ఎస్కేయూ: నియామకాలు.. పదోన్నతులు.. వేతనాల పెంపు.. ఒక్కటేమిటి, ఎస్కేయూలో అడ్డగోలు నిర్ణయాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. కుల కుంపటి రేపుతున్న చిచ్చు వివాదాలకు కారణమవుతోంది. ఒక సామాజిక వర్గం ఉద్యోగులకే పెద్దపీట వేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇతర సామాజిక వర్గాల ఉద్యోగులను పక్కనపెడుతూ.. అనుకూలమైన వారిని గుట్టుచప్పుడు కాకుండా అందలం ఎక్కిస్తున్నారు. రెండు నెలల క్రితం దూరవిద్య బీఈడీ విభాగంలో అడ్‌హాక్ అసోసియేట్ ప్రొఫెసర్‌ను నియామకం పూర్వాపరాలను పరిశీలిస్తే ఉన్నతోద్యోగులు ఎంతగాదిగజారి వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.
ఒకే అంశంపై 45 నిమిషాల చర్చ
రాయలసీమ వర్సిటీ రిజిస్ట్రార్‌పై భౌతిక దాడికి పాల్పడిన అడ్‌హాక్ అసోసియేట్ ప్రొఫెసర్‌పై చర్యల విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్కేయూ ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ నియమించి నివేదిక సిద్ధం చేశామని.. అసోసియేట్ ప్రొఫెసర్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. వాస్తవానికి అడ్‌హాక్ అసోసియేట్ ప్రొఫెసర్‌పై చర్యలంటే ఉద్యోగం నుంచి తొలగించాలి. కానీ సస్పెన్షన్‌తో చేతులు దులుపుకోవడం గమనార్హం. ఇంతటితో ఆగలేదు.. రెండు నెలలు తిరక్కుండానే తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు మొదలుపెట్టారు. గత నెల 31న నిర్వహించిన పాలకమండలి సమావేశం రెండు గంటల పాటు సాగితే.. 45 నిముషాలు అసోసియేట్ ప్రొఫెసర్‌ను ఎందుకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకూడదనే విషయంపైనే కావడం గమనార్హం.
అడ్డగోలు నిర్ణయాలు
♦ ఎస్కేయూ ఇంజినీరింగ్ విభాగంలో ఓ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగికి అడ్డగోలుగా పదోన్నతి కల్పించారు. అసిస్టెంట్ ఇంజినీర్‌గా పదోన్నతి కల్పించాలంటే తప్పనిసరిగా డిప్లమో/ఇంజినీరింగ్ చదివి ఉండాలి. కానీ ఐటీఐ పూర్తి చేసిన ఉద్యోగికి ఏకంగా అసిస్టెంట్ ఇంజినీర్‌గా పదోన్నతి కట్టబెట్టారు. వాస్తవానికి ఇతని నియామకమే రోస్టర్ పాయింట్‌కు విరుద్ధం కావడం గమనార్హం.
♦ అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారికి ఏకంగా అసోసియేట్ ప్రొఫెసర్ హోదా కల్పించారు. వాస్తవానికి బోధన సిబ్బందికి మినహా తక్కిన వారికి అడ్వాన్సెమెంట్ స్కీం(సీఏఎస్) ద్వారా పదోన్నతి కల్పించరాదు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి స్థాయి నుంచి మూడింతల హోదాతో సమానమైన అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి కట్టబెట్టారు. జీతభత్యాలు అదే తరహాలో అందేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. సీఏఎస్ ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకోకపోతే.. అదే రోజే దరఖాస్తు చేసుకోమని కబురు పెట్టారు. దీంతో ఇంటర్వ్యూలో ఏమీ చెప్పకపోయినా.. అర్హత కల్పించారు. ఇదే తరహాలోనే మరో ఇద్దరు అధికారులు లైబ్రరీలో ఉన్నారు. కానీ వారికి ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం గమనార్హం. కనీసం సీఏఎస్‌కు దరఖాస్తు చేసుకోనివ్వకపోగా.. ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. కారణం వీరు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోవడమేననే తెలుస్తోంది.
పట్టని టీచింగ్ అసిస్టెంట్ల వేదన
తమను విధుల్లోకి తీసుకోవాలని గత 20 రోజులుగా టీచింగ్ అసిస్టెంట్‌లు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగం ఇస్తారా? లేదా అనే విషయం పక్కనబెడితే.. దీక్షలో స్పృహ కోల్పోయి అస్వస్థతకు లోనైన ఓ మహిళ టీచింగ్ అసిస్టెంట్‌ను కనీసం ఉన్నతాధికారులు పరామర్శించిన పాపాన పోలేదు. ఓ సామాజిక వర్గం ఉద్యోగులకు లేని అధికారాలను కట్టబెడుతున్న ఉన్నతోద్యోగులు.. ఇలాంటి చిరుద్యోగుల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
విచారణ చేపడతాం
దూరవద్య అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరి నియామకంపై విచారణ చేపడతాం. రాయలసీమ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌పై దాడికి సంబంధించి కేసు పత్రాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపడతాం. రెండవ దఫా ప్రొఫెసర్ల కమిటీని నియమిస్తాం.– ఎంసీఎస్ శుభ, ఇన్‌చార్జి వీసీ, ఎస్కేయూ
Comments
Please login to add a commentAdd a comment