సిద్దవటం: కడప–చెన్నై ప్రధాన రహదారిలోని కనుమలోపల్లె గ్రామ సమీపంలో ఉన్న శనేశ్వరస్వామి ఆలయం మలుపు వద్ద మంగళవారం ద్విచక్రవాహనం (స్కూటీ)ని, బొలేరో ఐస్ వాహనం ఢీకొన్న సంఘటనలో గోగుల లక్ష్మిసుబ్బమ్మ (25) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామ పంచాయతీ రామక్రిష్ణపురం గ్రామానికి చెందిన లక్ష్మిసుబ్బమ్మ కడప నగరంలోని స్పెన్సర్ దుకాణంలో పనిచేస్తుంది. ప్రతిరోజు ఆమె స్వగ్రామం నుంచి కడపకు స్కూటీలో వెళ్లి తిరిగి స్వగ్రామానికి చేరుకునేది. మంగళవారం కూడా యథావిధిగా స్కూటీలో డ్యూటీకి బయలుదేరింది. కనుమలోపల్లె గ్రామ సమీపంలోని మందగిరి శనేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న మలుపు వద్దకు రాగానే కడప నుంచి తిరుపతికి వెళుతున్న బొలేరో ఐస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మిసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న సిద్దవటం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.