
అధికారుల పాపం..
- వికలాంగ విద్యార్థులపై వివక్ష
– యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
– సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు
–ర్యాంపులు , ప్రత్యేక మరుగుదొడ్లు లేని వైనం.
– ఏటా యూజీసీ నిధులు దారి మళ్లింపు
ఎస్కేయూ : వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో వికలాంగ విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో అధికారుల ఉదాశీనతగా వ్యవహరని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. వర్సిటీలోని నాలుగు క్యాంపస్ కళాశాలలో ఫిజికలీ చాలెంజ్‌డ్ విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ, బీఈడీ , లా, ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎంఫిల్ కోర్సులు చేస్తున్నారు. భారత ప్రభుత్వం 2006లో ప్రకటించిన జాతీయ వికలాంగ విధానం అమలులో భాగంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వర్సిటీ సమగ్ర సమీక్ష జరపాలి. అయితే వీరి సంక్షేమానికి ఆ దిశగా బడ్జెట్ కేటాయింపులు ఇంత వరకు వర్సిటీ నామమాత్రంగానైనా కేటాయించిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పాలక భవనం మినహా :
తరగతులు, ల్యాబ్, గ్రంథాలయాల్లో ఎక్కడ కూడా ర్యాంప్స్ లేని పరిస్థితి నెలకొంది. గతేడాది ఏప్రిల్ 29న ఎస్కేయూకు న్యాక్ కమిటీ రావడతో హడావుడిగా పాలకభవనానికి ర్యాంపు సౌకర్యం కల్పించారు. వికలాంగ విద్యార్థులకు అన్నింటా సౌకర్యాలు కల్పించాలని గతేడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. లైబ్రరీలో ప్రత్యేకంగా వీరి కోసం ఏర్పాటు చేసిన సెల్‌ను పూర్తిగా మూసేశారు. వాటిలో ఏర్పాటు చేసిన 7 కంప్యూటర్లు రెండు సంవత్సరాలుగా పనిచేయడం లేదు.
మెస్ బిల్లుల్లో మినహాయింపు లేదు..
ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాల్లో వికలాంగ విద్యార్థులకు మెస్ బిల్లులో పూర్తి మినహాయింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జీవో 27 ప్రకారం ఏపీలోని వర్సిటీల్లో దీనిని అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. ఉన్నత విద్యాశాఖ ఈ మేరకు విశ్వవిద్యాలయాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం లేదు.
ప్రత్యేక వసతి ఏదీ ... ?..
విశ్వవిద్యాలయాల్లో వీరికి చేయూత నివ్వడానికి ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దేవాలయం కన్న శౌచాలయం మిన్న అని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరుగుదొడ్లను నిర్మాణం చేస్తుంటే వీరి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మించలేదు.
యూజీసీ నిధుల దారి మళ్లింపు..
దృష్టి లోపం (విజువల్) వారికి కేటాయించే సహాయకులకు అందించే మొత్తం (స్కైబ్)కు ఏడాదికి రూ. 2 వేలు చొప్పున ఇవ్వాలి. వీరి కోసం ప్రత్యేకించి పరికరాల పంపిణీకి ఏడాదికి రూ.8 లక్షలు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ) నుంచి నిధులు మంజూరు అవుతున్నాయి. వీరికి ఉపయోగించాల్సిన నిధులను దారిమళ్లించి ఇతరత్రా అవసరాలకు వినియోగించారు.
మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నాం..
మూడు సంవత్సరాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళనలు నిర్వహించాము. అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఎస్కేయూ మినహా తక్కిన వర్సిటీలలో కేవలం రూ.10లు నామమాత్రం ఫీజుతో పూర్తిగా మెస్‌బిల్లుల మినాహాయింపు వెసులుబాటు కల్పిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోలను కూడా పట్టించుకోలేదు.
–కొంకా మల్లిఖార్జున, పీహెచ్‌డీ విద్యార్థి , ఎస్కేయూ.