త్వరలో ఈ-మార్క్స్‌కార్డులు | e marks cards coming soon | Sakshi
Sakshi News home page

త్వరలో ఈ-మార్క్స్‌కార్డులు

Published Fri, Feb 3 2017 11:07 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

e marks cards coming soon

– ప్రిన్సిపాళ్ల సమావేశంలో వీసీ ఆచార్య కే రాజగోపాల్‌
ఎస్కేయూ : విద్యార్థుల సంక్షేమమే అంతిమ లక్ష్యమని, విద్యార్థులు మార్క్స్‌ కార్డుల కోసం వర్సిటీకి రాకుండా ఈ – మార్క్స్‌ కార్డుల జారీ విధానం అందుబాటులోకి తెస్తామని ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెనెట్‌ హాల్‌లో వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దూరవిద్య పరీక్షల్లో ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాలు పంపే విధానం విజయవంతమైందన్నారు. అదే తరహాలోనే రెగ్యులర్‌ డిగ్రీ పరీక్షలకు సైతం ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాలు పంపే విధానం అమలు చేస్తామన్నారు. ‘ఎలక్ట్రానికల్లీ డిస్ట్రిబ్యూటెడ్‌ ఎగ్జామినేషన్స్‌ పేపర్స్‌ ’ (ఈడీపీఎఫ్‌) అమలు చేసే తీరుతెన్నులు, సాధ్యాసాధ్యాలు వివరించారు.

ఈడీపీఎఫ్‌ అమలు చేయడంతో ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్య ఉత్పన్నం కాదన్నారు. నిర్దేశించిన పరీక్ష సమయానికి గంట ముందు పాస్‌వర్డ్‌ తెలియజేస్తారన్నారు. అనుబంధ డిగ్రీ కళాశాలలకు కంప్యూటర్, యూపీఎస్, ప్రింటర్స్, నెట్‌వర్క్‌ సౌకర్యం, జిరాక్స్‌ మిషన్‌ వర్సిటీ కల్పిస్తుందన్నారు. విద్యార్థులు మార్క్స్‌ కార్డుల కోసం వర్సిటీకి రాకుండా ఈ –మార్క్స్‌ కార్డులు విధానం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనుబంధ డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకట రమణ, సీడీసీ డీన్‌ ఆచార్య కె.లక్ష్మిదేవి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ఆచార్య రెడ్డి వెంకట రాజు, ఆచార్య రామ్మూర్తి, ఆచార్య మునినారాయణప్ప, ఆచార్య తులసీనాయక్, సీఈ ఎంఏ ఆనంద్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement