ప్రతి సంవత్సరం యాపిల్ కంపెనీ కొత్త సిరీస్ లాంచ్ చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా సంస్థ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను రాబోయే రోజుల్లో యాపిల్ నిర్వహించనున్న ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు.
గత ఏడాది యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12న ఆవిష్కరించింది. దీన్ని బట్టి చూస్తే వచ్చే సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 సిరీస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ హై-ఎండ్ ఫీచర్‌లకు సపోర్ట్ చేయడానికి ఏ18 ప్రో పొందనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 సీరీస్‌తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఓఎస్ 18 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
గత సంవత్సరం యాపిల్ ఐఫోన్ 15 ప్రో కోసం యాక్షన్ బటన్ పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్ వనిల్లా ఐఫోన్ 15లో లేదు. కానీ ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో ఈ యాక్షన్ బటన్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. దీనితోపాటు క్యాప్చర్ బటన్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఫోటో టేకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రెండూ కూడా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే కూడా పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లే 6.1 ఇంచెస్ నుంచి 6.3 ఇంచెస్‌కు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.7 ఇంచెస్ నుంచి 6.9 ఇంచెస్ డిస్‌ప్లే పొందవచ్చు. వీటి బరువు కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment