయితే డిగ్రీ రెగ్యులర్, రీవాల్యుయేషన్‌లో ఫెయిల్ అయినవారు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెలాఖరులోపు సప్లిమెంటరీ ఫీజు కట్టాలని నిర్దేశించారు. పెండింగ్‌లో రీవాల్యుయేషన్ ఫలితాలు ప్రకటించకపోవడంతో విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
ఇంటర్నల్ మార్కులు పంపలేదు
ఆయా కళాశాలలు విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు పంపకపోవడంతో ఫలితాలు ప్రకటించలేదు. ఎన్నో సార్లు హెచ్చరించినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తం కాలేదు. ఇంటర్నల్ మార్కులు అందగానే ఫలితాలు సవరిస్తాం.
– శ్రీరాములు నాయక్, డిప్యూటీ రిజిస్ట్రార్, ఎస్కేయూ యూజీ విభాగం