ధరూరు: బతుకుదెరువు కోసం ఆటోలో బయల్దేరిన ఆ కుటుంబాన్ని బొలెరో రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని పారుచర్ల సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గద్వాలలోని దౌదర్‌పల్లికి చెందిన బొప్పలి జమ్ములమ్మ(55), ఆమె కుమారుడు అర్జున్ (24), కోడలు వైశాలి (22) పల్లెల్లో నిత్యం బొంతలు కుట్టడం..పాత చీరలు అమ్మడం వంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తమ ఆటోలో గద్వాల నుంచి రాయ్‌చూరుకు బయల్దేరారు. మార్గంలోని పారుచర్ల–ధరూరు గ్రామాల మధ్య రాయ్‌చూరు వైపు నుంచి వచ్చి న బొలెరో, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న జమ్ములమ్మ, అర్జున్, వైశాలి అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే వాహనదారులు, చుట్టుపక్కల పొలాల రైతులు అక్కడికి చేరుకుని ఆటోలో ఇరుక్కున్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
బొలెరోలో పెబ్బేరులో జరిగే సంతకు రైతులు ఎద్దులతో వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్‌తోపాటు మిగతా వారు పరారయ్యారు. అయితే అర్జున్‌కు మూడు నెలల క్రితమే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వైశాలితో వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు. రేవులపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment